సాక్షి,న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై దాఖలైన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. రాహుల్ ఎస్‌పీజీ భద్రతను తోసిపుచ్చి, ప్రమాదం కొనితెచ్చుకుంటున్నారన్న ఆరోపణలపై దాఖలైన ఈ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది.ఈ పిటిషన్ విచారణార్హమైనది కాదని, భద్రతా అంశాలపై నిర్ణయించేందుకు న్యాయస్ధానం సరైన వేదిక కాదని తాత్కాలిక న్యాయమూర్తి జస్టిస్ గీతా మిట్టల్, జస్టిస్ సీ హరిశంకర్‌తో కూడిన బెంచ్ స్పష్టం చేసింది.
భద్రతపై తామేం నిర్ణయించలేమని, భద్రతకు సంబంధించి తామే ప్రభుత్వంపై ఆధారపడతామని, వారి (ప్రభుత్వం) అంచనాల ప్రాతిపదికనే వ్యవహరిస్తామని పేర్కొంది. మరోవైపు రాహుల్ భద్రతపై ప్రభుత్వం కూడా ఆందోళన చెందుతోందని, ఎస్‌పీజీ భద్రతను అలక్ష్యం చేయడం బాధ్యతాయుత ప్రవర్తన కాదని కేంద్ర ప్రభుత్వ స్టాండింగ్ కౌన్సిల్ అనిల్ సోని కోర్టుకు తెలిపారు. రాహుల్‌కు ఏమైనా జరిగితే అందుకు తాము (ప్రభుత్వం) బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు.
రాహుల్ గాంధీ స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ చట్టాన్ని ఉల్లంఘించకుండా కేంద్రం వ్యవహరించాలని ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ముంబయి బీజేపీ ప్రతినిధి తుహిన్ ఏ సిన్హా ఈ పిటిసన్ దాఖలు చేశారు. ఎస్‌పీజీ భద్రత లేకుండా పర్యటించబోనని కోర్టుకు అఫిడవిట్ సమర్పించాలని రాహుల్‌ను ఆదేశించాలని కూడా పిటిషనర్ కోరారు.
Comments
Please login to add a commentAdd a comment