నిత్యావసరాలు మరింత చవక
పన్ను రేట్లు ఖరారు చేసిన జీఎస్టీ మండలి
► 81 శాతం వస్తువులు 18.. అంతకంటే తక్కువ పన్ను శ్లాబుల్లోనే
► పన్ను పరిధి నుంచి ఆహార ధాన్యాల మినహాయింపు.. వ్యాట్ తొలగింపు
శ్రీనగర్/న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) అమలులో భాగంగా మరో కీలక అడుగు పడింది. వివిధ వస్తువుల్ని 5, 12, 18, 28 పన్ను శ్లాబుల్లోకి చేరుస్తూ జీఎస్టీ మండలి గురువారం నిర్ణయం తీసుకుంది. ఆరు మినహా మొత్తం 1211 వస్తువులపై పన్ను రేట్లను జీఎస్టీ మండలి ఆమోదించింది. కొత్త పన్ను రేట్లతో ఆహారధాన్యాలు, రోజువారీ వినియోగ వస్తువులైన కొబ్బరినూనె, సబ్బులు, టూత్‌పేస్టులతో పాటు విద్యుత్ చార్జీలు తగ్గుముఖం పడతాయి. అయితే విలాసవంతమైన కార్ల ధరలు మరింత ప్రియం కానున్నాయి.
కార్లను 28 శాతం శ్లాబులో చేర్చగా.. వాటిపై ఒక శాతం నుంచి 15 శాతం వరకూ అదనపు సెస్సు వసూలు చేయనున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలో శ్రీనగర్‌లో జరుగుతున్న రెండ్రోజుల జీఎస్టీ మండలి సమావేశంలో భాగంగా మొదటి రోజు మొత్తం 1205 వస్తువులపై నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం బీడీలు, బంగారం, టెక్స్‌టైల్స్, బయోడీజిల్, పాదరక్షలు, బ్రాండెడ్ ఆహార పదార్థాలతో పాటు సేవలపై పన్ను రేట్లను నిర్ధారిస్తారు. జూలై1 నుంచి జీఎస్టీని అమల్లోకి తీసుకురావడానికి కేంద్రం ప్రయత్నిస్తోంది.
పంచదార, టీ, కాఫీ, వంట నూనెలపై మార్పులేదు
ప్రస్తుతం కొబ్బరినూనె, సబ్బులు, టూత్ పేస్టులపై 22 నుంచి 24 శాతం పన్ను వసూలు చేస్తుండగా వాటిని 18 శాతం శ్లాబులో చేర్చారు. బొగ్గుపై ప్రస్తుతం వసూలు చేస్తోన్న 11.69 శాతం పన్నుకు బదులు జీఎస్టీ అమల్లోకి వస్తే 5 శాతమే వసూలు చేస్తారు. దీంతో విద్యుత్ ఉత్పత్తి చవకై వినియోగదారులకు లబ్ధి చేకూరనుంది. ప్రాణాల్ని కాపాడే మందుల్ని 5 శాతం పరిధిలో.. కేపిటల్ గూడ్స్(ఇతర వస్తువుల తయారీకి వాడే యంత్రాలు, భవనాలు వంటివి) ఇండస్ట్రియల్ ఇంటర్మీడియరీస్‌లను 18% పరిధిలో చేర్చారు.
ప్రస్తుతం వీటిపై 28% పన్ను వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్నట్లే పాలు, పెరుగుపై ఎలాంటి పన్ను ఉండదు. స్వీట్లపై మాత్రం 5 శాతం జీఎస్టీ వసూలు చేస్తారు. రోజువాడే పంచదార, టీ, కాఫీ, వంట నూనెలపై 5 శాతం పన్ను యథాతథంగా కొనసాగుతుంది. గోధుమలు, వరిని పన్ను పరిధి నుంచి మినహాయించారు. ప్రస్తుతం వీటిపై కొన్ని రాష్ట్రాల్లో వసూలు చేస్తున్న వ్యాట్ కూడా రద్దయితే ధరలు మరింత తగ్గే అవకాశముంది. కన్సూ్యమర్ డ్యూరబుల్స్‌పై ప్రస్తుతం 32 శాతం పన్ను ఉండగా... వాటిని 28% శ్లాబులోకి చేర్చారు. ఏసీలు, రిఫ్రిజిరేటర్స్‌ను 28% పన్ను శ్రేణిలో చేర్చారు.
ద్రవ్యోల్బణం తలెత్తకుండా పకడ్బందీగా..: జైట్లీ
అధిక శాతం వస్తువులపై పన్ను రేట్లను నిర్ణయించామని, మినహాయింపు జాబితాను కూడా రూపొందించామని సమావేశం అనంతరం అరుణ్ జైట్లీ చెప్పారు. ‘మొత్తం ఆరింటిపై తప్ప అన్ని వస్తువులపై నిర్ణయం తీసుకున్నాం. శుక్రవారం జరిగే సమావేశంలో సేవలపై పన్ను రేట్లను నిర్ణయిస్తాం. ప్రస్తుతం 12.5 నుంచి 15 శాతం పన్ను శ్రేణిలో వస్తువులపై స్థానిక పన్నులతో కలిపి పన్ను 30–31 శాతం వసూలు చేస్తున్నారు.
వీటిని 28 శాతంలో చేర్చాం. అందరూ వాడే సబ్బులు, నూనెల్ని 18 శాతానికి తగ్గించాం. పన్ను రేట్లు ద్రవ్యోల్బణానికి దారితీయకుండా ఉండేలా అన్ని అంశాల్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకున్నాం. ధరలు తగ్గేలా చూడడం కూడా అందులో ఒకటి’ అని జైట్లీ తెలిపారు. ప్రస్తుతం 31 శాతం పన్ను వసూలు చేస్తున్న వస్తువుల్ని 28 శాతం పరిధిలోకి తెచ్చినందున ద్రవ్యోల్బణ ప్రభావం ఉండదన్నారు. జీఎస్టీ రేటుతో ఏ వస్తువుల ధరలు పెరగవని, ఎలాంటి పెంపు చేయలేదని, పైగా చాలా వస్తువులు ధరలు తగ్గుతాయని చెప్పారు.
పరిశ్రమ వర్గాల హర్షం
నిత్యావసర వస్తువుల్ని(ఎఫ్‌ఎంసీజీ) 18 శాతం పన్ను పరిధిలోకి తీసుకురావడం మంచి పరిణామమని, ధరలు తగ్గడం వల్ల వినియోగదారులు లాభపడతారని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. ఆహార వస్తువులైన వంట నూనెలు, టీ, కాఫీ, పంచదారలపై 5 శాతం పన్నుతో పరిశ్రమకు లాభదాయకమని పన్నుల విశ్లేషకుడు ప్రతీక్ జైన్ పేర్కొన్నారు.
పెరగనున్న కార్ల ధరలు
కార్లను 28 శాతం శ్లాబ్‌లో చేర్చగా... చిన్న కార్లపై అదనంగా ఒక శాతం సెస్సు, మధ్యశ్రేణి కార్లపై 3 శాతం, విలాసవంతమైన కార్లపై 15 శాతం సెస్సు వసూలు చేస్తారు. ఏరేటెడ్ డ్రింక్స్(కోకోకోలా, పెప్సీ వంటి శీతల పానీయాలు)పై 28 శాతం జీఎస్టీ అమలు చేస్తారు.
తగ్గేవి
కొబ్బరినూనె, సబ్బులు, టూత్ పేస్టు, ఆహార ధాన్యాలు(గోధుమ, వరి), కన్సూ్యమర్ డ్యూరబుల్స్(టీవీలు, లాప్‌ట్యాప్‌లు, కెమెరాలు, వాషింగ్ మిషన్లు, ఏసీలు వంటివి)
పెరిగేవి
కార్లు, ఏరేటెడ్ డ్రింక్స్