జీఎస్టీ భేటీలో కేంద్ర మంత్రులు జైట్లీ, సంతోష్ గంగ్వార్
• జీఎస్టీపై కేంద్ర, రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం
• పన్ను చెల్లింపుదారుల ఉమ్మడి నియంత్రణపై
• రాష్ట్రాల డిమాండ్‌కు అంగీకారం
న్యూఢిల్లీ: జీఎస్టీపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఎట్టకేలకు ఏకాభిప్రాయం కుదిరింది. 90 శాతం చిన్న స్థాయి పన్ను చెల్లింపుదారులపై నియంత్రణను రాష్ట్రాలకు అప్పగించేందుకు కేంద్రం అంగీకరించడంతో ఇంతకాలం కొనసాగిన ప్రతిష్టంభనకుతెరపడింది. ఇదే సమయంలో జీఎస్టీని ఏప్రిల్ 1 నుంచి కాకుండా జూలై 1 నుంచి అమలు చేయాలని మండలి నిర్ణయం తీసుకుంది. జీఎస్టీ అమలు తేదీపై సోమవారం జైట్లీ నేతృత్వంలోని మండలి సమావేశమైంది. అనంతరం ఆయన మీడియాతోమాట్లాడుతూ.. జీఎస్టీ అమలు తేదీని మూడు నెలలు వాయిదా వేసినట్లు చెప్పారు. ఐజీఎస్‌టీ చట్టం ముసాయిదాల అనుమతి తదితరాల కోసం జీఎస్టీ మండలి తదుపరి సమావేశం వచ్చే నెల 18న జరగనుందని తెలిపారు.
‘వార్షిక టర్నోవర్ రూ.1.5 కోట్ల వరకు ఉన్న సంస్థల పన్నులపై తమకే పూర్తి హక్కులు కల్పించాలని రాష్ట్రాలు కోరుతున్నాయి. దీనికి కేంద్ర ప్రభుత్వం సుముఖంగా లేనప్పటికీ.. ఆఖరికి 90 శాతం హక్కులు రాష్ట్రాలకు, 10శాతం హక్కులు కేంద్రానికి ఉండేందుకుఅంగీకరించాం. రూ. 1.5 కోట్ల కంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న పన్ను చెల్లింపుదారులపై కేంద్రం, రాష్ట్రాలు 50:50 హక్కులు కలిగి ఉంటాయి’అని జైట్లీ వివరించారు. అయితే పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలు మాత్రం జీఎస్టీతో రెవెన్యూ భారీగా కోల్పోతామనిఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
పెద్ద నోట్ల రద్దు కూడా తమ ఆదాయాలకు భారీగా గండికొట్టిందని చెబుతున్నాయి. వచ్చే ఐదేళ్లకు కేంద్ర ప్రభుత్వం చెల్లించే నష్టపరిహారాన్ని పెంచాలని బెంగాల్‌తో పాటు పలు రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయి. వార్షికటర్నోవర్ రూ. 1.5 కోట్ల వరకు ఉన్న సంస్థల పన్నులపై నూటికి నూరు శాతం తమకే అధికారం కావాలని కూడా కోరుతున్నాయి. జీఎస్టీ మండలి సమావేశంలో తమ అసమ్మతి తెలిపామని పశ్చిమ బెంగాల్ ఆర్థికశాఖ మంత్రి అమిత్ మిత్రాతెలిపారు. కేరళ ఆర్థికశాఖ మంత్రి టీఎం థామస్ ఇసాక్ కూడా ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.