ఏడాదికి పన్నెండు! | government considering 12 subsidy cylinders in a year | Sakshi
Sakshi News home page

ఏడాదికి పన్నెండు!

Published Fri, Jan 3 2014 12:39 AM | Last Updated on Sat, Sep 2 2017 2:13 AM

government considering 12 subsidy cylinders in a year

సబ్సిడీ సిలిండర్ల పరిమితి పెంపును పరిశీలించనున్న ప్రభుత్వం
 
 న్యూఢిల్లీ: ప్రస్తుతం ఏడాదికి 9 మాత్రమే ఉన్న సబ్సిడీ వంటగ్యాస్ సిలిండర్ల పరిమితిని 12కు పెంచాలన్న డిమాండును పరిశీలించనున్నట్లు గురువారం కేంద్రం వెల్లడించింది. సబ్సిడీయేతర సిలిండర్ల ధర ను ఒకేసారి ఏకంగా రూ.220 మేరకు పెంచిన మరునాడే ప్రభుత్వం ఈ మేరకు ప్రకటించడం గమనార్హం. సబ్సిడీ సిలిండర్ల పరిమితిని పన్నెండుకు పెంచాలని పలువురు ముఖ్యమంత్రులు సహా పలు వర్గాల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం చెప్పారు.మరోవైపు, సబ్సిడీయేతర సిలిం డర్ల ధరను రూ.220 మేరకు పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలనే డిమాండ్లు కూడా వస్తున్నాయి. సబ్సిడీ కోటా సిలిండర్లను వాడేసుకున్న వినియోగదారులు ఆ తర్వాత కొనుగోలు చేసే సిలిండర్లపై పెంచిన ధరను చెల్లించాలి.
 
  ఢిల్లీలో ప్రస్తుతం సబ్సిడీయేతర సిలిండర్ ధర రూ.1,241.  సబ్సిడీయేతర సిలిండర్ల ధర పెంపును పెట్రోలియం శాఖ అమల్లోకి తెచ్చిందో లేదో తనకు తెలియదని, అయితే, సబ్సిడీ సిలిండర్ల పరిమితిని పన్నెండుకు పెంచాలనే ప్రతిపాదనను, సబ్సిడీయేతర సిలిండర్ల ధర పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలన్న ప్రతిపాదనను పరిశీలించనున్నామని చిదంబరం చెప్పారు. చమురు సంస్థలు సిలిండర్‌పై రూ.762.70 మేరకు నష్టపోతున్నాయని, ధర పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటే, ప్రభుత్వం సబ్సిడీని పెంచాల్సి ఉంటుందని అధికార వర్గాలు చెబుతున్నాయి.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement