ఢిల్లీ ప్రభుత్వంపై మండిపడిన కోర్టు
Published Thu, Dec 3 2015 12:09 PM | Last Updated on Mon, Oct 22 2018 2:14 PM
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో రోజురోజుకూ పెరుగుతున్న వాతావరణ కాలుష్యంపై నేషనల్ గ్రీన్ కోర్టు మండిపడింది. వాయు కాలుష్యం ఇంత తీవ్రస్థాయిలో ఉన్నాఎందుకు చర్యలు చేపట్టడం లేదంటూ ఢిల్లీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తంచేసింది. విషవాయువులు వెదజల్లుతున్న కాలుష్యంపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తక్షణమే నివేదిక సమర్పించాలని ఆదేశించింది. నగరంలో కాలుష్య తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి, వారం రోజుల్లోగా నిరోధక చర్యలు చేపట్టాలని ఆదేశించింది. ఇటీవల నగరాన్ని కప్పేస్తున్న కాలుష్యంతో వాహనదారులు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కనీసం వంద అడుగుల ముందు ఏముందో కూడా కనపడని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కోర్టు సీరియస్‌గా స్పందించింది.
డీజిల్, పెట్రోల్‌తో నడిచే కాలం చెల్లిన వాహనాలు దేశ రాజధాని ఢిల్లీ నగర రోడ్లపై తిరగడానికి వీల్లేదని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ స్పష్టమైన ఆదేశాలు జారీచేసినా ప్రభుత్వాలు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ప్రశ్నించింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ) ఛైర్ పర్సన్ జస్టిస్ స్వతంత్ర కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. నగరంలోని వాయు కాలుష్య నివారణ చర్యల మాటేంటి? కాలుష్యం లేదని చెప్పగలరా.. ఢిల్లీలో కాలుష్య గాఢతతో జనం ఇబ్బందులు పడుతున్నారంటూ ధ్వజమెత్తింది. పర్యావరణాన్ని తీవ్ర విఘాతం కలిగిస్తున్న ఈ వ్యవహారాన్ని ఉపేక్షించబోమని పేర్కొంది.
ఈ నేపథ్యంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అధ్యక్షుడు, జస్టిస్ స్వతంత్ర కుమార్ ఆధ్వర్యంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో గురువారం అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పర్యావరణ, అటవీశాఖ, ఆరోగ్య శాఖ, ఢిల్లీ కాలుష్య నియంత్రణ మండలి తదితర శాఖల ముఖ్య కార్యదర్శులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. దీంతోపాటు వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని వాయునాణ్యత, కాలుష్యం, వాతావరణ కాలుష్య నివారణ చర్యలు, తదితర వివరాలతో పూర్తి స్థాయి నివేదిక సమర్పించాలని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డును ఆదేశించింది.
Advertisement