దూరదర్శన్ న్యూస్ను స్వాధీనం చేసుకుంటుందా?
న్యూఢిల్లీ: ప్రభుత్వ పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లడం, ప్రజలతో ప్రత్యక్ష సంబంధాల కోసమంటూ ఇప్పటికే జాతీయ అధికారిక మీడియాను క్రియాశీలకంగా వాడుకుంటున్న మోదీ ప్రభుత్వం వాటిపై మరింత పట్టు బిగించబోతోందా.. తాజా పరిణామం చూస్తోంటే ఈ అనుమానం రాకమానదు. 'మన్ కీ బాత్' పేరిట ఆకాశవాణిని తనదైన శైలిలో ఉపయోగించుకుంటున్న మోదీ ఇప్పుడు మరో అడుగు ముందుకేశారు.
పబ్లిక్ సర్వీస్ బ్రాడకాస్టర్ దూరదర్శన్ (జాతీయ ప్రజా ప్రసారకర్త) న్యూస్ను ప్రభుత్వం.. స్వాధీనం (టేక్ ఓవర్) చేసుకున్నట్లు తెలుస్తోంది. దూరదర్శన్ డైరెక్టర్ జనరల్గా ఉన్న అక్షయ్ రౌత్ స్థానంలో వీణా జైన్ని నియమిస్తూ శుక్రవారం కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రసార మంత్రిత్వ శాఖలో ఇన్ఫర్మేషన్ సర్వీస్ ఆఫీసర్గా ఉన్న జైన్, రెండు బాధ్యతలను ఉమ్మడిగా నిర్వహిస్తారని తెలిపింది. దూరదర్శన్ ఛానల్కు క్రమేపీ తగ్గుతున్న ప్రేక్షకాదరణ, క్షీణిస్తున్న ఆదాయం నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
ప్రభుత్వం అకస్మాత్తుగా ప్రకటించిన ఈ నిర్ణయంపై సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తమవుతోంది . స్వయం ప్రతిపత్తి కలిగిన దూరదర్శన్పై పెత్తనం చెలాయించేందుకు, వార్తా ప్రసారాలను తమ నియంత్రణలో ఉంచుకునేందుకే కేంద్ర ప్రభుత్వం ఈ చర్యకు పూనుకుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పైగా దూరదర్శన్లోని అన్ని మీడియా విభాగాల హెడ్లకు జైన్ నియామకానికి సంబంధించిన సమాచారాన్ని అందించి, ప్రసార భారతి సీఈఓ, ప్రసార భారతి బోర్డ్ ఛైర్మన్ను విస్మరించడం విమర్శలకు తావిస్తోంది.
కాగా జాతీయ అధికార ఛానల్ అయిన దూరదర్శన్ కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ పరిధిలో ఉంది. స్వతంత్య ప్రతిపత్తిని కలిగి ఉంది. అయితే ఆర్‌ఎస్‌ఎస్ 89వ వ్యవస్థాపక దినం సందర్భంగా, దసరా సందర్భంగా అక్టోబర్ 3న దూరదర్శన్ ఛానల్లో భాగవత్ ప్రసంగం ప్రత్యక్ష ప్రసారం చేయడాన్ని కాంగ్రెస్, లెప్ట్ పార్టీలు తీవ్రంగా తప్పుబట్టాయి. హిందూత్వ సిద్ధాంతాలను ప్రచారం చేయడానికి దూరదర్శన్ ఛానల్ను వాడుకున్నారని విమర్శించాయి. ఈ క్రమంలో డీడీ ద్వారా ఓ వెబ్ పోర్టల్‌ను ఏర్పాటు చేయాల్సిందిగా ప్రసార భారతిని ఆదేశించినట్టు వార్తలొచ్చాయి. లోక్సభ ఎన్నికల సందర్భంగా తన ప్రసంగ పాఠాన్ని కట్ చేశారని ఆరోపిస్తూ జాతీయ టీవీ(డీడీ) ప్రొఫెషనల్ ఫ్రీడమ్ పాటించడం లేదని విచారం వ్యక్తం చేస్తూ మోదీ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.