నోవాటెల్‌లోనే మోదీ బస! | BJP Says PM Narendra Modi Likely Stay Novotel Hotel Madhapur For-2 Days | Sakshi
Sakshi News home page

నోవాటెల్‌లోనే మోదీ బస!

Published Thu, Jun 30 2022 1:24 AM | Last Updated on Thu, Jun 30 2022 7:57 AM

BJP Says PM Narendra Modi Likely Stay Novotel Hotel Madhapur For-2 Days - Sakshi

సాక్షి, హైదరాబాద్‌/రసూల్‌పురా: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశానికి హాజరవుతున్న ప్రధాని మోదీ.. మాదాపూర్‌లోని నోవాటెల్‌ హోటల్‌లో బస చేయనున్నట్టు సమాచారం. ప్రధాని రాకకు ముందుగా బుధవారమే హైదరాబాద్‌కు చేరుకున్న ‘స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూప్‌ (ఎస్పీజీ)’బృందాలు.. నోవాటెల్‌ హోటల్‌లో స్థానిక పోలీసులతో సమావేశమయ్యారు. ప్రధానితోపాటు పెద్ద సంఖ్యలో కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల సీఎంలు రానున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు. మోదీ రాజ్‌భవన్‌లోనే బస చేస్తారని తొలుత భావించారు. కానీ రాజ్‌భవన్‌ నుంచి 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న హెచ్‌ఐసీసీ వరకు ప్రధాని రాకపోకలు, భద్రతా ఏర్పాట్లు సమస్యగా మారుతాయని నిఘా వర్గాలు పేర్కొనడంతో.. నోవాటెల్‌లోనే ప్రధాని బసను ఖరారు చేసినట్టు తెలిసింది. 2004లో హైదరాబాద్‌లో జరిగిన బీజేపీ కార్యవర్గ సమావేశానికి వచ్చిన అప్పటి ప్రధాని వాజ్‌పేయి.. లోయర్‌ ట్యాంక్‌బండ్‌ ప్రాంతం లోని ఓ స్టార్‌ హోటల్‌లో బస చేశారు. 

మూడు రోజులు.. హోటల్‌ మొత్తం.. 
ప్రధాని మోదీ జూలై 2న సాయంత్రం ప్రత్యేక విమానంలో బేగంపేటకు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో నేరుగా సమావేశం జరిగే హెచ్‌ఐసీసీ ప్రాంగణానికి వస్తారు. సమావేశం తర్వాత పక్కనే ఉన్న నోవాటెల్‌ హోటల్‌లో బసచేస్తారు. మొత్తం 288 గదులున్న ఈ హోటల్‌లో ప్రధాని బస కోసం ఓ ఫ్లోర్‌ మొత్తం రిజర్వు చేసినట్టు తెలిసింది. బీజేపీ కార్యవర్గ సమావేశాల కోసం 1వ తేదీ నుంచి 3వ తేదీ దాకా ఈ హోటల్‌ మొత్తాన్ని బుక్‌ చేశారని హోటల్‌ ప్రతినిధి ఒకరు తెలిపారు. 

అణువణువూ తనిఖీలు.. భద్రత కట్టుదిట్టం 
ప్రధాని, కేంద్ర మంత్రుల పర్యటన నేపథ్యంలో హెచ్‌ఐసీసీ, నోవాటెల్‌ హోటల్‌ పరిసర ప్రాంతాల్లో అణువణువూ తనిఖీ చేస్తున్నారు. హోటల్‌లో పనిచేసే సిబ్బంది, కుటుంబ సభ్యుల వివరాలను ఎస్పీజీ బృందాలు సేకరించాయని.. వారి ఇళ్లకు కూడా వెళ్లి తనిఖీ చేశాయని సమాచారం. హెచ్‌ఐసీసీ, నోవాటెల్‌ హోటల్, పరిసర ప్రాంతాల్లో సీసీ టీవీ కెమెరాల పనితీరును అధికారులు పర్యవేక్షించారు. సుమారు వెయ్యి మందికి పైగా పోలీసులు హోటల్‌ చుట్టూ పహారా కాయనున్నారు. బుధవారం నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు హెచ్‌ఐసీసీ చుట్టూ ఐదు కిలోమీటర్ల విస్తీర్ణంలో డ్రోన్లు, పారా గ్లైడర్లు, మైక్రో లైట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌లను నిషేధిస్తున్నట్టు సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర ప్రకటించారు. 

సభ ఏర్పాట్లను పరిశీలించిన తరుణ్‌ ఛుగ్‌ 
వచ్చే నెల 3న ప్రధాని మోదీ బహిరంగ సభ జరగనున్న పరేడ్‌ గ్రౌండ్స్‌లో ఏర్పాట్లను బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్‌ చుగ్‌ బుధవారం పరిశీలించారు. భద్రతాపరమైన అంశాలు, ఇతర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రధాని మోదీ సభ చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచిపోతుందని.. ప్రజలు కేసీఆర్‌కు వీడ్కోలు పలికేందుకు సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా తరుణ్‌ చుగ్‌ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్‌ నేతలు కె.లక్ష్మణ్, డీకే అరుణ, గరికపాటి మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు. కాగా.. కార్యవర్గ సమావేశానికి వచ్చే ప్రధాని, కేంద్ర మంత్రులు, సీఎంలు, ఇతర ముఖ్య నేతలను స్వాగతించేందుకు బేగంపేట విమానాశ్రయంలో బీజేపీ  ఏర్పాట్లు చేస్తోంది. బుధవారం తరుణ్‌ చుగ్‌తోపాటు బీజేపీ రాష్ట్ర చీఫ్‌ బండి సంజయ్, ఇతర నేతలు ఏర్పాట్లను పరిశీలించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement