నరేంద్ర మోడీకి ఎస్పీజీ రక్షణ కల్పించలేం: కేంద్రం
బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి పూర్తి భద్రత కల్పించాల్సిన బాధ్యత కేంద్రానిదేనని ఆ పార్టీ డిమాండ్ చేయడంపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి ఆర్పీఎన్ సింగ్ స్పందించారు. మోడీకి అవసరమైనంత భద్రత ఇదివరకే పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశామని చెప్పారు. కాగా ఆయనకు ప్రత్యేక భద్రత దళం (ఎస్పీజీ) రక్షణ కల్పించలేదని, అందుకు వీలుకాదని మంత్రి స్పష్టం చేశారు.
పాట్నాలో ఇటీవల మోడీ పాల్గొన్న ర్యాలీ సందర్భంగా వరుస బాంబు పేలుళ్లు జరగడంపై ఆయన భద్రతపై బీజేపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు మరింత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో సింగ్ మాట్లాడుతూ.. 'మోడీకి అత్యున్నత స్థాయి ఎన్ఎస్జీ భద్రత ఏర్పాటు చేశాం. అంతేగాక ఆయన ఏ ప్రాంతానికి వెళ్లినా ముందుస్తుగా భద్రత కల్పించాలని ఆదేశించాం. మోడీకి పొంచి ఉన్న ముప్పును పరిగణించి అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం' అని చెప్పారు. కాగా పార్లమెంట్ చట్టం ప్రకారం ఎస్పీజీ భద్రతను ప్రధాని, మాజీ ప్రధానులతో పాటు వారి కుటుంబ సభ్యులకు మాత్రమే కల్పిస్తారని తెలిపారు. బీజేపీకి ఈ విషయం తెలిసినా కావాలనే రాజకీయం చేస్తోందని మంత్రి ఆరోపించారు.