ఎస్పీజీ చట్టానికి ప్రక్షాళన | Editorial On Special Protection Group Act Bill Amendment In Parliament | Sakshi
Sakshi News home page

ఎస్పీజీ చట్టానికి ప్రక్షాళన

Published Thu, Dec 5 2019 12:15 AM | Last Updated on Thu, Dec 5 2019 12:15 AM

Editorial On Special Protection Group Act Bill Amendment In Parliament - Sakshi

దేశంలో ప్రముఖుల భద్రత కోసం ఉద్దేశించిన ప్రత్యేక భద్రతా దళం(ఎస్పీజీ) చట్టం సవరణకు పార్లమెంటు ఆమోదం లభించింది. తాజా సవరణ చట్టంగా మారాక ఇక ప్రధాని, ఆయన కుటుంబానికి చెందిన వారికి తప్ప మరెవరికీ ఎస్పీజీ రక్షణ ఉండదు. వారికి సైతం పదవి నుంచి దిగిపోయాక ఇది అయిదేళ్లపాటు మాత్రమే ఉంటుంది. వాస్తవానికి ఈ బిల్లు ఆమోదానికి చాలా ముందే మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ఉన్న ఎస్పీజీ భద్రతను తొలగించారు. ఇటీవల సోనియాగాంధీ, ఆమె సంతానం రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీలకు సైతం తొలగించారు. వీరికి ఇకపై సీఆర్పీఎఫ్‌ బృందంతో కూడిన జడ్‌ ప్లస్‌ భద్రత ఉంటుంది.

సహజంగానే కాంగ్రెస్‌కు ఇది మింగుడుపడటం లేదు. ఎస్పీజీ బిల్లుపై చర్చ పూర్తయి ఓటింగ్‌ జరిగినప్పుడు ఆ పార్టీ వాకౌట్‌ చేసింది. మన దేశంలో ప్రముఖులకు సంబంధించిన భద్రత కోసం చాలా కేటగిరీలున్నాయి. ఎస్పీజీతోపాటు ఎన్‌ఎస్‌జీ, జడ్‌ ప్లస్, జడ్, వై, ఎక్స్‌...ఇలా వేర్వేరు కేటగిరీలను ఏర్పాటుచేశారు. ప్రాణావసరం అనుకున్నది కాస్తా ప్రచార ఆర్భాటంగా మిగలడం, అధికార దర్పాన్ని ప్రదర్శించ డానికి సాధనంగా మారడం మిగిలినవాటికన్నా ఎస్పీజీ విషయంలో అధికంగా కనబడుతుంది. రాజ్యాంగపరంగా అత్యున్నత పదవుల్లో ఉండేవారి ప్రాణాలకు ముప్పు వాటిల్లకుండా చూడటం అవసరమే.

ఉగ్రవాదుల బెడద పెరిగిన ప్రస్తుత పరిస్థితుల్లో దీన్నెవరూ తప్పుబట్టరు. అయితే రాను రాను భద్రత ఎవరికి అవసరం... ఏ స్థాయిలో, ఎంతకాలం అవసరం అనే విచక్షణ పోయింది. ఎస్పీజీ చట్టానికి సవరణలు చేసుకుంటూ పోయినకొద్దీ ఆ రక్షణ పొందేవారి జాబితా చాంతాడంత పెరిగింది. జాబితాలోనివారికి ఉండే వెసులుబాట్లు అన్నీ ఇన్నీ కాదు. వీరు పర్యటనకెళ్లినప్పుడల్లా బుల్లెట్‌ ప్రూఫ్‌ కార్లు వారికన్నా ముందే విమానంలో గమ్యం చేరతాయి. విమానాశ్రయాల్లో తనిఖీల బెడద ఉండదు. నేరుగా విమానం వరకూ దర్జాగా కారులో వెళ్లొచ్చు. సాధారణ పౌరులు వారు వృద్ధులైనా, యువకులైనా గంటలతరబడి క్యూలో నిలబడి అన్ని లాంఛనాలూ పూర్తిచేయాల్సి ఉండగా ఎస్పీజీ రక్షణ ఉన్నవారికి ఇవేమీ వర్తించవు. ఎటు కదిలినా వీరి వాహనానికి ముందూ వెనకా 15 బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాలు పరుగులు పెడుతుంటాయి. ఈ వాహనశ్రేణి కోసం ఎక్కడి కక్కడ ట్రాఫిక్‌ నిలిపేయడం సర్వసాధారణం. 

స్వాతంత్య్రం వచ్చిన మొదట్లో పాలకుల ప్రాణరక్షణకు ప్రత్యేక భద్రత అవసరమని పెద్దగా అనుకోలేదు. వారు ప్రజల మధ్యకు వెళ్లినప్పుడు ఇబ్బందులు తలెత్తకుండా చూడటానికి నామ మాత్రంగా పోలీసు రక్షణ ఉండేది. ప్రధాని మొదలుకొని మంత్రుల వరకూ ఎవరు కదిలినా ఆర్భాటం ఉండేది కాదు. 1984లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ తన నివాసంలోనే సెక్యూరిటీ గార్డుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయాక ఈ పరిస్థితి మారింది. 1981కి ముందు ప్రధాని భద్రతను ఢిల్లీ పోలీస్‌ విభాగంలోని డీసీపీ స్థాయి అధికారి నేతృత్వంలోని బృందం పర్యవేక్షించేది.

ఆ తర్వాతకాలంలో అందుకోసం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటుచేశారు. ఇందిర హత్యానంతరం 1985లో బీర్బల్‌నాథ్‌ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఎస్పీజీ ఉనికిలోకొచ్చింది. అయితే మరో మూడేళ్ల తర్వాతగానీ దీనికి చట్ట ప్రతిపత్తి రాలేదు. రాజీవ్‌గాంధీ హయాంలో దానికి సంబంధించిన బిల్లు ప్రతిపాదించారు. అయితే పదవి నుంచి తప్పుకున్నాక కూడా రక్షణ అవసరమని అప్పట్లో అనుకోలేదు. బహుశా ఆ ఏర్పాటువుంటే ఉగ్రవాదుల కుట్రకు రాజీవ్‌ బలయ్యేవారు కాదు. ఆ తర్వాత 1991లో మాజీ ప్రధానులకు కూడా ఎస్పీజీ రక్షణ ఉండాలంటూ సవరణ చేశారు. అలా వరసగా 1994, 1999, 2003 సంవత్సరాల్లో మరికొన్ని సవరణలు వచ్చి చేరాయి. ఫలితంగా ప్రధాని, మాజీ ప్రధాని, వారి కుటుంబసభ్యులు సైతం ఎస్పీజీ ఛత్రఛాయలోకొచ్చారు. ప్రధాని పదవి నుంచి వైదొలగిన పదేళ్ల వరకూ ఈ రక్షణ కొనసాగే ఏర్పాటు చేశారు. 

ప్రముఖులకు కల్పించే భద్రత ఈమధ్య కాలంలో ఎబ్బెట్టుగా మారింది. పదకొండేళ్లపాటు ఈ ఎస్పీజీ రక్షణ వలయంలో ఉన్న మాజీ ప్రధాని చంద్రశేఖర్‌ కుమారుడు నీరజ్‌ శేఖర్‌ రాజ్యసభలో చర్చ సందర్భంగా మాట్లాడిన మాటలే దీనికి రుజువు. తనకంటూ ఏ పదవీ, హోదా లేకపోయినా ఎస్పీజీ రక్షణంతా చూసి జనం తన ఆటోగ్రాఫ్‌ కోసం ఎగబడేవారని ఆయన వ్యాఖ్యానించారు. నిజానికి తనెవరో దేశంలో ఎవరికీ తెలియదని, కానీ ఈ భద్రత, దాంతో పాటుండే హడావుడి వగై రాలు చూసి ఏదో పెద్ద పదవి వెలగబెడుతున్నానని అందరూ అనుకునేవారని నీరజ్‌ చెప్పుకొచ్చారు.

ఇవన్నీ చూశాకే సాధారణ పౌరుల్లో వీఐపీ సంస్కృతిపై ఏవగింపు ఏర్పడింది. ఇంత భద్రత పొందుతున్న వీఐపీలు పాటించవలసిన నిబంధనల్ని మాత్రం మరిచిపోతారు. ఎస్పీజీ రక్షణలో ఉండే ప్రముఖులు ఎటు వెళ్లదల్చుకున్నా చాలా ముందుగా ఎక్కడికెళ్తున్నారో, తిరిగి ఎప్పుడొస్తారో భద్రతా వ్యవహారాలు చూసే ఇన్‌చార్జికి తెలపాలి. అలాగే వారికోసం వచ్చేవారి సమస్త వివరాలనూ ఎస్పీజీ ప్రత్యేక రిజిస్టర్‌లో నమోదు చేస్తుంది.

కానీ కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా పార్లమెంటులో వెల్లడించిన వివరాల ప్రకారం 2015 మొదలుకొని ఇప్పటివరకూ రాహుల్‌గాంధీ దేశంలో వివిధ ప్రాంతాలకెళ్లినప్పుడు 1,892 సందర్భాల్లో, విదేశాలకెళ్లినప్పుడు 247 సందర్భాల్లో ఎస్పీజీకి వర్త మానం ఇవ్వలేదు. సోనియాగాంధీ సైతం ఢిల్లీలో 50సార్లు, దేశంలో వివిధ ప్రాంతాలకెళ్లినప్పుడు 13సార్లు, విదేశాలకెళ్లినప్పుడు 29సార్లు తెలియజేయలేదు. ప్రియాంకగాంధీ తీరు కూడా భిన్నంగా లేదు.

ఆమె ఢిల్లీలో 339 సందర్భాల్లో, దేశంలో వేర్వేరు ప్రాంతాలకెళ్లినప్పుడు 64సార్లు, విదేశా లకెళ్లినప్పుడు 94సార్లు వర్తమానం ఇవ్వలేదు. భద్రత లాంఛనంగా మారడం సరికాదు.  పదవులు విడనాడాక నాయకులే ఎవరికి వారు స్వచ్ఛందంగా భద్రత స్థాయిని తగ్గించుకుంటే హుందాగా ఉంటుంది. ఎందుకంటే దీని పేరు చెప్పి ఖజానాపై ఏటా వందలకోట్ల రూపాయల భారం పడు తోంది. పైగా ఈ ఆర్భాటం సామాన్యులకు సమస్యగా మారుతోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement