
న్యూఢిల్లీ: వినియోగదారుల హక్కుల పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనలపై కఠినంగా వ్యవహరించేలా త్వరలోనే కొత్త వినియోగదారుల చట్టం తీసుకొస్తున్నట్లు తెలిపారు. ‘వినియోగదారుల హక్కులను కాపాడటం మాత్రమే కాదు. ద్రవ్యోల్బణాన్ని తగ్గించటం, వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా పేదలు, మధ్యతరగతి ప్రజలు కొనుగోళ్లపై డబ్బులను ఆదాచేసుకోవటం ముఖ్యమే’ అని గురువారం ఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ వినియోగదారుల వ్యవహారాల సదస్సులో మోదీఅన్నారు. ‘వినియోగదారులకు మరింత మేలు చేసేలా కొత్త చట్టాన్ని తీసుకొచ్చే పనిలో ఉన్నాం. వ్యాపార పద్ధతులు, దేశ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ చట్టాన్ని రూపొందిస్తున్నాం. ఇది వినియోగదారుల సాధికారతను మరింత పెంచేలా ఉంటుంది’ అని మోదీ వెల్లడించారు.
ఎల్‌ఈడీ బల్బులు, స్టెంట్లు, మందులు..
తమ ప్రభుత్వ చర్యల వల్ల స్టెంట్ల రేట్లు, మోకాలిచిప్పల ఆపరేషన్లు సామాన్యుడికి అందుబాటులోకి వచ్చాయని గుర్తుచేశారు. ‘ఉజాలా పథకం ద్వారా రూ.350 ఉన్న ఎల్‌ఈడీ బల్బును రూ.40–45కే ప్రజలందరికీ అందుబాటులోకి తెచ్చాం. దీని ద్వారా రూ.20వేల కోట్ల మేర విద్యుత్ బిల్లులు ఆదా అయ్యాయి’ అని పేర్కొన్నారు. జన ఔషధి పరియోజనలో భాగంగా దాదాపు 500 మందుల ధరలను భారీగా తగ్గించిన విషయాన్ని గుర్తుచేశారు. ‘పలు రాష్ట్ర, కేంద్ర పన్నుల ఒత్తిడిని ప్రజలపై తగ్గించేందుకు జీఎస్టీని తీసుకొచ్చాం. దీని ద్వారా దేశంలో కొత్త వ్యాపార సంస్కృతి అభివృద్ధి అవుతోంది. ఇది దీర్ఘకాలంలో లబ్ధిదారులకు భారీ మేలు చేకూర్చనుంది. జీఎస్టీతో కంపెనీల మధ్య పోటీ పెరిగి వినియోగదారునికి తక్కువ ధరకే వస్తువులు అందుబాటులోకి వస్తాయి. ఇది పేదలు, మధ్యతరగతి కుటుంబాలకు మేలు చేస్తుంది’ అని మోదీ వెల్లడించారు.
పాలనపై అధ్యయనం చేయండి
ముస్సోరి(ఉత్తరాఖండ్): ప్రభుత్వ పాలనలో ఎదురవుతున్న సమస్యలపై లోతైన అధ్యయనం చేయాలని, అప్పుడే వాటిని పూర్తిగా అర్థం చేసుకుంటారని ట్రైనీ ఐఏఎస్ అధికారులకు మోదీ సూచించారు. లాల్‌బహదూర్ శాస్త్రి జాతీయ పరిపాలనా అకాడమీలో 360 మంది యువ అధికారులతో సమావేశమయ్యారు. ప్రభుత్వ పాలన, సాంకేతికత వినియోగం, విధానాల రూపకల్పన తదితర అంశాలు ప్రస్తావనకొచ్చినట్లు పీఎంఓ ఓ ప్రకటనలో తెలిపింది.
లీకేజీని అరికట్టాం
గత ప్రభుత్వ హయాంలో ద్రవ్యోల్బణం కారణంగా రేట్లు పెరిగిపోయాయని.. దీంతో సామాన్యుడి వంటింటి బడ్జెట్ విపరీతంగా పెరిగిపోయిందని మోదీ విమర్శించారు. ప్రత్యక్ష నగదు బదిలీ పద్ధతిలో నేరుగా లబ్ధిదారుడి ఖాతాలోకే డబ్బులు చేరటం ద్వారా ప్రభుత్వానికి రూ.57వేల కోట్ల రూపాయల లీకేజీని ఆపగలిగామన్నారు.రెరా (రియల్ ఎస్టేట్ నియంత్రణ చట్టం) సొంతిల్లు కావాలనుకునే వినియోగదారుడికి ఓ వరమన్నారు. జీఎస్టీ, రియల్ ఎస్టేట్ బిల్లు, బీఐఎస్ చట్టాలు, ఉజాలా, ఉజ్వల, ప్రత్యక్ష నగదు బదిలీ పథకం ద్వారా వినియోగదారులు తమ డబ్బులను ఆదా చేసుకునేలా కేంద్రం తన వంతు ప్రయత్నాలు చేస్తోందన్నారు. ప్రపంచమంతా ఒకే మార్కెట్‌గా మారుతున్న నేపథ్యంలో వినియోగదారుని హక్కుల భద్రతకు ప్రాంతీయ సంకీర్ణం ఏర్పాటు అవసరమ న్నారు. ఇందుకోసం ప్రతిదేశంలో బలమైన నియంత్రణ, సమాచార మార్పిడి వ్యవస్థ అవసరమని మోదీ సూచించారు.