SPG protection
-
నోవాటెల్‌లోనే మోదీ బస!
సాక్షి, హైదరాబాద్/రసూల్‌పురా: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశానికి హాజరవుతున్న ప్రధాని మోదీ.. మాదాపూర్‌లోని నోవాటెల్ హోటల్లో బస చేయనున్నట్టు సమాచారం. ప్రధాని రాకకు ముందుగా బుధవారమే హైదరాబాద్‌కు చేరుకున్న ‘స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ)’బృందాలు.. నోవాటెల్ హోటల్లో స్థానిక పోలీసులతో సమావేశమయ్యారు. ప్రధానితోపాటు పెద్ద సంఖ్యలో కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల సీఎంలు రానున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు. మోదీ రాజ్‌భవన్‌లోనే బస చేస్తారని తొలుత భావించారు. కానీ రాజ్‌భవన్ నుంచి 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న హెచ్ఐసీసీ వరకు ప్రధాని రాకపోకలు, భద్రతా ఏర్పాట్లు సమస్యగా మారుతాయని నిఘా వర్గాలు పేర్కొనడంతో.. నోవాటెల్‌లోనే ప్రధాని బసను ఖరారు చేసినట్టు తెలిసింది. 2004లో హైదరాబాద్‌లో జరిగిన బీజేపీ కార్యవర్గ సమావేశానికి వచ్చిన అప్పటి ప్రధాని వాజ్‌పేయి.. లోయర్ ట్యాంక్‌బండ్ ప్రాంతం లోని ఓ స్టార్ హోటల్లో బస చేశారు. మూడు రోజులు.. హోటల్ మొత్తం.. ప్రధాని మోదీ జూలై 2న సాయంత్రం ప్రత్యేక విమానంలో బేగంపేటకు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో నేరుగా సమావేశం జరిగే హెచ్ఐసీసీ ప్రాంగణానికి వస్తారు. సమావేశం తర్వాత పక్కనే ఉన్న నోవాటెల్ హోటల్లో బసచేస్తారు. మొత్తం 288 గదులున్న ఈ హోటల్లో ప్రధాని బస కోసం ఓ ఫ్లోర్ మొత్తం రిజర్వు చేసినట్టు తెలిసింది. బీజేపీ కార్యవర్గ సమావేశాల కోసం 1వ తేదీ నుంచి 3వ తేదీ దాకా ఈ హోటల్ మొత్తాన్ని బుక్ చేశారని హోటల్ ప్రతినిధి ఒకరు తెలిపారు. అణువణువూ తనిఖీలు.. భద్రత కట్టుదిట్టం ప్రధాని, కేంద్ర మంత్రుల పర్యటన నేపథ్యంలో హెచ్ఐసీసీ, నోవాటెల్ హోటల్ పరిసర ప్రాంతాల్లో అణువణువూ తనిఖీ చేస్తున్నారు. హోటల్లో పనిచేసే సిబ్బంది, కుటుంబ సభ్యుల వివరాలను ఎస్పీజీ బృందాలు సేకరించాయని.. వారి ఇళ్లకు కూడా వెళ్లి తనిఖీ చేశాయని సమాచారం. హెచ్ఐసీసీ, నోవాటెల్ హోటల్, పరిసర ప్రాంతాల్లో సీసీ టీవీ కెమెరాల పనితీరును అధికారులు పర్యవేక్షించారు. సుమారు వెయ్యి మందికి పైగా పోలీసులు హోటల్ చుట్టూ పహారా కాయనున్నారు. బుధవారం నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు హెచ్ఐసీసీ చుట్టూ ఐదు కిలోమీటర్ల విస్తీర్ణంలో డ్రోన్లు, పారా గ్లైడర్లు, మైక్రో లైట్ ఎయిర్‌క్రాఫ్ట్‌లను నిషేధిస్తున్నట్టు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ప్రకటించారు. సభ ఏర్పాట్లను పరిశీలించిన తరుణ్ ఛుగ్ వచ్చే నెల 3న ప్రధాని మోదీ బహిరంగ సభ జరగనున్న పరేడ్ గ్రౌండ్స్‌లో ఏర్పాట్లను బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి తరుణ్ చుగ్ బుధవారం పరిశీలించారు. భద్రతాపరమైన అంశాలు, ఇతర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రధాని మోదీ సభ చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచిపోతుందని.. ప్రజలు కేసీఆర్‌కు వీడ్కోలు పలికేందుకు సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా తరుణ్ చుగ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నేతలు కె.లక్ష్మణ్, డీకే అరుణ, గరికపాటి మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు. కాగా.. కార్యవర్గ సమావేశానికి వచ్చే ప్రధాని, కేంద్ర మంత్రులు, సీఎంలు, ఇతర ముఖ్య నేతలను స్వాగతించేందుకు బేగంపేట విమానాశ్రయంలో బీజేపీ ఏర్పాట్లు చేస్తోంది. బుధవారం తరుణ్ చుగ్‌తోపాటు బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్, ఇతర నేతలు ఏర్పాట్లను పరిశీలించారు. -
ఎస్పీజీ చట్టానికి ప్రక్షాళన
దేశంలో ప్రముఖుల భద్రత కోసం ఉద్దేశించిన ప్రత్యేక భద్రతా దళం(ఎస్పీజీ) చట్టం సవరణకు పార్లమెంటు ఆమోదం లభించింది. తాజా సవరణ చట్టంగా మారాక ఇక ప్రధాని, ఆయన కుటుంబానికి చెందిన వారికి తప్ప మరెవరికీ ఎస్పీజీ రక్షణ ఉండదు. వారికి సైతం పదవి నుంచి దిగిపోయాక ఇది అయిదేళ్లపాటు మాత్రమే ఉంటుంది. వాస్తవానికి ఈ బిల్లు ఆమోదానికి చాలా ముందే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు ఉన్న ఎస్పీజీ భద్రతను తొలగించారు. ఇటీవల సోనియాగాంధీ, ఆమె సంతానం రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీలకు సైతం తొలగించారు. వీరికి ఇకపై సీఆర్పీఎఫ్ బృందంతో కూడిన జడ్ ప్లస్ భద్రత ఉంటుంది. సహజంగానే కాంగ్రెస్‌కు ఇది మింగుడుపడటం లేదు. ఎస్పీజీ బిల్లుపై చర్చ పూర్తయి ఓటింగ్ జరిగినప్పుడు ఆ పార్టీ వాకౌట్ చేసింది. మన దేశంలో ప్రముఖులకు సంబంధించిన భద్రత కోసం చాలా కేటగిరీలున్నాయి. ఎస్పీజీతోపాటు ఎన్ఎస్జీ, జడ్ ప్లస్, జడ్, వై, ఎక్స్...ఇలా వేర్వేరు కేటగిరీలను ఏర్పాటుచేశారు. ప్రాణావసరం అనుకున్నది కాస్తా ప్రచార ఆర్భాటంగా మిగలడం, అధికార దర్పాన్ని ప్రదర్శించ డానికి సాధనంగా మారడం మిగిలినవాటికన్నా ఎస్పీజీ విషయంలో అధికంగా కనబడుతుంది. రాజ్యాంగపరంగా అత్యున్నత పదవుల్లో ఉండేవారి ప్రాణాలకు ముప్పు వాటిల్లకుండా చూడటం అవసరమే. ఉగ్రవాదుల బెడద పెరిగిన ప్రస్తుత పరిస్థితుల్లో దీన్నెవరూ తప్పుబట్టరు. అయితే రాను రాను భద్రత ఎవరికి అవసరం... ఏ స్థాయిలో, ఎంతకాలం అవసరం అనే విచక్షణ పోయింది. ఎస్పీజీ చట్టానికి సవరణలు చేసుకుంటూ పోయినకొద్దీ ఆ రక్షణ పొందేవారి జాబితా చాంతాడంత పెరిగింది. జాబితాలోనివారికి ఉండే వెసులుబాట్లు అన్నీ ఇన్నీ కాదు. వీరు పర్యటనకెళ్లినప్పుడల్లా బుల్లెట్ ప్రూఫ్ కార్లు వారికన్నా ముందే విమానంలో గమ్యం చేరతాయి. విమానాశ్రయాల్లో తనిఖీల బెడద ఉండదు. నేరుగా విమానం వరకూ దర్జాగా కారులో వెళ్లొచ్చు. సాధారణ పౌరులు వారు వృద్ధులైనా, యువకులైనా గంటలతరబడి క్యూలో నిలబడి అన్ని లాంఛనాలూ పూర్తిచేయాల్సి ఉండగా ఎస్పీజీ రక్షణ ఉన్నవారికి ఇవేమీ వర్తించవు. ఎటు కదిలినా వీరి వాహనానికి ముందూ వెనకా 15 బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు పరుగులు పెడుతుంటాయి. ఈ వాహనశ్రేణి కోసం ఎక్కడి కక్కడ ట్రాఫిక్ నిలిపేయడం సర్వసాధారణం. స్వాతంత్య్రం వచ్చిన మొదట్లో పాలకుల ప్రాణరక్షణకు ప్రత్యేక భద్రత అవసరమని పెద్దగా అనుకోలేదు. వారు ప్రజల మధ్యకు వెళ్లినప్పుడు ఇబ్బందులు తలెత్తకుండా చూడటానికి నామ మాత్రంగా పోలీసు రక్షణ ఉండేది. ప్రధాని మొదలుకొని మంత్రుల వరకూ ఎవరు కదిలినా ఆర్భాటం ఉండేది కాదు. 1984లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ తన నివాసంలోనే సెక్యూరిటీ గార్డుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయాక ఈ పరిస్థితి మారింది. 1981కి ముందు ప్రధాని భద్రతను ఢిల్లీ పోలీస్ విభాగంలోని డీసీపీ స్థాయి అధికారి నేతృత్వంలోని బృందం పర్యవేక్షించేది. ఆ తర్వాతకాలంలో అందుకోసం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటుచేశారు. ఇందిర హత్యానంతరం 1985లో బీర్బల్‌నాథ్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఎస్పీజీ ఉనికిలోకొచ్చింది. అయితే మరో మూడేళ్ల తర్వాతగానీ దీనికి చట్ట ప్రతిపత్తి రాలేదు. రాజీవ్‌గాంధీ హయాంలో దానికి సంబంధించిన బిల్లు ప్రతిపాదించారు. అయితే పదవి నుంచి తప్పుకున్నాక కూడా రక్షణ అవసరమని అప్పట్లో అనుకోలేదు. బహుశా ఆ ఏర్పాటువుంటే ఉగ్రవాదుల కుట్రకు రాజీవ్ బలయ్యేవారు కాదు. ఆ తర్వాత 1991లో మాజీ ప్రధానులకు కూడా ఎస్పీజీ రక్షణ ఉండాలంటూ సవరణ చేశారు. అలా వరసగా 1994, 1999, 2003 సంవత్సరాల్లో మరికొన్ని సవరణలు వచ్చి చేరాయి. ఫలితంగా ప్రధాని, మాజీ ప్రధాని, వారి కుటుంబసభ్యులు సైతం ఎస్పీజీ ఛత్రఛాయలోకొచ్చారు. ప్రధాని పదవి నుంచి వైదొలగిన పదేళ్ల వరకూ ఈ రక్షణ కొనసాగే ఏర్పాటు చేశారు. ప్రముఖులకు కల్పించే భద్రత ఈమధ్య కాలంలో ఎబ్బెట్టుగా మారింది. పదకొండేళ్లపాటు ఈ ఎస్పీజీ రక్షణ వలయంలో ఉన్న మాజీ ప్రధాని చంద్రశేఖర్ కుమారుడు నీరజ్ శేఖర్ రాజ్యసభలో చర్చ సందర్భంగా మాట్లాడిన మాటలే దీనికి రుజువు. తనకంటూ ఏ పదవీ, హోదా లేకపోయినా ఎస్పీజీ రక్షణంతా చూసి జనం తన ఆటోగ్రాఫ్ కోసం ఎగబడేవారని ఆయన వ్యాఖ్యానించారు. నిజానికి తనెవరో దేశంలో ఎవరికీ తెలియదని, కానీ ఈ భద్రత, దాంతో పాటుండే హడావుడి వగై రాలు చూసి ఏదో పెద్ద పదవి వెలగబెడుతున్నానని అందరూ అనుకునేవారని నీరజ్ చెప్పుకొచ్చారు. ఇవన్నీ చూశాకే సాధారణ పౌరుల్లో వీఐపీ సంస్కృతిపై ఏవగింపు ఏర్పడింది. ఇంత భద్రత పొందుతున్న వీఐపీలు పాటించవలసిన నిబంధనల్ని మాత్రం మరిచిపోతారు. ఎస్పీజీ రక్షణలో ఉండే ప్రముఖులు ఎటు వెళ్లదల్చుకున్నా చాలా ముందుగా ఎక్కడికెళ్తున్నారో, తిరిగి ఎప్పుడొస్తారో భద్రతా వ్యవహారాలు చూసే ఇన్చార్జికి తెలపాలి. అలాగే వారికోసం వచ్చేవారి సమస్త వివరాలనూ ఎస్పీజీ ప్రత్యేక రిజిస్టర్లో నమోదు చేస్తుంది. కానీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంటులో వెల్లడించిన వివరాల ప్రకారం 2015 మొదలుకొని ఇప్పటివరకూ రాహుల్‌గాంధీ దేశంలో వివిధ ప్రాంతాలకెళ్లినప్పుడు 1,892 సందర్భాల్లో, విదేశాలకెళ్లినప్పుడు 247 సందర్భాల్లో ఎస్పీజీకి వర్త మానం ఇవ్వలేదు. సోనియాగాంధీ సైతం ఢిల్లీలో 50సార్లు, దేశంలో వివిధ ప్రాంతాలకెళ్లినప్పుడు 13సార్లు, విదేశాలకెళ్లినప్పుడు 29సార్లు తెలియజేయలేదు. ప్రియాంకగాంధీ తీరు కూడా భిన్నంగా లేదు. ఆమె ఢిల్లీలో 339 సందర్భాల్లో, దేశంలో వేర్వేరు ప్రాంతాలకెళ్లినప్పుడు 64సార్లు, విదేశా లకెళ్లినప్పుడు 94సార్లు వర్తమానం ఇవ్వలేదు. భద్రత లాంఛనంగా మారడం సరికాదు. పదవులు విడనాడాక నాయకులే ఎవరికి వారు స్వచ్ఛందంగా భద్రత స్థాయిని తగ్గించుకుంటే హుందాగా ఉంటుంది. ఎందుకంటే దీని పేరు చెప్పి ఖజానాపై ఏటా వందలకోట్ల రూపాయల భారం పడు తోంది. పైగా ఈ ఆర్భాటం సామాన్యులకు సమస్యగా మారుతోంది. -
సోనియా వాహన శ్రేణిలో పదేళ్లనాటి టాటా సఫారీ
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోని అత్యంత ప్రముఖులకు భద్రతనిచ్చే ఎస్పీజీ దళాలను తొలగించిన తర్వాత కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ నివాసంలో ఢిల్లీ పోలీసులు కాపలాగా ఉంటున్నారు. అంతేకాక, ఇంటిదగ్గర ఉండే వాహన శ్రేణిలో పదేళ్లనాటి టాటా సఫారీ వాహనాన్ని సమకూర్చారు. ఎస్పీజీ భద్రత ఉన్నప్పుడు సోనియా గాంధీ, ఆమె కూతురు ప్రియాంకా వాద్రాల వాహన శ్రేణిలో బుల్లెట్ ప్రూఫ్‌తో కూడిన రేంజ్‌రోవర్ కార్లు ఉండేవి. రాహుల్ గాంధీ వాహన శ్రేణిలో పార్చ్యూన్ కార్లు ఉండేవి. అయితే ఎస్పీజీ భద్రత కొనసాగించేంత ప్రమాదకర పరిస్థితులు ప్రస్తుతానికి లేవని సీఆర్పీఎఫ్తో జెడ్ ప్లస్ సెక్యూరిటీతో భద్రత కల్పించగా, బుల్లెట్ ప్రూఫ్ వాహనాలివ్వాలని సీఆర్పీఎఫ్ ప్రభుత్వాన్ని కోరిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించలేదు. ఆ లోపు వాహన శ్రేణిలో తక్కువ స్థాయి వాహనాలను ఇవ్వడం పట్ల ఆ పార్టీ నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. మంగళవారం ప్రారంభమైన పార్లమెంట్ సమావేశంలో ఆ పార్టీ లోక్‌సభాపక్ష నాయకుడు అధిర్ రంజన్ చౌదరి ఈ విషయంపై ప్రధాని నరేంద్రమోదీ స్పందించాలని డిమాండ్ చేశారు. వెల్‌లోకి వెళ్లి నినాదాలు చేసి అనంతరం సభ నుంచి వాకౌట్ చేశారు. కాగా, ముప్పు స్థాయి తక్కువగా ఉన్నందువల్లే సోనియా గాంధీ కుటుంబానికి భద్రతను కుదించామని కేంద్ర ప్రభుత్వం వివరణనిచ్చిన విషయం తెలిసిందే. -
ఎస్పీజీ తొలగింపుపై ప్రశ్న లేవనెత్తిన కాంగ్రెస్
న్యూఢిల్లీ: గాంధీ కుటుంబానికి భద్రత కల్పిస్తున్న ప్రత్యేక రక్షణ దళం (స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ - ఎస్పీజీ) తొలగింపును గురించి లోక్‌సభలో కాంగ్రెస్ ప్రశ్నను లేవనెత్తింది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాతో సహా గాంధీ కుటుంబానికి ఇస్తున్న సెక్యూరిటీ కవర్‌ను ఉపసంహరించుకోవాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ అధిష్టానం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎస్పీజీ తొలగింపును వాయిదా వేసుకోవాలని సోమవారం లోక్‌సభలో అస్సాం ఎంపీ ప్రద్యుత్ బోర్డోలోయ్ ఈ మేరకు శీతాకాల పార్లమెంట్ సమావేశాల మొదటి రోజునే వాయిదా నోటీసు ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం గాంధీ కుటుంబానికి కల్పిస్తున్న ఎస్పీజీ భద్రతను తొలగించి వారికి జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతను కల్పించడాన్ని కాంగ్రెస్ తీవ్రంగా విమర్శించింది. మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ భద్రతా పరమైన లోపం కారణంగానే హత్యకు గురయ్యారని జస్టీస్ జేఎస్ వర్మ కమిషన్ నివేదికను లోక్‌సభలో ఉదహరించింది. ఎస్పీజీ అంశంపై కాంగ్రెస్ తమ నిరసనను లోక్‌సభలో నవంబర్ 25 వరకు చేయనున్నట్లు తెలిపింది. -
ఎస్పీజీ చీఫ్ సిన్హాకు సోనియా లేఖ
న్యూఢిల్లీ : సుదీర్ఘకాలం పాటు తమకు భద్రత కల్పించినందుకు గానూ స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూపు(ఎస్పీజీ) డైరెక్టర్ అరుణ్ కుమార్ సిన్హాకు కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ ధన్యవాదాలు తెలిపారు. 28 ఏళ్లుగా ప్రతి రోజూ తాము సురక్షితంగా ఉండటంలో ఎస్పీజీ సభ్యులు చేసిన కృషి మరువలేనిదన్నారు. ఈ మేరకు అరుణ్ కుమార్‌కు సోనియా లేఖ రాశారు. ‘ ఎస్పీజీ ప్రతిభావంతమైన దళం. ఇందులోని సభ్యులు ఎంతో ధైర్యవంతులు. వారు చేసే ప్రతి పనిలోనూ దేశభక్తి కన్పిస్తుంది. మా కుటుంబ రక్షణను ఎస్పీజీ చేతుల్లో పెట్టిన నాటి నుంచి సురక్షితంగా ఉంటామనే ధీమా కలిగింది. గత 28 ఏళ్లుగా ఎస్పీజీ సభ్యుల అంకితభావం, విధుల పట్ల వారి నిబద్ధత కారణంగా ప్రతీ రోజు మేము క్షేమంగా ఉన్నాం. ఇన్నేళ్లపాటు మాకు రక్షణగా నిలిచినందుకు నా తరఫున, నా కుటుంబ సభ్యుల తరఫున ఎస్పీజీ గ్రూపు సభ్యులకు కృతఙ్ఞతలు తెలుపుతున్నాను. మీ అందరికీ అభినందనలు అని సోనియా లేఖలో పేర్కొన్నారు.(చదవండి : రాహుల్ గాంధీ భావోద్వేగపూరిత ట్వీట్) కాగా దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ కుటుంబానికి కల్పిస్తున్న స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూపు(ఎస్పీజీ) భద్రతను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఎంపీ రాహుల్ గాంధీ, పార్టీ ప్రధాన కారదర్శి ప్రియాంక గాంధీ వాద్రాలను ఎస్పీజీ నుంచి సీఆర్పీఎఫ్ బలగాల సంరక్షణలోని జడ్ ప్లస్ కేటగిరీకి మార్చింది. అదే విధంగా ఎస్పీజీలోని దాదాపు 3 వేల మంది సైనికులు ఇకపై దేశ ప్రధాని భద్రతకై సేవలు అందించనున్నారు. ఇక తమకు ఎస్పీజీ భద్రతను ఉపసంహరించిన నేపథ్యంలో రాహుల్ గాంధీ ఎస్పీజీ సిబ్బందికి ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశారు. -
వీవీఐపీల రహస్య పర్యటనలకు చెక్..!
న్యూఢిల్లీ : దేశంలో అత్యంత ప్రముఖులకు ఇచ్చే స్పెషల్ ప్రొటక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) నిబంధనలను కేంద్ర హోం శాఖ తాజాగా సవరించింది. ఇప్పటి నిబంధనల ప్రకారం వీవీఐపీలు ఇక నుంచి విదేశీ పర్యటనలకు వెళ్లినపుడు ఎస్పీజీ సిబ్బంది వారిని నీడలా వెన్నంటి ఉండాల్సిందే. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్య తర్వాత 1985లో ఎస్పీజీని ఏర్పాటు చేశారు. భారత పార్లమెంటును రక్షించడానికి ఈ బృందాన్ని అంకితం చేస్తూ పార్లమెంటు 1988 లో ఎస్పీజీ చట్టాన్ని ఆమోదించింది. తర్వాత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి ఇచ్చిన ఎస్పీజీ రక్షణను 1989 లో విపీ సింగ్ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. మాజీ ప్రధాని కుటుంబ సభ్యుల హోదాలో రాహుల్ గాంధీకి ఎస్పీజీ భద్రత ఉంది. అనునిత్యం ఆయనకు భద్రతా కమాండోలు రక్షణ కల్పిస్తుంటారు. అలాంటిది కనీసం ప్రస్తుతం వారిని కూడా తనతో విదేశాలకు రానివ్వడం లేదు. ఉన్నట్లుండి మాయమవడం.. అజ్ఞాతంలోకి వెళ్లిపోవడం.. ఎక్కడ తిరుగుతారో ఎవరికీ తెలియనివ్వకపోవడం.. ఇది కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విదేశీ పర్యటనల తీరు..! రాహుల్ గాంధీ కాంబోడియా పర్యటన నిమిత్తం వెళ్లిన నేపథ్యంలో వీవీఐపీల భద్రతా నిబంధనలను ప్రభుత్వం సవరించడం చర్చనీయాంశమైంది.ఇప్పటిదాకా విదేశాలకు వెళ్తే ఎస్పీజీ సిబ్బందిని కొన్ని ప్రదేశాలకు వారితో రాకుండా వీవీఐపీలు నియంత్రించే వారు. కానీ సవరించని నిబంధనల కారణంగా ఇక ప్రతిక్షణం వీవీఐపీల వెన్నంటే ఉండనున్నారు. భద్రతా కారణాల రీత్యా ఈ చర్యలు తీసుకొంటున్నట్లు ప్రభుత్వం చెప్తోంది. ఎస్పీజీ సిబ్బందిని అనుమతించకపోతే వారి విదేశీ పర్యటనలను ఇక నుంచి కేంద్రం నియంత్రించే అవకాశం ఉంది. గాంధీ కుటుంబీకులు ఇప్పటి దాకా విదేశాలకు వెళ్లినపుడు వారు మొదట గమ్యస్థానం చేరేవరకు ఎస్పీజీ సిబ్బంది వారిని అనుసరిస్తూ రక్షణ కల్పించేవారు. అక్కడినుంచి ఎస్పీజీ సిబ్బందిని వెనక్కి పంపి వారు వెళ్లాల్సిన ప్రదేశాలకు వెళ్లి పర్యటనలు ముగించకొని వచ్చేవారు. అలా చేసే కొన్ని సందర్భాలో వీరు భద్రతాపరమైన ఇబ్బందులకు గురవుతున్నారు. సవరించిన భద్రతా నియమాల కారణంగా వీవీఐపీల రహస్య పర్యటనలకు ఇబ్బందులు ఏర్పడనున్నాయి. -
మాజీ ప్రధానికి ఎస్పీజీ భద్రత ఉపసంహరణ
సాక్షి, న్యూఢిల్లీ : మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు ఎస్పీజీ భద్రతను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించింది. ఎస్పీజీకి బదులు ఆయనకు సీఆర్పీఎఫ్ భద్రతను కల్పిస్తూ హోంమంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. నిఘా వర్గాల సమచారాన్ని విశ్లేషించి హోంశాఖ ఈ నిర్ణయం తీసుకుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఎస్పీజీ భద్రతను కొద్దిమందికే కల్పించనున్న క్రమంలో వార్షిక సమీక్షలో భాగంగా మన్మోహన్ సింగ్ భద్రతను పునఃసమీక్షిస్తూ కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం . ఎస్పీజీ భద్రత ప్రస్తుతం కేవలం నలుగురు అత్యున్నత రాజకీయ ప్రముఖులైన ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ ఆమె కుమారుడు రాహుల్ గాంధీ, కుమార్తె ప్రియాంక గాంధీ వాద్రాలకు మాత్రమే పరిమితమైంది. మన్మోహన్ సింగ్‌కు జడ్ ప్లస్ సెక్యూరిటీ కొనసాగుతుందని హోం శాఖ వర్గాలు పేర్కొన్నాయి. 3000 మందికి పైగా సిబ్బందితో కూడిన ఎస్పీజీ భద్రతను దేశ ప్రధాని, మాజీ ప్రధానులు వారి కుటుంబ సభ్యులకు వారికి ఉన్న ముప్పు ఆధారంగా ప్రత్యేక దళంతో భద్రత కల్పిస్తారు. -
రాహుల్‌పై పిటిషన్ కొట్టివేత
సాక్షి,న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై దాఖలైన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. రాహుల్ ఎస్పీజీ భద్రతను తోసిపుచ్చి, ప్రమాదం కొనితెచ్చుకుంటున్నారన్న ఆరోపణలపై దాఖలైన ఈ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది.ఈ పిటిషన్ విచారణార్హమైనది కాదని, భద్రతా అంశాలపై నిర్ణయించేందుకు న్యాయస్ధానం సరైన వేదిక కాదని తాత్కాలిక న్యాయమూర్తి జస్టిస్ గీతా మిట్టల్, జస్టిస్ సీ హరిశంకర్‌తో కూడిన బెంచ్ స్పష్టం చేసింది. భద్రతపై తామేం నిర్ణయించలేమని, భద్రతకు సంబంధించి తామే ప్రభుత్వంపై ఆధారపడతామని, వారి (ప్రభుత్వం) అంచనాల ప్రాతిపదికనే వ్యవహరిస్తామని పేర్కొంది. మరోవైపు రాహుల్ భద్రతపై ప్రభుత్వం కూడా ఆందోళన చెందుతోందని, ఎస్పీజీ భద్రతను అలక్ష్యం చేయడం బాధ్యతాయుత ప్రవర్తన కాదని కేంద్ర ప్రభుత్వ స్టాండింగ్ కౌన్సిల్ అనిల్ సోని కోర్టుకు తెలిపారు. రాహుల్‌కు ఏమైనా జరిగితే అందుకు తాము (ప్రభుత్వం) బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ చట్టాన్ని ఉల్లంఘించకుండా కేంద్రం వ్యవహరించాలని ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ముంబయి బీజేపీ ప్రతినిధి తుహిన్ ఏ సిన్హా ఈ పిటిసన్ దాఖలు చేశారు. ఎస్పీజీ భద్రత లేకుండా పర్యటించబోనని కోర్టుకు అఫిడవిట్ సమర్పించాలని రాహుల్‌ను ఆదేశించాలని కూడా పిటిషనర్ కోరారు. -
నరేంద్ర మోడీకి ఎస్పీజీ రక్షణ కల్పించలేం: కేంద్రం
బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి పూర్తి భద్రత కల్పించాల్సిన బాధ్యత కేంద్రానిదేనని ఆ పార్టీ డిమాండ్ చేయడంపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి ఆర్పీఎన్ సింగ్ స్పందించారు. మోడీకి అవసరమైనంత భద్రత ఇదివరకే పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశామని చెప్పారు. కాగా ఆయనకు ప్రత్యేక భద్రత దళం (ఎస్పీజీ) రక్షణ కల్పించలేదని, అందుకు వీలుకాదని మంత్రి స్పష్టం చేశారు. పాట్నాలో ఇటీవల మోడీ పాల్గొన్న ర్యాలీ సందర్భంగా వరుస బాంబు పేలుళ్లు జరగడంపై ఆయన భద్రతపై బీజేపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు మరింత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో సింగ్ మాట్లాడుతూ.. 'మోడీకి అత్యున్నత స్థాయి ఎన్ఎస్జీ భద్రత ఏర్పాటు చేశాం. అంతేగాక ఆయన ఏ ప్రాంతానికి వెళ్లినా ముందుస్తుగా భద్రత కల్పించాలని ఆదేశించాం. మోడీకి పొంచి ఉన్న ముప్పును పరిగణించి అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం' అని చెప్పారు. కాగా పార్లమెంట్ చట్టం ప్రకారం ఎస్పీజీ భద్రతను ప్రధాని, మాజీ ప్రధానులతో పాటు వారి కుటుంబ సభ్యులకు మాత్రమే కల్పిస్తారని తెలిపారు. బీజేపీకి ఈ విషయం తెలిసినా కావాలనే రాజకీయం చేస్తోందని మంత్రి ఆరోపించారు.