ఎన్‌పీఏలపై బ్యాంకర్లతో చిదంబరం సమావేశం
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా కంపెనీల అధిపతులతో ఆర్థికమంత్రి పి.చిదంబరం 12, 13 తేదీల్లో భేటీ కానున్నారు. ఆర్థిక మంత్రి హోదాలో ప్రభుత్వ అధికారులతో చిదంబరం జరిపే చివరి సమావేశం ఇదేనని అధికార వర్గాలు తెలిపాయి. జీవిత, సాధారణ బీమా చీఫ్ ఎగ్జిక్యూటివ్‌లతో సోమవారం చిదంబరం చర్చలు జరుపుతారు. ఈ సందర్భంగా బీమా సంస్థల పనితీరును ఆయన సమీక్షిస్తారు. మంగళవారం ప్రభుత్వ రంగ బ్యాంకు అధికారులతో సమావేశమయ్యే చిదంబరం బ్యాంకులు ఎదుర్కొంటున్న మొండిబకాయిల సమస్యపైనే ప్రధానంగా దృష్టిపెడతారని అధికార వర్గాలు తెలిపాయి.
ఎన్‌పీఏలు (నిరర్ధక ఆస్తులు) తగ్గించుకోవాలని, బకాయిల వసూ ళ్లను ముమ్మరం చేయాలని బ్యాంకులకు సూచిస్తారని సమాచారం. 2013 డిసెంబర్ నాటికి ప్రభుత్వ రంగ బ్యాంకులు రూ.18,933 కోట్ల విలువ మొండిబకాయిలను వసూలు చేశాయి. అయితే మార్చితో ముగిసిన ఏడాది కాలంలో ఈ బకాయిలు 28.5% పెరిగి రూ.1.83 లక్షల కోట్లకు చేరాయి. 2008లో ఆర్థిక సంక్షోభం తలెత్తిన నాటి నుంచి రుణాల ఎగవేత బ్యాంకులకు పెద్ద సమస్యగా మారింది. ప్రభుత్వ బ్యాంకుల్లో నిరర్ధక ఆస్తులు కోట్లలో పేరుకుపోయాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రభుత్వ రంగ బ్యాంకులు వెల్లడించిన వరుస త్రైమాసిక ఫలితాల్లో నిరర్ధక ఆస్తులు పెరుగుతూనే వచ్చాయి.
ఈ బ్యాంకులన్నిటిలో పేరుకుపోయిన మొత్తం నిరర్ధక ఆస్తుల విలువ రూ.2.03 లక్షల కోట్లు. ప్రైవేటు రంగ బ్యాంకుల్లో కూడా వసూలు కాని మొండిబకాయిలు లక్షల కోట్లలోనే ఉన్నాయి. బ్యాం కుల్లో మొండి బకాయిలు ఇలానే పెరుగుతూపోతే భవి ష్యత్తులో భారత ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడం అసాధ్యమని ఇటీవల విడుదల చేసిన నివేదికలో ప్యారిస్ కేంద్రంగా పనిచేసే ఓఈసీడీ హెచ్చరించింది.