
పార్లమెంటు భేటీలోపే నివేదిక: సుశీల్‌కుమార్‌షిండే
జీవోఎం అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి షిండే ప్రకటన
విభజనకు సంబంధించిన అన్ని అంశాలనూ జీవోఎం పరిశీలిస్తోంది
వచ్చే నెల 7వ తేదీన మంత్రుల బృందం మళ్లీ సమావేశమవుతుంది
వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల కార్యదర్శులతో హోంశాఖ కార్యదర్శి భేటీ
విభజనపై నిర్దిష్ట సిఫారసులు, సూచనలతో నివేదికలివ్వాలని సూచన
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన విధివిధానాలను ఖరారు చేసేందుకు ఏర్పాటైన కేంద్ర మంత్రుల బృందం (జీవోఎం) వచ్చే పార్లమెంటు శీతాకాల సమావేశాల ప్రారంభానికి ముందే కేంద్ర మంత్రివర్గానికి తన నివేదికను సమర్పిస్తుందని జీవోఎం అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండే ప్రకటిం చారు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియలో అనుసరించాల్సిన విధానాన్ని, విభజనతో తలెత్తే సమస్యలకు పరిష్కారాలపై దృష్టి సారిస్తున్న జీవోఎం ఇప్పటికే రెండుసార్లు సమావేశమైందని, వచ్చే నెల ఏడో తేదీన మరోసారి సమావేశం అవుతుందని ఆయన పేర్కొన్నారు. షిండే శుక్రవారం నార్త్ బ్లాక్‌లో తనను కలిసిన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర విభజనతో ముడివడి ఉన్న అన్ని అంశాలపైనా జీవోఎం అన్నిమార్గాల్లో సమాచారాన్ని సేకరిస్తోందని చెప్పారు. త్వరలో తమకు అప్పగించిన బాధ్యతలను పూర్తిచేస్తామన్నారు. డిసెంబర్ మొదటి వారంలో ప్రారంభం కావచ్చునని భావిస్తున్న పార్లమెంటు శీతాకాల సమావేశాలకు ముందుగానే మంత్రివర్గానికి జీవోఎం నివేదిక సమర్పిస్తుందని తెలిపారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఎప్పటిలోగా ఏర్పాటు చేయగలుగుతారని విలేకరులు అడిగిన ప్రశ్నకు మాత్రం ఆయన సూటిగా జవాబివ్వలేదు. తెలంగాణ బిల్లును పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించి రాష్ట్రపతి నోటిఫికేషన్ జారీ చేసినప్పుడు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటవుతుందన్నారు. ‘‘కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు ఒక ప్రత్యేక, నిర్దేశిత విధానం ఉంది.. ఆ ప్రక్రియ పూర్తికావాలి కదా!’’ అని వ్యాఖ్యానించారు. ‘పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లును ప్రవేశపెడతారా?’ అన్న మరో ప్రశ్నకు.. ‘‘పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కావటానికి ముందే కేంద్ర మంత్రుల బృందం నివేదిక కేబినెట్‌కు చేరుతుంది’’ అని సమాధానం చెప్పారు. అయితే.. జీవోఎం నివేదిక వచ్చే నెలాఖరులోగానే కేబినెట్‌కు చేరవచ్చునని.. ఆ తర్వాత రాష్ట్రపతి ద్వారా రాష్ట్ర శాసనసభ అభిప్రాయం కోసం పంపించే రాష్ట్ర విభజన బిల్లు తిరిగి వచ్చిన తర్వాతే అది పార్లమెంటుకు వెళ్తుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. నవంబర్ 7న సమావేశం కానున్న జీవోఎం నెలాఖరులోగానే మరో సమావేశాన్ని నిర్వహించి నివేదికకు తుది రూపమిచ్చే అవకాశాలున్నాయని ఈ వర్గాలు వెల్లడించాయి.
వివిధ శాఖల కార్యదర్శులతో గోస్వామి భేటీ...
ఇదిలావుంటే.. రాష్ట్ర విభజన అంశంపై శుక్రవారం వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల కార్యదర్శులతో హోంశాఖ కార్యదర్శి అనిల్‌గోస్వామి సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ విభజనకు సంబంధించి కేంద్ర మంత్రుల బృందం పరిశీలనకు సమర్పించాల్సిన నివేదికలను తదుపరి జీవోఎం సమావేశానికి ముందుగానే తమ మంత్రిత్వశాఖకు అందజేయాలని ఆయన ఆయా అధికారులను కోరినట్లు తెలిసింది. విభజన తర్వాత ఏర్పాటయ్యే ఆంధ్రప్రధేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నదీజలాలు, విద్యుచ్ఛక్తి, సహజవనరుల పంపిణీ, ఆస్తులు, అప్పుల పంపిణీ, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీల వంటి అంశాలపై సంబంధిత మంత్రిత్వశాఖల నివేదికల్లో నిర్దిష్టమైన సిఫారసులు, ప్రత్యామ్నాయాలను కూడా పొందుపరచాలని గోస్వామి సూచించినట్లు సమాచారం. హోంశాఖ కార్యాలయంలో దాదాపు గంటపాటు జరిగిన ఈ సమావేశంలో కేంద్ర ఆర్థిక, న్యాయ మంత్రిత్వశాఖల కార్యదర్శులతో పాటు జలవనరులు, విద్యుత్, ఆరోగ్య, మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖల కార్యదర్శులు, సిబ్బంది శాఖ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.