‘పొదుపు’పై పిడుగు..! | Interest rate on Public Provident Fund cut to 8.1% from 8.7% | Sakshi
Sakshi News home page

‘పొదుపు’పై పిడుగు..!

Published Sat, Mar 19 2016 12:13 AM | Last Updated on Sun, Sep 3 2017 8:04 PM

‘పొదుపు’పై పిడుగు..!

‘పొదుపు’పై పిడుగు..!

సామాన్యుడికి కేంద్రం షాక్..
పీపీఎఫ్‌పై వడ్డీరేటు 8.7% నుంచి 8.1%కి తగ్గింపు
సుకన్య సమృద్ధి, సీనియర్ సిటిజన్,
కిసాన్ వికాస్ పత్ర యోజనలపై సైతం రేటు కోత
మరికొన్ని చిన్నమొత్తాల పొదుపులపై కూడా...
ఏప్రిల్ 1 నుంచీ కొత్త రేట్లు అమలు

న్యూఢిల్లీ: సామాన్యుడి పొదుపుపై మళ్లీ దెబ్బపడింది. బ్యాంకు డిపాజిట్లకంటే కాస్త మెరుగైన రాబడికి, విశ్వసనీయతకు తగిన పొదుపు సాధనాలుగా ప్రజలు ఎంచుకునే చిన్న మొత్తాల పొదుపు వడ్డీ రేట్లపై ప్రభుత్వం బాగా కోత విధించింది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), కిసాన్ వికాస్ పత్ర (కేవీపీ)సహా చిన్న పొదుపులపై చెల్లించే వడ్డీరేటును శుక్రవారం మరోసారి కేంద్రం తగ్గించింది. మార్కెట్ రేటుకు అనుసంధానం చేస్తూ ప్రతి మూడు నెలలకు ఒకసారి సమీక్షించాలని ఫిబ్రవరి 16న తీసుకున్న నిర్ణయంలో భాగంగా... తాజాగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

గత సమీక్ష సందర్భంలో సామాజిక భద్రతా పథకాలుగా పేర్కొన్న సుకన్యా సమృద్ధి యోజన,  ఐదేళ్లసీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ వంటి ప్రజాదరణ పథకాలపై సైతం ఈ దఫా వడ్డీరేటు కోత వేటు పడ్డం గమనార్హం. ఈ పథకాల వడ్డీ రేట్లను ముట్టుకోబోమంటూ చెప్పిన ప్రభుత్వం వాటి వడ్డీ రేట్లను సైతం దించేయడం సామాన్యుని పొదుపు రేటుపై మరో శరాఘాతమేనన్న విమర్శలు తలెత్తుతున్నాయి. తాజా రేటు ఏప్రిల్ 1-జూన్ 30 వరకూ అమలవుతుంది. వివిధ పథకాలపై తాజా రేట్లు ఇవి...

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌పై రేటు 8.7 శాతం నుంచి 8.1 శాతానికి తగ్గింది.
కిసాన్ వికాస్ పత్రపై రేటు 8.7 శాతం నుంచి 7.8 శాతానికి తగ్గింది. కిసాన్ వికాస పత్రలో మదుపులు ప్రస్తుతం 100 నెలలకు (ఎనిమిది సంవత్సరాల నాలుగు నెలలు) రెట్టింపు అవుతుండగా, ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఈ కాలం 110 (తొమ్మిది సంవత్సరాల రెండు నెలలు) నెలలకు పెరిగింది.

తపాలా సేవింగ్స్‌పై రేటు 4 శాతంగా కొనసాగుతుంది. ప్రజాదరణ కలిగిన ఐదేళ్ల నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్స్‌పై వడ్డీ 8.5 శాతం నుంచి 8.1 శాతానికి తగ్గింది. ఐదేళ్ల ప్రస్తుత మంత్లీ ఇన్‌కమ్ అకౌంట్ రేటు సైతం 8.4 శాతం నుంచి 7.8 శాతానికి దిగింది. పోస్టాఫీస్ ఏడాది, రెండేళ్లు, మూడేళ్ల టర్మ్ డిపాజిట్లపై సైతం రేటు తగ్గింది. ప్రస్తుతం వీటిపై 8.4 శాతం వడ్డీ వస్తుండగా... ఏప్రిల్ 1 నుంచి ఏడాది టర్మ్ డిపాజిట్‌పై 7.1 శాతం, రెండేళ్ల టర్మ్ డిపాజిట్‌పై 7.2 శాతం, మూడేళ్ల టర్మ్ డిపాజిట్‌పై 7.4 శాతం వడ్డీ అందుతుంది. ఐదేళ్ల టైమ్ డిపాజిట్‌పై రేటు 8.5 శాతం నుంచి 7.9 శాతానికి తగ్గింది. ఐదేళ్ల రికరింగ్ డిపాజిట్‌పై రేటు 8.4 శాతం నుంచి 7.4 శాతానికి తగ్గించింది.

సామాజిక అభివృద్ధి పథకంగా పేర్కొని, గత సమీక్ష సందర్భంగా మినహాయించిన కీలక సుకన్యా సమృద్ధి యోజనపై సైతం రేటు కోత పడింది. ఈ రేటు 9.2 శాతం నుంచి 8.6 శాతానికి తగ్గింది.

గత సమీక్ష సందర్భంగా మినహాయింపు పొందిన  ఐదేళ్లసీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌దీ ఇదే పరిస్థితి. ఈ రేటు 9.3 శాతం నుంచి 8.6 శాతానికి తగ్గించింది.

ఒకటి, రెండు, మూడు సంవత్సరాలకు సంబంధించి పోస్టాఫీస్ టర్మ్ డిపాజిట్లు, కిసాన్ వికాస పత్రాలు, ఐదేళ్ల రికరింగ్  డిపాజిట్‌పై ఇప్పటి వరకూ... ఇదే కాలాలకు సంబంధించి ప్రభుత్వ బాండ్లకన్నా అదనంగా పావుశాతం రేటు అందుతోంది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఈ ప్రయోజనం ఏప్రిల్ 1 నుంచి మదుపుదారుకు అందదు.

ఫిబ్రవరి 16 ‘త్రైమాసిక సమీక్ష’ నిర్ణయం సందర్భంగా షార్ట్ టర్మ్ పోస్టాఫీస్ డిపాజిట్లపై 0.25 శాతం రేటు తగ్గించినట్లు ప్రకటించిన ప్రభుత్వం, సామాజిక భద్రతా పథకాల పేరుతో దీర్ఘకాల పథకాలు బాలికా, సీనియర్ సిటిజన్, ఎంఐఎల్, నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్  పీపీఎఫ్‌లపై మాత్రం వడ్డీరేటు కోత నిర్ణయాన్ని తీసుకోలేదు.  క్వార్టర్‌కు దాదాపు 15 రోజుల ముందు ఈ రేట్ల సమీక్ష జరుగుతుందని ఫిబ్రవరి 16న ప్రభుత్వం ప్రకటించింది. రేట్ల తాజా నిర్ణయానికి క్రితం 3 నెలల ప్రభుత్వ బాండ్ రేట్ల ప్రాతిపదికన (ఉదాహరణకు డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి) ఈ సమీక్ష జరుగుతుంది.

చిన్న మొత్తాల పొదుపు స్కీమ్‌ల ద్వారా రానున్న ఆర్థిక సంవత్సరం  కేంద్రం రూ. 4 లక్షల కోట్లు సేకరించగలుగుతుందని అంచనా. వీటిపై చెల్లించే వడ్డీరేట్ల తాజా తగ్గింపు వల్ల ప్రభుత్వానికి దాదాపు రూ. 4 వేల కోట్లు ఆదా అవుతుందని అంచనా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement