న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం తనయుడు కార్తీ చిదంబరానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. విదేశాల్లో పర్యటించడానికి పూచీకత్తుగా గతంలో తాను సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్‌కు సమర్పించిన రూ. 10 కోట్లను తిరిగి ఇవ్వాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. అప్పు తెచ్చి సుప్రీంకోర్టుకు డబ్బు కట్టానని, దానిపై ప్రస్తుతం వడ్డీ చెల్లించాల్సి వస్తోందని, కాబట్టి రూ. 10 కోట్లు తిరిగి ఇవ్వాలని కార్తీ చిదంబరం అభ్యర్థించారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ అనిరుద్ధ బోస్ నేతృత్వంలోని ధర్మాసనం ఆయన అభ్యర్థనను తోసిపుచ్చడమే కాకుండా.. వెళ్లి తన నియోజకవర్గంపై దృష్టి సారించాలని కార్తీకి సూచించింది.
తమిళనాడులోని శివగంగ నియోజకవర్గం నుంచి 3లక్షలకుపైగా ఓట్ల మెజారిటీతో కార్తీ చిదంబరం గెలుపొందిన సంగతి తెలిసిందే. ఆయన తండ్రి చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎఫ్‌ఐపీబీ) ద్వారా ఇప్పించిన అనుమతుల్లో పలు అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై కార్తీ ఈడీ, సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈడీ, సీబీఐ దర్యాప్తు నేపథ్యంలో సుప్రీంకోర్టు సూచన మేరకు రూ. 10 కోట్లు పూచీకత్తు చెల్లించి.. కార్తీ విదేశాలకు వెళ్లేందుకు అనుమతి పొందారు.
Comments
Please login to add a commentAdd a comment