కల్లోల కాశ్మీరంలో శాంతి పునరుద్ధరణకు కొత్త ప్రయత్నాలు మొదలయ్యాయి. ఒకవైపు సీమాంతర ఉగ్రవాదంతో పాటు పాక్ ప్రేరేపిత తీవ్రవాదాన్ని అణచేసేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటూనే కశ్మీర్ ప్రజలు ముఖ్యంగా యువతను వినోద ప్రధాన కార్యక్రమాల్లో వారిని భాగస్వాములను చేయడం ద్వారా ప్రధాన జనజీవన స్రవంతిలోకి చేరేలా చేయాలని కేంద్ర సర్కార్‌కు ఆలోచన వచ్చింది. దీనిలో భాగంగా కశ్మీరీ భాషలో ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ కార్యక్రమాన్ని ప్రారంభించాలని కేంద్ర హోంశాఖ ప్రణాళికలు రూపొందిస్తోంది.
దూరదర్శన్ సహకారంతో కశ్మీర్ ప్రజలకు చేరువయ్యేలా ‘కేబీసీ’ మొదలుపెట్టాలని యోచిస్తోంది. ఈ కార్యక్రమంతో పాటు స్థానికుల్లోని ప్రతిభా పాటవాలను వెలుగులోకి తీసుకొచ్చేందుకు నృత్య,సంగీత, తదితర రంగాల్లో ‘ట్యాలెంట్ షో’లు నిర్వహించేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ‘దూరదర్శన్ కశ్మీర్’ ద్వారా ఈ కొత్త టీవీ షోల నిర్వహణకు సంబంధించిన ప్రతిపాదనలను కేంద్రం చురుకుగా పరిశీలిస్తున్నట్టు కేంద్ర హోంశాఖ అధికారి ఒకరు వెల్లడించారు.
గేమ్, ట్యాలెంట్ షోలతో వినోదం...
గేమ్,ట్యాలెంట్ షోల ద్వారా వినోదం పంచడంతో పాటు భారత్‌లోని విభిన్న సంస్కృతులను కశ్మీర్ వీక్షకులకు పరిచయం చేస్తారు. ఈ షోలలో భాగంగా దేశంలోని ›ప్రజాస్వామ్య విలువలను పెంపొందించే, జాతీయ సమైక్యత, మత సామరస్యం, సెక్యులరిజం వల్ల ఒనగూడే ప్రయోజనాలు, దేశభక్తిని చాటే కార్యక్రమాలుంటాయి. ఇవన్నీ చూడాలంటే ముందు వీక్షకుల సంఖ్య పెంచుకోవాలి. అందుకోసం కొత్త కొత్త బాలీవుడ్ చిత్రాల ప్రసారాన్ని కశ్మీర్ డీడీ ఇప్పటికే ప్రారంభించింది. ఈ సినిమాలకు ప్రజల్లో స్పందనతో పాటు డీడీ వీక్షకుల సంఖ్య కూడా పెరిగింది. ఈనేపథ్యంలో ప్రతిపాదిత టీవీ షోలను బుల్లితెరపైకి తీసుకొచ్చే ప్రయత్నాలు దూరదర్శన్ మొదలుపెట్టింది.
–సాక్షి నాలెడ్జ్ సెంటర్
Comments
Please login to add a commentAdd a comment