తప్పులుచేస్తూ పోవడంలో తన రికార్డులను తానే తిరగరాసుకునే రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నిర్వాకంవల్ల రెండేళ్లక్రితం నిర్వహించిన గ్రూప్-1 పరీక్ష వ్యవహారం మొదటికొచ్చింది. 2011లో మొదలుపెట్టి కొనసాగించిన ఈ ప్రక్రియ సరిగా లేదని అభిప్రాయపడి తిరిగి మెయిన్స్ పరీక్ష, అందులో ఉత్తీర్ణులైన వారికి ఇంటర్వ్యూ నిర్వహించాలని సోమవారం సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పునిచ్చింది. అన్నీ పూర్తయి పోస్టింగ్‌లకోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులందరికీ ఇది నిరాశకలిగించేదే అయినా ఏపీపీఎస్సీ నిర్వాకంవల్ల సర్వోన్నత న్యాయస్థానం ఈ నిర్ణయానికి రాకతప్పలేదు. నిరుడు మే 27న నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్షకు లక్షన్నరమంది అభ్యర్థులు హాజరయ్యారు. ఆ పరీక్షకోసం ఇచ్చిన ప్రశ్నపత్రం కీలో 13 ప్రశ్నలకిచ్చిన సమాధానాలు సరిగా లేవని అభ్యర్థులు అప్పట్లోనే గుర్తించి వాటిని ఏపీపీఎస్సీ దృష్టికి తీసుకొచ్చారు. అయితే, అందులో ఏడింటిని మాత్రమే తొలగించి, మిగిలిన ఆరూ సరైనవేనని సంస్థ నిర్ధారణకొచ్చింది. వీటిని కూడా తొలగించాకే ప్రిలిమ్స్ ఉత్తీర్ణతను నిర్ధారించాలన్న అభ్యర్థుల డిమాండ్‌ను పెడచెవిన పెట్టింది. దాంతో కొందరు రాష్ట్ర అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. అటుతర్వాత హైకోర్టుకు వెళ్లారు. ఇరుపక్షాల వాదనలనూ విని పరిష్కారం కనుగొనాలని రాష్ట్ర హైకోర్టు యూపీఎస్సీని ఆదేశిస్తూ ఇచ్చిన ఆదేశాలను ఏపీపీఎస్సీ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈలోగా మెయిన్స్‌ను నిర్వహించడంతోపాటు అందులో ఉత్తీర్ణత సాధించినవారికి ఇంటర్వ్యూలు కూడా పూర్తిచేసింది.
ప్రిలిమ్స్‌లో వచ్చిన తప్పులగురించి చెప్పినప్పుడే ఏపీపీఎస్సీ ప్రతిష్టకు పోకుండా వాటిని తొలగించి ఉంటే నిరుద్యోగులకు ఈ అవస్థ వచ్చేది కాదు. మీరు నిర్వహించిన పరీక్ష లోపభూయిష్టంగా ఉన్నదని అభ్యర్థులు చెప్పిన ప్రతిసారీ సంస్థ నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తోంది. ఇప్పుడు తొలగించడానికి ససేమిరా ఇష్టపడని ఆరు ప్రశ్నలనూ చూస్తే దాని అజ్ఞానం ఏస్థాయిలో ఉన్నదో అర్ధమవుతుంది. ఇది కేవలం గ్రూప్-1 పరీక్షలకు పరిమితమైనదే కాదు. అన్ని పరీక్షల నిర్వహణా ఇలాగే ఉంటోంది. చెప్పిన మాట వినకపోవడం, కోర్టుల్లో కేసులు పడినప్పుడు వాటిని ఎలాగైనా గెలవాలనుకోవడం తప్ప... తనవైపు జరిగిందేమిటో సమీక్షించుకోక పోవడం ఏపీపీఎస్సీకి అలవాటైపోయింది. అది ఏ పరీక్ష అనేదానితో నిమిత్తంలేదు. తప్పులు తప్పనిసరిగా రావాల్సిందే. 8 నెలలక్రితం పాలిటెక్నిక్ లెక్చెరర్ల పరీక్షకు ఇచ్చిన ప్రశ్న పత్రంలో ఒక గైడ్‌లోని ప్రశ్నలను యధాతథంగా వరసక్రమం కూడా మార్చకుండా దించిన వైనాన్ని ‘సాక్షి’ అప్పట్లో బయటపెట్టింది. జూనియర్ అకౌంటెంట్ గ్రేడ్-4 పోస్టుల భర్తీకి జరిపే పరీక్షలు, మునిసిపల్ అకౌంట్స్ విభాగంలో అకౌంట్స్ అధికారి రాత పరీక్షలు...ఏవైనా ఒకటే రకం ప్రశ్నలివ్వడం, కీలు మాత్రం వేర్వేరుగా నిర్ణయించి జవాబుపత్రాలను దిద్దడం రివాజైపోయింది. ఒక పరీక్షకైతే అసలు కీయే విడుదలచేయకపోవడంతో అనుమానంవచ్చిన అభ్యర్థులు ఆర్టీఐ ద్వారా దాన్ని సంపాదించారు. తీరాచూస్తే అందులోని 80శాతం జవాబులు పూర్తిగా తప్పుల తడకలేనని వెల్లడైంది. తెలుగు మీడియంలో రాసే విద్యార్థులకు వీటితోపాటు అదనపు ఇక్కట్లు తప్పడంలేదు. ఇంగ్లిష్‌లో అడిగే ప్రశ్నలకు తెలుగు అనువాదం దోషభూయిష్టంగా ఉండటం, తీరా దానినిబట్టి జవాబురాస్తే మార్కులు తెగ్గోయడం మామూలైపోయింది.
బంగారు భవిష్యత్తును ఆశించి, జీవితంలో స్థిరపడదామని భావించి ప్రవేశపరీక్షల్లో ఎంపిక కావడంకోసం లక్షలమంది నిరుద్యోగులు అప్పో సప్పోచేసి నగరాలకు వస్తున్నారు. వారంతా ఏదో శిక్షణా సంస్థకు వేలాది రూపాయలు చెల్లించి రాత్రింబగళ్లు చదువుకుంటున్నారు. అలాంటివారందరినీ తన చర్యలతో ఏపీపీఎస్సీ దగా చేస్తున్నది. ఎప్పుడైనా తప్పులు దొర్లితే మానవసహజమని భావించి ఊరుకోవచ్చు. కనీసం చేసిన తప్పులు చేయకుండా ఉంటే తగిన స్థాయిలో పర్యవేక్షణ ఉంటున్నది... ఇకపై జాగ్రత్తలు తీసుకుంటారులేనన్న భరోసాతో ఉండవచ్చు. కానీ, పదే పదే అవే తప్పులు జరుగుతుంటే, చెవినిల్లు కట్టుకొని పోరినా వినకపోతుంటే ఏమనాలి? అవతలి అభ్యర్థికంటే ఒక్క మార్కు తక్కువొస్తే అభ్యర్థికి ఉద్యోగావకాశం చేజారిపోతుంటే...ఏకంగా 13 ప్రశ్నలు తప్పుల తడకగా ఉండటం, అందులో ఏడింటిని మాత్రమే గుర్తించి సరిచేస్తామనడం ఏం న్యాయం? ఏపీపీఎస్సీ కాస్త సున్నితంగా ఆలోచించివుంటే అభ్యర్థులకు ఇన్ని ఇక్కట్లు తప్పేవి.
ఈ కేసు విషయంలో సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు ఏపీపీఎస్సీ చేసిన వాదన కూడా వింతగా ఉంది. సవాల్ చేసినవారు ఇద్దరు అభ్యర్థులే గనుక వారిద్దరికీ తాము న్యాయం చేస్తామని... మొత్తం ప్రక్రియ పూర్తయింది గనుక ఈ దశలో మళ్లీ పరీక్ష నిర్వహణకు ఆదేశించవద్దని సంస్థ కోరడం విడ్డూరం. వివాదంలోని హేతుబద్ధతను గమనించి తనను తాను సరిచేసుకోవడం ఒక పద్ధతి. కనీసం సమస్య కోర్టు ముందుకు వెళ్లినప్పుడు ఇక ఆ ప్రక్రియను అక్కడితో నిలిపి, ఆ కేసును త్వరగా తెమల్చడానికి తనవైపుగా చేయాల్సినవి చేయడం మరో పద్ధతి. కానీ, ఈ రెండింటినీ కాదని ఏమీ పట్టనట్టుగా తన పని తాను చేసుకుపోవడం ఏపీపీఎస్సీకే చెల్లింది. ఏళ్ల తరబడి నిరీక్షించగా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందామని నిరుద్యోగులు నానాకష్టాలూ పడుతుంటే ఏపీపీఎస్సీ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వోద్యోగాలకు అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేయడం కోసం దశాబ్దాలుగా పరీక్షలు, ఇంటర్వ్యూలూ నిర్వహించే ఏపీపీఎస్సీ... ప్రతిసారీ అనుభవలేమినే ప్రదర్శిస్తోంది. ఎంతో పారదర్శకంగా, కర్తవ్య నిష్టతో, బాధ్యతగా నిర్వర్తించాల్సిన పనిని యాంత్రికంగా, యధాలాపంగా చేస్తున్నామని... దానివల్ల లక్షల మంది అన్యాయమైపోతున్నారని ఏపీపీఎస్సీ ఇకనైనా గుర్తించాలి. తన లోపాలను గుర్తెరిగి సరిచేసుకోవాలి.