
శ్రీనగర్: ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూకశ్మీర్‌కు సంబంధించి కేంద్రం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. జమ్ముకశ్మీర్‌లో నివాసితుల ఉద్యోగ అర్హతకు సంబంధించి సరికొత్త నిబంధనలతో కూడిన మార్గదర్శకాలు జారీచేసింది. దీని ప్రకారం జమ్ముకశ్మీర్‌లో 15 ఏళ్లుగా నివసిస్తన్నవారు లేదా ఒకటి నుంచి ఏడవ తరగతి చదివి, పది లేదా పన్నెండో తరగతి బోర్డ్ ఎగ్జామ్స్‌కి హాజరైన వారిని మాత్రమే అక్కడి స్థిర నివాసులుగా గుర్తించనున్నారు. తాజా చట్టం ప్రకారం గ్రేడ్-4 వరకు ఉన్న ఉద్యోగాలు జమ్ముకాశ్మీర్ స్థిరనివాసితులకే వర్తించున్నాయి.
కేంద్రం విడుదల చేసిన ఈ మార్గదర్శకాలపై నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఒమర్ అబ్దల్లా ఘాటుగా స్పందించారు. కరోనా వ్యాప్తిని అరికట్టడానికి దేశం మొత్తం లాక్‌డౌన్‌లో ఉన్న సమయంలో కేంద్రం తీసుకున్న ఈ నిర్లయాన్ని ఖండిస్తున్నట్టు చెప్పారు. ఇది తమ భద్రతకు భంగం కలిగించేలా ఉందని అన్నారు. ఇప్పటికే ఆర్టికల్ 370 రద్దు చేసిన గాయం మానకముందే.. మరో గాయం చేస్తున్నారంటూ విమర్శించారు.