చిన్న ఉద్యోగిని కొట్టాడు.. పెద్ద పదవి పోయింది
పనాజీ: గోవాలో ఓ ప్రభుత్వాధికారిపై చేయిచేసుకున్న ప్రజా ప్రతినిధిని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ఆయన ముమ్మాటికీ ఈ విషయంలో దోషేనని తేల్చింది. దీంతో సదరు మంత్రి తన కేబినెట్ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. గోవా వికాస్ పార్టీకి చెందిన గోవా గ్రామీణాభివృద్ధిమంత్రి ఫ్రాన్సిస్కో మిక్కీ పచేకో 2006 జూలై 15న విద్యుత్ శాఖలో కపిల్ నటేకర్ అనే జూనియర్ ఇంజినీర్పై అవాకులు చెవాకులు పేలుతూ చేయిచేసుకున్నారు. దీంతో సదరు ఉద్యోగి కోర్టుకెక్కగా గోవా హైకోర్టు మంత్రిని తప్పుబట్టింది.
విధుల్లో ఉన్న ప్రభుత్వాధికారిపై చేయిచేసుకోవడం ముమ్మాటికీ నేరమేనని పేర్కొంటూ ఆరు నెలల శిక్షను ఖరారు చేస్తూ, రూ.1500 అపరాధ రుసుము కూడా విధించింది. దీనిపై ఆయన సుప్రీంకోర్టు వెళ్లగా ఇన్నాళ్లపాటు వాయిదాలు పడుతూ వచ్చిన కేసు చివరికి ఆయనను దోషిగా తేల్చింది. దీంతో ఆయన తన కేబినెట్ పదవికి రాజీనామా చేసి ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్కు రాజీనామా పంపించారు. తన పార్టీకి అపవాదు తీసుకురావొద్దనే కేబినెట్నుంచి వైదొలుగుతున్నట్లు చెప్పారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కూడా ధృవీకరించి రాజీనామాను గవర్నర్కు పంపించినట్లు తెలిపారు.