న్యూఢిల్లీ: ఐదురాష్ట్రాల ఎన్నికల ప్రభావంతో దాదాపు ఐదు నెలలుగా గ్యాస్, పెట్రో ఉత్పత్తుల ధరలు పెంచకుండా ఉన్న కంపెనీలు మంగళవారం జూలు విదిల్చాయి. వంటగ్యాస్ సిలిండర్‌పై రూ. 50 పెంచుతున్నట్లు ప్రకటించాయి. దీంతో ఎల్‌పీజీ సిలిండర్ ధర జీవితకాల గరిష్టానికి చేరింది. అయితే పెట్రోల్, డీజిల్ ధరలను మాత్రం భారీగా పెంచకుండా లీటరుకు దాదాపు 80పైసలతో సరిపెట్టాయి. తాజా పెరుగుదలతో ఒక్కసారిగా ద్రవ్యోల్బణ భయాలు పెరిగాయి.
కొత్త ధరల ప్రకారం సబ్సిడీఏతర ఎల్‌పీజీ సిలిండర్ (14.2 కిలోలు) ధర ఢిల్లీ, ముంబైలో 949.50 రూపాయలకు చేరింది. గతేడాది అక్టోబర్ తర్వాత ఎల్‌పీజీ రేట్లు సవరించడం ఇదే ప్రథమం. గతేడాది జూలై, అక్టోబర్ మధ్య కాలంలో గ్యాస్ సిలిండర్ ధర రూ. 100 మేర పెరిగింది. ప్రస్తుతం సబ్సిడీ సిలిండర్ ధర సైతం నాన్ సబ్సిడీ సిలిండర్ ధరంత పలుకుతోంది.
గతంలో ప్రభుత్వం సబ్సిడీ కింద రూ.600 వరకు సాయం అందించేది. 2020 నుంచి ఈ సబ్సిడీని తొలగించారు. పెంచిన ధరల ప్రకారం 5 కిలోల గ్యాస్ íసిలిండర్ ధర రూ. 349కి, 10కిలోల íసిలిండర్ ధర రూ. 669కి చేరింది. మరోవైపు దేశ రాజధానిలో లీటర్ పెట్రోలు ధర రూ. 95.41 నుంచి 96.21కి, డీజిల్ ధర రూ. 86.67 నుంచి 87.47కు పెరిగింది. ఇతర నగరాల్లో స్థానిక పన్నులు కలుపుకొని ధరలు పెరిగాయి. ప్రభుత్వం సిలిండర్ ధర రూ. వెయ్యికి చేర్చాలని కంకణం కట్టుకుందని విపక్షాలు దుయ్యబట్టాయి. పార్లమెంట్‌లో ఈ విషయమై నిరసనకు దిగాయి.
అంతర్జాతీయంగా ఉక్రెయిన్ సంక్షోభ కారణంగా ఇంధన ధరలు పెరగడంతో దేశీయంగా ధరలు పెంచాల్సివచ్చిందని ఇంధన సంస్థలు తెలిపాయి. ప్రస్తుతం ప్రపంచ మార్కెట్లో క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 119 డాలర్ల వద్ద కదలాడుతోంది. భారత్ తన ఇంధన అవసరాల్లో 85 శాతం వరకు దిగుమతులపైనే ఆధారపడుతోంది. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ధర పెరిగితే భారత్‌పై భారం పడుతోంది. నిజానికి తాజా రేట్ల ప్రకారం పెట్రోల్, డీజిల్‌పై లీటర్‌కు రూ. 15– 25 చొప్పున పెంచాల్సిఉందని, కానీ కంపెనీలు ఆ మొత్తాన్ని తామే భరిస్తున్నాయని అధికారులు తెలిపారు.
విజయవాడలో సిలిండర్ రూ. 972
విజయవాడలో గ్యాస్ íసిలిండర్ ధర రూ. 50 పెరిగి రూ. 972కు చేరింది. కమర్షియల్ సిలిండర్ ధర రూ. 2,185ను తాకింది. ఇతర ప్రధాన నగరాల్లో కూడా గ్యాస్ సిలిండర్ ధర రూ. 50 మేర పెరిగింది. విజయవాడలో పెట్రోల్ ధర లీటరుకు 0.96పైసలు(స్థానిక పన్నులు కలుపుకొని) పెరిగి రూ. 110.89కి చేరింది. డీజిల్ 83పైసలు పెరిగి రూ. 96.89కి చేరింది. విశాఖ పట్నంలో పెట్రోల్ ధర రూ. 110. 01కు, డీజిల్ ధర రూ. 96.02కు, తిరుపతిలో పెట్రోల్‌ధర రూ. 112.02కు, డీజిల్ ధర రూ. 98.00కు చేరాయి.
హైదరాబాద్‌లో సిలిండర్ రూ.1002
తెలంగాణలో మంగళవారం లీటర్ పెట్రోల్ ధర 90 పైసలు, డీజిల్ ధర 88 పైసలు (స్థానిక పన్నులు కలుపుకొని) చొప్పున పెరిగాయి. వంట గ్యాస్ ధర రూ. 50 పెరిగడంతో 14.2 కిలోల గృహావసర వంట గ్యాస్ సిలిండర్ ధర రాష్ట్రంలో పన్నులు కలుపుకొని రూ. 1000 దాటింది. సిలిండర్ ధర తెలంగాణలో ఆదిలాబాద్‌లో అత్యధికంగా రూ. 1,026కు చేరింది. రాష్ట్రంలో 1.18 కోట్ల గృహావసర సిలిండర్లు వినియోగంలో ఉండగా, ప్రతిరోజూ సగటున 1.20 లక్షల సిలిండర్లను డెలివరీ చేస్తున్నారు. సగటున రాష్ట్రంలో పెట్రోల్‌వినియోగం నెలకు 15 కోట్ల లీటర్లుండగా, సగటు డీజిల్ వినియోగం 25 కోట్ల లీటర్లుంది.
Comments
Please login to add a commentAdd a comment