లక్నో : ఓ పదేళ్ల బాలిక ప్రదర్శించిన తెగువ బాలికల వసతి గృహంలో బంధీలుగా ఉన్న 24 మందికి విముక్తి కల్పించింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని డియోరియా జిల్లాలో చోటుచేసుకుంది. వింధ్యవాసిని మహిళ మరియు బాలిక సంరక్షణ గృహం నుంచి తప్పించుకున్న ఆమె అక్కడ జరుగుతున్న ఆకృత్యాల గురించి పోలీసులకు తెలిపింది. బాలిక ఇచ్చిన సమాచారంతో దాడులు జరిపిన పోలీసులు అక్కడ బంధీలుగా ఉన్నవారిని రక్షించారు. అంతేకాకుండా ఆ వసతి గృహం నిర్వహకురాలు గిరిజ త్రిపాఠితోపాటు, ఆమె భర్త, కూతురిని అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి బయటపడిన బాలికలు తమపై జరిగిన భౌతిక, లైంగిక దాడుల గురించి పోలీసులకు తెలిపారు.
ఆ బాలిక కథనం ప్రకారం.. ‘నేను ఆ వసతి గృహంలోని మొదటి అంతస్తులో ఉండేదాన్ని.. ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో వార్డెన్ నన్ను కిందికి పిలిచారు. నన్ను ఫ్లోర్ శుభ్రం చేయాల్సిందిగా ఆదేశించారు. ఆ తర్వాత ఆమెకు ఫోన్ కాల్ రావడంతో అందులో లీనమైపోయారు. దీనిని అదునుగా భావించిన నేను మరో ఆలోచన లేకుంగా అక్కడి నుంచి బయటకు వచ్చి పోలీసు స్టేషన్‌కు వెళ్లాను. వారు చెప్పిన పనులు చేయకుంటే మమ్మల్ని దారుణంగా కొడతారు. నా కంటే పెద్దవారిపై లైంగికంగా దాడులు కూడా జరిగాయ’ని తెలిపారు.
బాలిక ఫిర్యాదుతో అదే రాత్రి 11 గంటల ప్రాంతంలో ఆ వసతి గృహంపై దాడులు చేసి 24 మంది బాలికలను రక్షించామని పోలీసులు తెలిపారు. వారిలో 10 మంది మైనర్లు కూడా ఉన్నారని పేర్కొన్నారు. అక్కడ మొత్తం 42 మంది ఉండగా వారిలో 18 మంది ఆచూకీ లభించలేదన్నారు. దీనిపై లోతైన విచారణ జరుగుతోందని వెల్లడించారు. ఏడాదికి పైగా వీరు ఎటువంటి అనుమతులు లేకుండా వసతి గృహాన్ని నడుపుతున్నారని తమ విచారణలో తెలిందన్నారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న మొత్తం ఐదుగురిని అరెస్ట్ చేసినట్టు వెల్లడించారు. బాధితులను వైద్య పరీక్షల నిమిత్తం డియోరియా జిల్లా ఆస్పత్రికి తరలించామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment