బెంగళూరు: మంత్రి పదవుల పంపకంపై కాంగ్రెస్–జేడీఎస్‌ల మధ్య అంగీకారం కుదిరింది. కర్ణాటక కేబినెట్‌లో మొత్తం 34 మంది మంత్రులకు గాను కాంగ్రెస్‌కు 22, సీఎంతో కలిపి జేడీఎస్‌కు 12 మంత్రి పదవులు ఇవ్వాలని ఇరు పార్టీల నేతలు అంగీకారానికి వచ్చారు. ఉప ముఖ్యమంత్రి పదవి కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు జి.పరమేశ్వరను వరించింది. స్పీకర్ పదవి కాంగ్రెస్‌కు, డిప్యూటీ స్పీకర్ జేడీఎస్‌కు దక్కనున్నాయి. అయితే బలనిరూపణ తర్వాతే మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
మంత్రి పదవులు దక్కని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయవచ్చన్న సంకేతాల నేపథ్యంలో వీలైనంత త్వరగా బలపరీక్ష ముగించుకుని మంత్రి వర్గాన్ని విస్తరించాలనే ఆలోచనలో కాంగ్రెస్, జేడీఎస్ ఉన్నాయి. మంత్రివర్గ కూర్పుపై కాంగ్రెస్ నేతలతో భేటీ అనంతరం కుమారస్వామి మాట్లాడుతూ.. నేను, పరమేశ్వర బుధవారం ప్రమాణస్వీకారం చేస్తాం. కేబినెట్ విస్తరణకు సంబంధించి ఈ రోజు నిర్ణయం తీసుకున్నాం.
మే 25న స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఉంటుంది. అసెంబ్లీలో బల పరీక్ష అనంతరం కూటమిలోని మంత్రుల పేర్లను వెల్లడిస్తాం. అంతా సజావుగానే ఉంది. ఎలాంటి విభేదాలు లేవు’ అని పేర్కొన్నారు. మంత్రివర్గ కూర్పుపై మంగళవారం సాయంత్రం కాంగ్రెస్, జేడీఎస్ నేతలు సుదీర్ఘంగా చర్చించారు. తమకే ఎక్కువ పదవులు దక్కాలని కాంగ్రెస్ పట్టుబట్టడంతో ఆ పార్టీకి 22 మంత్రి పదవులు ఇచ్చేందుకు జేడీఎస్ అంగీకరించింది. జేడీఎస్‌కు సీఎంతో కలిసి 12 మంత్రి పదవులే దక్కనున్నాయి. బలనిరూపణ అనంతరం శాఖల కేటాయింపు ఉంటుందని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ కేసీ వేణుగోపాల్ చెప్పారు. అసెంబ్లీ స్పీకర్‌గా కాంగ్రెస్ ఎమ్మెల్యే కేఆర్ రమేష్ పేరు దాదాపు ఖరారైంది.
ప్రమాణస్వీకారానికి సర్వం సిద్ధం
కర్ణాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. సాయంత్రం 4.30 గంటలకు ఆ రాష్ట్ర 24వ ముఖ్యమంత్రిగా బెంగళూరులోని అసెంబ్లీ భవనం విధానసౌధ ముందు ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆయనతో పాటు కాంగ్రెస్ నేత జి.పరమేశ్వర డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేయనున్నారు. ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఉంటారని ప్రచారం జరిగినా.. జేడీఎస్ అంగీకరించకపోవడంతో చివరకు ఒకరికే అవకాశం కల్పించారు.
ప్రమాణ స్వీకారానికి కుమారస్వామి సిల్కు చొక్కా, పట్టు పంచెతో హాజరవుతారు. తొలుత విధానసభ ప్రాంగణంలో పూజలు నిర్వహించనున్నారు. ప్రమాణస్వీకార ప్రాంగణంలో వీఐపీలు కూర్చోడానికి వీలుగా మూడు వేలకు పైగా కుర్చీలు ఏర్పాటు చేశారు. ఈ నెల 17న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప సీఎంగా ప్రమాణం చేయడం, బల నిరూపణకు ముందే 19వ తేదీన రాజీనామా చేయడం తెలిసిందే. దీంతో 37 సీట్లున్న జేడీఎస్, 78 సీట్లున్న కాంగ్రెస్ కలసి కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాయి.
ఒకే వేదికపై విపక్ష నేతలు, సీఎంలు
బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ ఏకమయ్యేందుకు, రాజకీయ శక్తుల పునరేకీకరణకు ఈ కార్యక్రమం వేదికగా మారనుంది. కుమారస్వామి ప్రమాణస్వీకారానికి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, పశ్చిమబెంగాల్, ఢిల్లీ, కేరళ, ఏపీ, ఒడిశా సీఎంలు మమతా బెనర్జీ, కేజ్రీవాల్, విజయన్, చంద్రబాబు, నవీన్ పట్నాయక్, ఎస్పీ చీఫ్ అఖిలేశ్, బీఎస్పీ చీఫ్ మాయావతి, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, ఎంఎన్‌ఎం నేత కమల్ హాసన్ తదితరులు హాజరవుతున్నారు.
వీరితో పాటు పవన్ కల్యాణ్, అంబరీష్ కూడా హాజరవుతారని సమాచారం. ఈ నేపథ్యంలో సుమారు రెండు వేల మందికి పైగా పోలీసులతో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.ప్రమాణ స్వీకారానికి హాజరవుతానని డీఎంకే నేత ఎంకే స్టాలిన్ మొదట ప్రకటించినా.. తూత్తుకూడిలో అల్లర్ల నేపథ్యంలో తాను రావడం లేదని ట్వీట్ చేశారు. యూపీలో గోరక్‌పూర్, పూల్పూరు ఉప ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు ఒక్కటైన సమాజ్‌వాదీ, బీఎస్పీ అధినేతలు అఖిలేశ్, మాయావతిలు ఒకే వేదికపై కనిపించనున్నారు.
శివకుమార్‌ని నేను వ్యతిరేకించలేదు: దేవెగౌడ
డీకే శివకుమార్‌ని డిప్యూటీ సీఎంగా తాను వ్యతిరేకించానంటూ వచ్చిన వార్తల్ని జేడీఎస్ అధినేత హెచ్‌డీ దేవెగౌడ తోసిపుచ్చారు. వాళ్ల పార్టీ నుంచి ఎవరు డిప్యూటీ సీఎం లేదా మంత్రి అవ్వాలన్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీనే నిర్ణయించుకుంటుందని చెప్పారు. మరోవైపు, శివకుమార్ స్పందిస్తూ.. పదవి విషయంలో హైకమాండ్ ఆదేశాల్ని పాటిస్తానని స్పష్టంచేశారు.
సంకీర్ణం సవాలే: కుమార స్వామి
ఐదేళ్లపాటు కాంగ్రెస్–జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపడం తనకు పెద్ద సవాలని కుమారస్వామి పేర్కొన్నారు. మంగళవారం శృంగేరీ పీఠాన్ని దర్శించుకున్న అనంతరం మాట్లాడుతూ ‘నా జీవితంలో ఇదో పెద్ద సవాలు. ముఖ్యమంత్రిగా నా బాధ్యతల్ని సులువుగా నిర్వర్తించగలనని నేను భావించడం లేదు. ఈ ప్రభుత్వం సజావుగా సాగుతుందా? లేదా? అని కర్ణాటక ప్రజలకు కూడా అనుమానం ఉంది. అయితే దేవుని దయ వల్ల అంతా సక్రమంగా జరుగుతుందని నాకు నమ్మకముంది’ అని చెప్పారు. ధర్మస్థలలోని మంజునాథ స్వామిని కూడా ఆయన దర్శించుకున్నారు.
కింగ్‌మేకర్ కాదు.. కింగే!
సాక్షి, బెంగళూరు: కుమారన్న అలియాస్ హెచ్‌డీకే అలియాస్ కుమారస్వామి రెండోసారి ముఖ్యమంత్రి పీఠం ఎక్కబోతున్నారు. అత్యధిక సీట్లు గెలుచుకున్న బీజేపీ, మొన్నటి దాకా అధికారంలో ఉన్న కాంగ్రెస్ కాకుండా కింగ్‌మేకర్ అంటూ అందరి దృష్టిలో పడిన జేడీఎస్ నేతృత్వంలో కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పడబోతోంది. అనేక నాటకీయ పరిణామాల మధ్య కేవలం 37 సీట్లు గెలుచుకున్న జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కుమారస్వామిని ముఖ్యమంత్రి కుర్చీ వెతుక్కుంటూ వచ్చింది.
మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ, చెన్నమ్మ దంపతులకు మూడో సంతానంగా 1959 డిసెంబర్ 16న హాసన్ జిల్లా హరదనహళ్లిలో కుమారస్వామి జన్మించారు. బాల్యం, విద్యాభ్యాసం మొత్తం హాసన్ జిల్లాలోనే సాగింది. అనంతరం బెంగళూరులోని నేషనల్ కాలేజీలో బీఎస్సీ పూర్తి చేశారు. 1986 మార్చి 13న అనితతో వివాహమైంది. ఏడాదిలో కొడుకు నిఖిల్‌గౌడ జన్మించారు. అనంతరం 2006లో సినీ నటి రాధికతో కుమారస్వామికి రెండో వివాహమైంది. వారికి షమిక అనే కుమార్తె ఉంది. కుమారకు రేవణ్ణ, బాలకృష్ణగౌడ అనే ఇద్దరు అన్నలు ఉన్నారు. అయితే, చిన్నవాడైన కుమారపై దేవెగౌడకు గురి ఎక్కువ. కారణం.. కుమారస్వామి పట్టుదల, రాజకీయ వ్యూహాలు. కుమారస్వామి ‘చెన్నాంబిక’ బ్యానర్‌పై పలు కన్నడ హిట్ సినిమాలు నిర్మించారు.
రామనగర జిల్లా కనకపుర స్థానం నుంచి 1996లో తొలిసారిగా ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. 1998లో జరిగిన ఎన్నికల్లో తన తండ్రి హెచ్‌డీ దేవెగౌడ ప్రధానిగా ఉన్న సమయంలో కుమారస్వామి కనకపుర నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 1999 అసెంబ్లీ ఎన్నికల్లో సాతనూరు నుంచి, 2004లో రామనగర నుంచి గెలుపొంచారు. 2006లో బీజేపీతో జతకట్టి ముఖ్యమంత్రి అయ్యారు. సుమారు 20 నెలల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment