దత్తాత్రేయ వెల్లడి
న్యూఢిల్లీ: కేంద్ర పరిధిలోని సి-క్లాస్ పట్టణాల్లో నైపుణ్యంలేని వ్యవసాయ కూలీకి రోజువారీ కనీస వేతనం రూ. 350 గా ఉండాలని కేంద్ర కార్మిక శాఖ నిర్ణయించింది. ఈ నిర్ణయం ఈ ఏడాది నవంబర్ 1వ నుంచి అమలులోకి తేవాలని సంకల్పించింది. ప్రస్తుతం కేంద్ర పరిధిలోని వ్యవసాయ కార్మికులకు జాతీయ కనీస కూలీ కింద రోజుకు రూ. 160 చెల్లిస్తున్నారు. కనీస వేతనాలను పెంచుతూ తమ మంత్రిత్వశాఖ నవంబర్ 1వ తేదీన నోటిఫై చేస్తుందని కార్మికమంత్రి బండారు దత్తాత్రేయ శుక్రవారం ఢిల్లీలో మీడియాకు తెలిపారు. అలాగే.. దేశవ్యాప్తంగా కూడా ప్రామాణిక కనీస వేతనాన్ని నిర్ధారించేందుకు కనీస వేతనాల చట్టాన్ని సవరించనున్నట్లు చెప్పారు. దీనిని సార్వజనీన కనీస వేతనంగా పరిగణిస్తామన్నారు. ‘‘ఒకసారి సవరించిన తర్వాత అది చట్టమవుతుంది.
అప్పుడు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలూ ఈ వేతనాల ప్రమాణాలను వర్తింపజేయాల్సి ఉంటుంది’’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వర్తించే ప్రామాణిక కనీస వేతనం ఏదీ లేనందున.. రాష్ట్ర ప్రభుత్వాలకు వివిధ తరగతుల కార్మికులకు వేతనాలను నిర్ణయించే స్వేచ్ఛ ఉంది. కేంద్రం కనీస వేతనాల చట్టానికి సవరణ చేసి ప్రామాణిక కనీస వేతనాన్ని నిర్ణయించినట్లయితే.. రాష్ట్ర ప్రభుత్వాలు దానిని అనుసరించాల్సి ఉంటుంది. ‘వేతనాల స్మృతి (కోడ్ ఆన్ వేజెస్)’, పారిశ్రామిక సంబంధాల స్మృతి (కోడ్ ఆన్ ఇండస్ట్రియల్ రిలేషన్స్) పై త్రైపాక్షిక సమావేశం ముగిసిందని, ఇప్పుడవి కేబినెట్ ఆమోదానికి వెళతాయని, ఆ తర్వాత వచ్చే శీతాకాల సమావేశాల్లో పార్లమెంటు ముందుకు వస్తాయని దత్తాత్రేయ వెల్లడించారు.