గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష మళ్లీ నిర్వహించాలి
► 2011 నాటి నోటిఫికేషన్‌పై సుప్రీంకోర్టు తీర్పు
► ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో వేర్వేరుగా పరీక్ష
► తెలంగాణలో పాత సిలబస్‌తోనే పరీక్ష
►3 నెలల్లో ప్రక్రియ పూర్తి కావాలన్న ధర్మాసనం
సాక్షి, న్యూఢిల్లీ: గ్రూప్-1 (2011 నోటిఫికేషన్) మెయిన్స్ పరీక్ష మళ్లీ నిర్వహించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అప్పటి నోటిఫికేషన్‌లో ఉన్న సిలబస్ ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు వేర్వేరుగా పరీక్షలు నిర్వహించాలని తెలి పింది. జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జస్టిస్ అభయ్ మనోహర్ సప్రేతో కూడిన ధర్మాసనం ఈ మేరకు బుధవారం తీర్పు వెలువరిం చింది. 2011లో జారీ చేసిన నోటిఫికేషన్ మేరకు నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షల్లో ఉత్తీర్ణులైన 606 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరయ్యారు. అయితే ప్రిలిమ్స్ ప్రశ్నపత్రంలో తప్పులు దొర్లిన కారణంగా కొందరు అభ్యర్థులు మెయిన్స్‌కు అర్హత కోల్పోయారనే వివాదం.. చివరకు సుప్రీంకోర్టుకు చేరడంతో మెయిన్స్ మళ్లీ నిర్వహించాలని 2013లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.
కానీ రాష్ట్ర విభజన, ఇతర అంశాల నేపథ్యంలో ఈ తీర్పును అమలుపరచడంలో జాప్యం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో పలువురు అభ్యర్థులు 2015లో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చే శారు. దీనిపై గత కొంతకాలంగా విచారణ జరుగుతోంది. తాజాగా బుధవారం ఈ పిటిషన్ విచారణకు రాగా ఏపీపీఎస్సీ తరఫున సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే తన వాదన వినిపించారు. మెయిన్స్ మళ్లీ నిర్వహించేందుకు తమకు అభ్యంతరం లేదని, తెలంగాణ రాష్ట్రం వరకు తెలంగాణ నిర్వహించుకుంటే సరిపోతుందని చెప్పారు. మీ వైఖరేంటని ధర్మాసనం తెలంగాణను ప్రశ్నించగా.. టీఎస్‌పీఎస్‌సీ తరఫున హాజరైన తెలంగాణ అదనపు అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు.. పరీక్ష నిర్వహణకు తాము కూడా సిద్ధమేనని పేర్కొన్నారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది వీవీఎస్ రావు మాత్రం పరీక్ష ఉమ్మడిగా జరగాలని, తెలంగాణలో సిలబస్ మారినందున వేర్వేరుగా నిర్వహిస్తే ఇబ్బందులు తలెత్తుతాయని విన్నవించారు.
అన్నిపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. రెండు రాష్ట్రాల్లో రెండు వేర్వేరు పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. తెలంగాణలో కూడా 2011 నాటి నోటిఫికేషన్‌లో పేర్కొన్న సిలబస్ ఆధారంగానే నిర్వహించవచ్చని తెలిపింది. ఈ ప్రక్రియ అంతా మూడు నెలల్లో పూర్తికావాలని స్పష్టం చేసింది. ఇలావుండగా ఇంటర్వ్యూకు హాజరై ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు పరీక్ష తిరిగి నిర్వహించవద్దని, ఫలితాలు ప్రకటించాలని కోరుతూ ఒక మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు. 606 మంది అభ్యర్థులు ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారని, తమకు న్యాయం చేయాలని విన్నవించారు. తమను పరీక్ష నుంచి మినహాయించాలని విన్నవించారు. అయితే ధర్మాసనం.. తాము న్యాయపరమైన అంశాలను పరిశీలించి మాత్రమే ఉత్తర్వులు జారీ చేస్తున్నామని, వ్యక్తిగత కోణంలో చూడడం లేదని పేర్కొంది.