సుప్రీం ముంగిట కార్తీ లుక్‌అవుట్ వ్యవహారం
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర మాజీమంత్రి చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరంకు జారీ చేసిన లుక్‌అవుట్ నోటీసుపై మద్రాస్ హైకోర్టు స్టే ఉత్తర్వులు జారీ చేయడాన్నిసవాల్ చేస్తూ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తనను విదేశాలకు వెళ్లకుండా నిరోధించేలా సీబీఐ జారీ చేసిన లుక్‌అవుట్ నోటీసులు రద్దు చేయాలని కోరుతూ కార్తీ మద్రాస్ హైకోర్టులో అప్పీల్ వేశారు. అవినీతి, ఫెరా ఉల్లంఘనలకు సంబంధించి కార్తీకి సీబీఐ ఈ నోటీసులు జారీ చేసిన విషయం విదితమే.
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహార్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌తో కూడిన బెంచ్ ఈ అంశాన్ని విచారణ చేపట్టింది. కార్తీ చిదంబరం సహా నిందితులు విచారణకు హాజరు కావాల్సిందేనని ఆదేశించిన కోర్టు, ముగ్గురు నిందితులు దేశం విడిచి వెళ్లడానికి అనుమతించబోమని స్పష్టం చేసింది. ఐఎన్‌ఎక్స్ మీడియా విదేశీ పెట్టుబడుల చట్టం ఉల్లంఘనలకు పాల్పడేలా సహకరించినందుకు కార్తీ చిదంబరంకు రూ 3.5 కోట్ల ముడుపులు ముట్టాయని దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నాయి. అయితే తనపై ఆరోపణలు నిరాధారమని, రాజకీయ కక్షసాధింపులో భాగమని కార్తీ చిదంబరం చెబుతున్నారు.