పీపీఎఫ్ వడ్డీరేట్లలోనూ కోత!
పీపీఎఫ్ వడ్డీరేట్లలోనూ కోత!
Published Mon, Apr 11 2016 2:08 PM | Last Updated on Sun, Sep 3 2017 9:42 PM
ఆర్బీఐ ప్రకటించిన పావుశాతం రెపో రేటు కోత, రుణదారులకు ఆశల పల్లకిలా కనిపిస్తుంటే.. పొదుపరులకు మాత్రం నిరాశా నిస్పృహలను మిగులుస్తోంది. రెపో రేటును ఆర్బీఐ తగ్గించడంతో, అప్పు తీసుకున్నవారికి వడ్డీ రేట్లు తగ్గనున్నాయి. ఈ క్రమంలోనే చిన్న మొత్తాల్లో పొదుపు చేసుకునే పీపీఎఫ్ (పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్) లాంటి పథకాల వడ్డీరేట్లు జూలై-సెప్టెంబర్ కాలంలో 20 నుంచి 25 బేసిస్ పాయింట్లు తగ్గే అవకాశాలున్నాయని రీసెర్చ్ ఏజెన్సీ ఇండియా రేటింగ్స్ వెల్లడించింది. దీంతో చిన్నమొత్తాల్లో పొదుపు చేసుకునేవారు చింతించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
పీపీఎఫ్ వడ్డీరేట్లు 7.85 నుంచి 7.9 శాతం మధ్య ఉండనున్నట్టు రీసెర్చ్ ఏజెన్సీ తెలిపింది. చిన్న మొత్తాల్లో పొదుపు చేసుకునేవారి వడ్డీరేట్లలో ప్రతి మూడు నెలలకోసారి మార్పులు జరుగుతాయి. ప్రభుత్వ సెక్యురిటీలు, బాండ్లకు అనుగుణంగా వీటిని సమీక్షిస్తుంటారు. చిన్న మొత్తాల పొదుపు వడ్డీరేట్లపై ఏప్రిల్ క్వార్టర్ లో ప్రభుత్వం కోత విధించింది. దీని ఫలితంగా జూన్ 30-ఏప్రిల్ 1 మధ్యకాలంలో పీపీఎఫ్ వడ్డీరేట్లు 8.7 శాతం నుంచి 8.1 శాతానికి తగ్గాయి.
సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ పై వడ్డీరేటు 9.3 శాతం నుంచి 8.6 శాతానికి తగ్గగా.. చిన్న పిల్లల సుకన్య సమృద్ధి అకౌంట్లపై వడ్డీరేట్లు 9.2 నుంచి 8.6 శాతానికి దిగివచ్చాయి. బ్యాంకుల్లో నగదు నిల్వలు పెంచేందుకే ఆర్బీఐ ఈ లిక్విడిటీ విధానాన్ని ప్రవేశపెట్టినట్లు మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Advertisement
Advertisement