సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోని అత్యంత ప్రముఖులకు భద్రతనిచ్చే ఎస్పీజీ దళాలను తొలగించిన తర్వాత కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ నివాసంలో ఢిల్లీ పోలీసులు కాపలాగా ఉంటున్నారు. అంతేకాక, ఇంటిదగ్గర ఉండే వాహన శ్రేణిలో పదేళ్లనాటి టాటా సఫారీ వాహనాన్ని సమకూర్చారు. ఎస్పీజీ భద్రత ఉన్నప్పుడు సోనియా గాంధీ, ఆమె కూతురు ప్రియాంకా వాద్రాల వాహన శ్రేణిలో బుల్లెట్ ప్రూఫ్‌తో కూడిన రేంజ్‌రోవర్ కార్లు ఉండేవి. రాహుల్ గాంధీ వాహన శ్రేణిలో పార్చ్యూన్ కార్లు ఉండేవి. అయితే ఎస్పీజీ భద్రత కొనసాగించేంత ప్రమాదకర పరిస్థితులు ప్రస్తుతానికి లేవని సీఆర్పీఎఫ్‌తో జెడ్ ప్లస్ సెక్యూరిటీతో భద్రత కల్పించగా, బుల్లెట్ ప్రూఫ్ వాహనాలివ్వాలని సీఆర్పీఎఫ్ ప్రభుత్వాన్ని కోరిన సంగతి తెలిసిందే.
ఈ విషయంపై ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించలేదు. ఆ లోపు వాహన శ్రేణిలో తక్కువ స్థాయి వాహనాలను ఇవ్వడం పట్ల ఆ పార్టీ నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. మంగళవారం ప్రారంభమైన పార్లమెంట్ సమావేశంలో ఆ పార్టీ లోక్‌సభాపక్ష నాయకుడు అధిర్ రంజన్ చౌదరి ఈ విషయంపై ప్రధాని నరేంద్రమోదీ స్పందించాలని డిమాండ్ చేశారు. వెల్‌లోకి వెళ్లి నినాదాలు చేసి అనంతరం సభ నుంచి వాకౌట్ చేశారు. కాగా, ముప్పు స్థాయి తక్కువగా ఉన్నందువల్లే సోనియా గాంధీ కుటుంబానికి భద్రతను కుదించామని కేంద్ర ప్రభుత్వం వివరణనిచ్చిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment