ముఖ్యమంత్రి కావాల్సిన ముండే..!
మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి బీజేపీ అధిష్ఠానం ఎంపిక చేసిన రెండు పేర్లలో గోపీనాథ్ ముండే ఒకటి. ఆయన చాలా చురుకైన నాయకుడు కావడం, బీసీ వర్గాల్లో గట్టి పట్టుండటం, పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిచి మహారాష్ట్ర వ్యవహారాలపై తిరుగులేని సాధికారత సాధించడంతో ముండే పేరును బీజేపీ సీఎం అభ్యర్థిత్వానికి ముందుకు తెచ్చింది. శివసేన, బీజేపీల మధ్య ఇప్పుడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవి విషయంలో వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. ఇన్నాళ్లుగా ఆ రాష్ట్రంలో శివసేన ఆధిక్యం ఉండటంతో ఈ కూటమి అధికారంలోకి వచ్చినప్పుడల్లా ఆ పార్టీ అభ్యర్థే ముఖ్యమంత్రిగా ఉంటూ వచ్చారు.
కానీ ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 28 స్థానాలు గెలుచుకోగా, శివసేన 18 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దాంతో శివసేన కలవరపడింది. ఇంతకాలం కింగ్మేకర్లుగా మాత్రమే ఉంటూ.. పదవులకు దూరంగా ఉన్న ఠాక్రే కుటుంబం.. తొలిసారి తాము సైతం బరిలోకి దిగుతామని ప్రత్యక్షంగా చెప్పింది. ఉద్ధవ్ ఠాక్రేను ముఖ్యమంత్రి అభ్యర్థిగా శివసేన ముందుకు తెచ్చింది. అయితే.. ఈ ఏడాది చివర్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తే ఆ పార్టీ నాయకుడే ముఖ్యమంత్రి అవుతారని బీజేపీ గట్టిగా వాదిస్తోంది. అందుకే గోపీనాథ్ ముండే పేరును ముందుకు తెచ్చింది. అయితే ఇంతలోనే విధి వక్రించడంతో గోపీనాథ్ ముండే అకాలమరణం పాలయ్యారు. దీంతో మహారాష్ట్ర లాంటి బలమైన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాన్ని ఆయన కోల్పోయారు.