రిస్క్‌ వద్దా..? పీపీఎఫ్‌ బెటర్‌! | PPF interest rate cut to 7.9% | Sakshi
Sakshi News home page

రిస్క్‌ వద్దా..? పీపీఎఫ్‌ బెటర్‌!

Published Sun, Apr 30 2017 11:57 PM | Last Updated on Thu, Sep 27 2018 4:47 PM

రిస్క్‌ వద్దా..? పీపీఎఫ్‌ బెటర్‌! - Sakshi

రిస్క్‌ వద్దా..? పీపీఎఫ్‌ బెటర్‌!

ప్రస్తుత వడ్డీ రేటు 7.9 శాతం
♦  పన్ను ఉండదు కనక ఇది మంచి రాబడే
♦ మిగతా పథకాల్లో దేని లోటుపాట్లు దానికున్నాయ్‌
♦  సుకన్య సమృద్ధి... ఆడపిల్లలున్న వారికి మాత్రమే
♦ బ్యాంకు ఎఫ్‌డీలలో వడ్డీ రేటు చాలా తక్కువ
♦ డెట్, మ్యూచ్‌వల్‌ ఫండ్స్‌లో రాబడికి గ్యారంటీ లేదు
♦  చాలా వాటికి పన్ను కోత కూడా ఉంటుంది
♦  ప్రస్తుత పెట్టుబడి పథకాలపై నిపుణుల సూచనలివీ...


ప్రజా భవిష్యనిధి (పీపీఎఫ్‌) వడ్డీ రేటు క్రమంగా తగ్గిపోతోంది. తాజా త్రైమాసికానికి గాను 7.9 శాతం వడ్డీ రేటును కేంద్రం ఖరారు చేసింది. ఈ పథకంలో గడిచిన 40 ఏళ్ల కాలంలోనే అత్యంత తక్కువ వడ్డీ రేటు ఇది. భవిష్యత్తులో చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లు మరికొంత తగ్గే అవకాశాలున్నాయన్న విశ్లేషణలూ వినిపిస్తున్నాయ్‌. ఈ నేపథ్యంలో చాలామంది పీపీఎఫ్‌ వద్దనుకుని, ప్రత్యామ్నాయాల వైపు అడుగులు వేస్తున్నారు కూడా? కొందరైతే పీపీఎఫ్‌లో పెట్టుబడుల నుంచి వైదొలగాలని భావిస్తున్నారు. కాకపోతే నిపుణులు మాత్రం వడ్డీ రేటు తగ్గినా ఇతర సంప్రదాయ డిపాజిట్‌ పథకాలతో పోలిస్తే ఇప్పటికీ పీపీఎఫ్‌ ఆకర్షణీయమేనంటున్నారు. అదెలాగో చూద్దాం.

పీపీఎఫ్‌లో ఉన్న ప్రధాన ఆకర్షణీయత దానిపై పెట్టే పెట్టుబడులకు, దానిద్వారా వచ్చే రాబడులకూ ఆదాయపన్ను మినహాయింపు ఉండడం. ఒకవైపు పన్ను మినహాయింపులు, మరోవైపు చెప్పుకోతగ్గ వడ్డీ రేటును అందించే సంపద్రాయ హామీతో కూడిన పథకాలు పీపీఎఫ్‌ తప్ప మరొకటి లేదు. పైగా ద్రవ్యోల్బణం రేటు 3.65 శాతం మినహాయించి చూసుకున్నా పీపీఎఫ్‌పై వచ్చే రాబడి రేటు 4.25 శాతంగా ఉంది. హామీతో కూడిన రాబడి, పన్ను మినహాయింపులు, ద్రవ్యోల్బణ తరుగుదల అన్నీ పోను ఈ మాత్రం రాబడులు అన్నవి చక్కనివేనన్నది నిపుణుల మాట. బాండ్లను చూసుకుంటే పదేళ్ల బాండ్ల రాబడి బెంచ్‌ మార్క్‌ ప్రకారం ప్రస్తుతం 6.8 శాతంగా ఉంది. కానీ, పీపీఎఫ్‌పై రాబడి 7.9 శాతం. కనుక రిస్క్‌ వద్దనుకునేవారికి దీర్ఘకాలంలో ఇన్వెస్ట్‌మెంట్‌కు ఇది చక్కని సాధనమన్నది నిపుణుల సూచన.

బ్యాంకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు
బ్యాంకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై కూడా రిస్కు లేకుండా కచ్చితమైన రాబడులు వస్తాయి. కానీ వడ్డీ రేటు మాత్రం 6.5–7.5 శాతంగానే ఉంది. పైగా ఈ వడ్డీ రా>బడిపై ఆదాయపన్ను పడుతుంది. ఉదాహరణకు 30 శాతం పన్ను చెల్లించే వారికి పన్ను పోను మిగిలే రాబడి 4.55–5.25 శాతంగానే ఉంటుంది. ద్రవ్యోల్బణ ప్రభావంతో ముడిపెట్టి చూస్తే మిగిలేది ఏముంది గనక!!. ఇక ప్రభుత్వ రంగ కంపెనీలు జారీ చేసే పన్ను రహిత బాండ్లు కూడా పీపీఎఫ్‌తో పోటీ పడలేవు. ఎందుకంటే వీటిపై రాబడులు 6.25 శాతంగానే ఉన్నాయి.

సుకన్య సమృద్ధి యోజన
ఈ పథకంలో వడ్డీ రేటు 2017–18 సంవత్సరానికి 8.4 శాతంగా ఉంది. కుమార్తె కలిగిన వారు వారి పేరిట పెట్టుబడులకు ఉద్దేశించిన పథకం ఇది. కాకపోతే దీన్లో పదేళ్ల వయసులోపు కుమార్తెలు ఉన్నవారు మాత్రమే పెట్టుబడి పెట్టగలరు. అలాంటి వారు తమ పిల్లలకోసం దీర్ఘకాలిక నిధి సమకూర్చుకోవాలనుకుంటే ఇది అనువైనదే. ప్రస్తుత రేటు ప్రకారం పీపీఎఫ్‌కు మించి రాబడులను ఇచ్చే పథకమిది. పైగా పీపీఎఫ్‌ మాదిరిగానే ఈ పథకంలో కూడా రాబడులకు పన్ను వర్తించదు. కాకపోతే ఇందులో పెట్టుబడులను ప్రారంబిస్తే కుమార్తెకు 18 ఏళ్లు వచ్చే వరకు వాటిని వెనక్కి తీసుకునేందుకు వీలుండదు. పైగా ఏడాదిలో గరిష్టంగా రూ.1.5 లక్షల వరకే పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉంది.

వాలంటరీ ప్రావిడెంట్‌ ఫండ్‌ (వీపీఎఫ్‌)
ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్‌) పథకం పరిధిలో ఉన్న వేతన జీవులకు అందుబాటులో ఉన్న పథకం ఇది. ఉద్యోగుల మూల వేతనం నుంచి నిర్ణీత శాతం నెలనెలా ఈపీఎఫ్‌కు జమ చేయడం జరుగుతుంది. దీనికి అదనంగా స్వచ్ఛందంగా పెట్టుబడులు పెట్టుకునేందుకు వీపీఎఫ్‌ వీలు కల్పిస్తుంది. దీనిపైనా ఈపీఎఫ్‌కు అమలవుతున్న 8.65 శాతం వడ్డీ రేటే వర్తిస్తుంది.

కనుక పీపీఎఫ్‌ కంటే ఇదే ప్రయోజనం. వేతన జీవులు నిస్సందేహంగా పీపీఎఫ్‌ కంటే ఇందులో ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు. పీపీఎఫ్‌ వడ్డీ రేటు ఇకముందూ తగ్గుతుందని, ఉద్యోగులకిచ్చే ఈపీఎఫ్‌ రేటు ఆ స్థాయిలో తగ్గే అవకా>శం లేదన్నది నిపుణుల అభిప్రాయం. కాకపోతే ఈపీఎఫ్‌ లేదా వీపీఎఫ్‌ నిధుల్లో 10 శాతం మేర స్టాక్‌ మార్కెట్లో పెట్టుబడి పెడుతున్నందున మార్కెట్లు పతనం చెందితే రాబడులు తగ్గే అవకాశం లేకపోలేదు.  

షార్ట్‌టర్మ్‌ డెట్‌ ఫండ్స్‌
గత ఏడాదిగా షార్ట్‌ టర్మ్‌ డెట్‌ ఫండ్స్‌లో రాబడులు సగటున 8.8%గా ఉన్నాయి. కాకపోతే రాబడులపై 20% పన్ను రేటు అమలవుతుంది. ఆ ప్రకారం చూసుకుంటే రాబడి పీపీఎఫ్‌ కంటే తక్కువేనని అర్థమవుతోంది. మూడేళ్ల పాటు పెట్టుబడులు కొనసాగిస్తే రాబడిలో ద్రవ్యోల్బణ ప్రభావం మినహాయించుకునేందుకు అవకాశం ఉంది. అంటే ఆ మేరకు పన్ను పోటు తగ్గుతుంది. వార్షికంగా ఎంతైనా పెట్టుబడి పెట్టుకోవచ్చు. వీటిలో రాబడులకు పీపీఎఫ్‌ మాదిరిగా హామీ ఉండదు.

ఆర్బిట్రేజ్‌ ఫండ్స్‌
ఈ ఫండ్స్‌ ఈక్విటీలు, డెరివేటివ్‌లలో పెట్టుబడులు పెడతాయి. గత ఏడాది కాలంలో సగటు రాబడులు 7.7%గా ఉన్నాయి. ఏడాది పాటు  పెట్టుబడులను కొనసాగిస్తే రాబడిపై పన్ను ఉండ దు. ఏడాదికి మించి పెట్టుబడులు కొనసాగించే వారికి ఇది అనువైన సాధనంగానే కనిపిస్తోంది. కానీ, రాబడుల్లో హెచ్చు, తగ్గులు ఉండొచ్చు.

మంత్లీ ఇన్‌కమ్‌ ప్లాన్స్‌ (ఎంఐపీ)
ఫండ్స్‌ నిర్వహించే ప్లాన్లు ఇవి. కొంచెం రిస్క్‌ తీసుకునే ఇన్వెస్టర్లకు ఇవి చక్కని రాబడులను ఇస్తాయి. గత మూడేళ్ల సగటు రాబడులు 11%పైనే ఉన్నాయి. ఈ పథకం కింద మొత్తం నిధుల్లో 15 నుంచి 20 % నిధులను ఈక్విటీల్లో, మిగిలిన నిధులను డెట్‌ మార్కెట్లో ఇన్వెస్ట్‌ చేయడం జరుగుతుంది. ఈక్విటీల్లో పెట్టుబడులు అంటే ఆటుపోట్లు ఉంటాయి. కనుక ఎంఐపీ వార్షిక రాబడులు గత 15 ఏళ్ల కాలంలో 10% నుంచి 20% మధ్య ఉన్నాయి. ద్రవ్యోల్బణాన్ని మించి మెరుగైన రాబడులు ఆశించేవారు, స్వల్ప రిస్క్‌ భరించే వారు వీటిలో పెట్టుబడుల ద్వారా మంచి రాబడులను అందుకోవచ్చన్నది నిపుణుల మాట. కాకపోతే ఈ రాబడులకు ఎటువంటి హామీ ఉండదనేది గుర్తుంచుకోవాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement