
సాక్షి, న్యూఢిల్లీ: గణేశ్ నిమజ్జం సందర్భంగా పలు రాష్ట్రాల్లో విషాదం చోటుచేసుకుంది. మహారాష్ట్రతో పాటు భోపాల్‌లో సుమారు 28 మంది దుర్మరణం చెందగా, పలువురు గల్లంతు అయ్యారు. ఒక్క మహారాష్ట్రలోనే 17మంది నిమజ్జనం సందర్భంగా నీట మునిగారు. మరో అయిదుగురు గల్లంతు అయ్యారు. అమరావతిలో నలుగురు, రత్నగిరిలో ముగ్గురు, నాసిక్, సింధుదుర్గ్, సతరాలో ఇద్దరు చొప్పున, థానే, ధులే, బుల్దానా,భందారాలో ఒక్కొక్కరు మృతి చెందారు.
ఇక భోపాల్‌లో ఖట్లపురా ఘాట్ వద్ద పడవ బోల్తా పడటంతో 11 మంది దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. ప్రమాదం జరిగిన సమయంలో పడవలో 16మంది ఉన్నారు. మిగిలిన వారి కోసం గాలింపు చర‍్యలు కొనసాగుతున్నాయి. ఈ దుర్ఘటనపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ జ్యుడీషియల్ విచారణకు ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ.4లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. అలాగే ఢిల్లీతో ఇద్దరు మహిళలు, ఇద‍్దరు పురుషులు యమునా నదిలో గణపతి నిమజ్జనం సందర్భంగా మృత్యువాత పడ్డారు. ఇక రెండు రోజుల క్రితం కర్ణాటకలోని కేజీఎఫ్ పట్టణంలో నిమజ్జనంలో పాల్గొన్న ఆరుగురు చిన్నారులు మృతి చెందారు.
Comments
Please login to add a commentAdd a comment