సామాన్యులకు చేదువార్త
న్యూఢిల్లీ: వేతన జీవులకు కేంద్ర ప్రభుత్వం చేదువార్త అందించింది. చిన్న మొత్తాలపై వడ్డీలు తగ్గించి సామాన్యులకు షాక్ ఇచ్చింది. పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్(పీపీఎఫ్), కిసాన్ వికాస పత్రం(కేవీపీ) వడ్డీ రేట్లలో భారీగా కోత పెట్టింది. పీపీఎఫ్ పై వడ్డీ రేటు 8.7 శాతం నుంచి 8.1 శాతానికి తగ్గించింది. కేవీపీ వడ్డీ రేటును 8.7 శాతం నుంచి 7.8 శాతానికి కుదించింది.
ప్రతి నాలుగు నెలలకు ఒకసారి వడ్డీరేట్లను సవరించాలని ఫిబ్రవరి 16న కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి అనుగుణంగా తాజాగా వడ్డీరేట్లను సవరించింది. ఏప్రిల్ 1 నుంచి జూన్ 30 వరకు ఈ వడ్డీరేట్లు అమల్లో ఉంటాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మిగతా పొదుపు పథకాలకు భారీగా వడ్డీరేటు కోత విధించింది.
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్స్ పై వడ్డీరేటు 8.5 శాతం నుంచి 8.1 శాతానికి తగ్గించింది. బాలికల కోసం ప్రవేశపెట్టిన సుకన్య సమృద్ధి యోజనకు వడ్డీరేటును 9.2 శాతం నుంచి 8.6 శాతానికి పరిమితం చేసింది. వృద్ధుల ఐదేళ్ల పొదుపు ఖాతాల వడ్డీకి కోత పెట్టింది. ఇప్పటివరకు సీనియర్ సిటిజన్లకు 9.3 శాతం వడ్డీ వస్తుండగా ఏప్రిల్ 1 నుంచి 8.6 శాతం వడ్డీ మాత్రమే దక్కనుంది.