బీజేపీ ఎమ్మెల్యే సురేశ్ తివారి(ఫైల్ ఫొటో)
లక్నో: ముస్లింల వద్ద కూరగాయలు కొనుగోలు చేయవద్దంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే సురేశ్ తివారిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడిన ఆయన తనను తాను సమర్థించుకున్నారు. ‘నేనేమైనా తప్పుగా మాట్లాడానా’ అంటూ ఎదురు ప్రశ్నించారు. మహమ్మారి కరోనా వ్యాప్తికి ఢిల్లీలోని తబ్లిగీ జమాత్ ప్రార్థనలు కారణమంటూ సురేశ్ తివారి గతంలో పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వారం రోజుల క్రితం తన నియోజకవర్గం డియోరియాలో పర్యటించిన ఆయన.. ‘‘ ఒక్క విషయం అందరూ గుర్తుపెట్టుకోండి. ముస్లింల వద్ద కూరగాయలు కొనాల్సిన అవసరం లేదు. సరేనా’’ అని వ్యాఖ్యానించారు. (లాక్‌డౌన్: రోడ్డుపై బైఠాయించిన ఎంపీ)
ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో మతపరమైన, వివక్షపూరిత వ్యాఖ్యలు చేయవద్దంటూ ప్రధాని నరేంద్ర మోదీ చెప్పినప్పటికీ బీజేపీ ఎమ్మెల్యే ఇలా మాట్లాడటం దేనికి సంకేతమని నెటిజన్లు మండిపడుతున్నారు. ఇక ఈ విషయం గురించి మంగళవారం మీడియాతో మాట్లాడిన సురేశ్ తివారి.. ‘‘నేను నా నియోజకవర్గంలో పర్యటించినపుడు ఓ పది మందిని కలిశాను. లాక్‌డౌన్ గురించి మేం మాట్లాడుకున్నాం. అప్పుడు కొంతమంది నా దగ్గరికి వచ్చి ముస్లిం వ్యాపారులు కాయగూరలు అమ్మేటపుడు వాటిపై ఉమ్మివేయడం గమనించామని చెప్పారు. కాబట్టి అలాంటి వాళ్ల దగ్గర వస్తువులు కొని కరోనా తెచ్చుకోవద్దని నేను చెప్పాను. (బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు)
ఒక ఎమ్మెల్యేకు సమస్య గురించి ఏం చేయాలని అడిగినపుడు.. నేనేం చెప్పాలి. నేను మాట్లాడిన దాంట్లో తప్పుపట్టడానికి ఏముంది? ఎందుకు దీన్ని రాద్దాంతం చేస్తున్నారు’’అని ప్రశ్నించారు. అదే విధంగా.. మజ్లిస్ పార్టీ చీఫ్ అసుదుద్దీన్ ఒవైసీ, ఆయన సోదరుడు ఎన్నోసార్లు హిందువుల గురించి అభ్యంతరకర, తీవ్రమైన వ్యాఖ్యలు చేసినప్పటికీ ఎవరూ స్పందించలేదని విమర్శించారు. తనను ఉద్దేశపూర్వకంగానే ఇరికిస్తున్నారని... స్వార్థ ప్రయోజనాల కోసం మాట్లాడే ఒవైసీ లాంటి వారిని మాత్రం ఏమీ అనలేరని అసహనం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment