
ఎంపీలందరిని ఇళ్లకు వెళ్లండన్న మోదీ!
న్యూఢిల్లీ: ఎవరి నియోజక వర్గాలకు వారు వెళ్లాలని ప్రధాని నరేంద్రమోదీ తన పార్టీ ఎంపీలను ఆదేశించారు. ఒక్కో ఎంపీ కనీసం ఏడు రాత్రుల పాటు తమ సొంత నియోజక వర్గాల్లోనే గడపాలని చెప్పారు. ఈ నెలలోనే ఎన్డీయే ప్రభుత్వం రెండో సావత్సరిక వేడుకలు జరపనున్న నేపథ్యంలో ఆయన ఈ ఆదేశాలు జారీ చేశారు.
మంగళవారం ఉదయమే ప్రధాని మోదీ వారికి ఈ సూచనలు చేసినట్లు అధికార వర్గాల సమాచారం. దీంతోపాటు ఇప్పటి వరకు ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలు, ఇతర కార్యక్రమాల గురించి ప్రకటనలు ఇచ్చి వాటిపై ప్రజల స్పందన ఎలా ఉందనే విషయం కూడా తనకు చెప్పాలని మోదీ ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ నెల (మే)26న మోదీ సర్కారు రెండేళ్లు పూర్తి చేసుకోనుంది.