డియోరియాలోని షెల్టర్ హోం
లక్నో : బిహార్‌లోని ముజఫర్‌పూర్ షెల్టర్ హోం ఘటన మరువక ముందే ఉత్తర ప్రదేశ్‌లోని డియోరియోలో వసతి గృహంలో బాలికల లైంగిక హింస ఘటన వెలుగులోకి వచ్చింది. డియోరియోలో వసతి గృహం నుంచి పారిపోయి బయటకు వచ్చిన ఓ బాలిక అక్కడ జరిగే అకృత్యాల గురించి బయట పెట్టింది. షెల్టర్ హోం నిర్వహకురాలు గిరిజా త్రిపాఠి బాలికలను చిత్ర హింసలకు గురిచేసేవారని, కొంత మంది బాలికలకు వారి కన్నా రెట్టింపు వయసున్న వారితో రెండేసి పెళ్లిళ్లు చేసేవారని బాలిక ఆవేదన వ్యక్తం చేసింది.
బాధిత బాలిక ఫిర్యాదుతో షెల్టర్ హోంపై దాడి చేసిన పోలీసులు మరో 24 మంది బాలికలకు కాపాడారు. షెల్టర్ హోం అకృత్యాల నుంచి బయటపడిన బాలికలతో మంగళవారం ఆరుగురు మహిళా సభ్యుల బృందం మాట్లాడింది. తమను హోంలో చిత్ర హింసలకు గురిచేసేవారని, లైంగికంగా వేధించేవారని బాలికలు తెలిపారు. ప్రతిరోజు ఉదయం 5 గంటలకు నిద్రలేపి ప్లోర్ మొత్తం శుభ్రం చేయించేవారని, తినడానికి కేవలం రెండు చపాతీలు మాత్రమే ఇచ్చేవారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరైనా పని చేయాడానికి నిరాకరిస్తే వారికి ఆపూట భోజనం పెట్టే వారు కాదని బాలికలు వాపోయారు.
కాగా బాలిక ఫిర్యాదుతో సోమవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో ఆ వసతి గృహంపై దాడులు చేసిన పోలీసులు 24 మంది బాలికలను రక్షించామని తెలిపారు. వారిలో 10 మంది మైనర్లు ఉన్నారని పేర్కొన్నారు. అక్కడ మొత్తం 42 మంది ఉండగా వారిలో 18 మంది ఆచూకీ లభించలేదన్నారు. దీనిపై లోతైన విచారణ జరుగుతోందని వెల్లడించారు. ఏడాదికి పైగా వీరు ఎటువంటి అనుమతులు లేకుండా వసతి గృహాన్ని నడుపుతున్నారని తమ విచారణలో తెలిందన్నారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న మొత్తం ఐదుగురిని అరెస్ట్ చేసినట్టు వెల్లడించారు. బాధితులను వైద్య పరీక్షల నిమిత్తం డియోరియా జిల్లా ఆస్పత్రికి తరలించామని పోలీసులు తెలిపారు. అనుమతులు లేకుండా నడుస్తున్న వసతి గృహలపై కేంద్ర శిశు సంక్షేమశాఖ మంత్రి మేనకాగాంధీ లోక్‌సభలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment