కున్వర్జి బవాలియా(ఫైల్ ఫోటో)
గాంధీనగర్ : కున్వర్జి బవాలియా గుజరాత్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడు, జాస్‌దాన్ నియోజకవర్గ ఎమ్మెల్యే. కాంగ్రెస్ తరపున ఐదుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలిచారు. ఇది మంగళవారం ఉదయం నాటి పరిస్థితి. కానీ మంగళవారం మధ్యాహ్నం నాటికి కున్వర్జి బవాలియా మంత్రి. కానీ కాంగ్రెస్ తరపున కాదు బీజేపీ నుంచి. ఇది ప్రస్తుతం దేశంలో పార్టీ ఫిరాయింపుదారుల వైభోగం. గెలుపొక పార్టీది.. పదవొక పార్టీది అన్నట్లు తయారయ్యింది ప్రస్తుతం రాజకీయ నాయకుల పరిస్థితి.
బీజేపీలో చేరిన కొన్ని గంటల్లోనే బవాలియా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతేకాదు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేటప్పుడు పార్టీపై తీవ్ర విమర్శలు కూడా చేశారు. తాను కోరిన పదవి ఇవ్వకపోవడం ఆయన పార్టీ మారటానికి కారణం. సీనియర్ అయిన తనను కాదని పరేష్ ధనానికి ప్రతిపక్ష నాయకుడి పదవి ఇవ్వడంతో ఆయన కాషాయ పార్టీ కండువా కప్పుకున్నారు.
బవాలియాను చేర్చుకోవడానికి బీజేపీకి బలమైన కారణమే ఉంది. బవాలియా సౌరాష్ట్రకు చెందిన వ్యక్తి మాత్రమే కాక ఓబీసీలోని కోలీ సామాజిక వర్గానికి చెందిన బలమైన నాయకుడు కూడా. అంతేకాక ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కోలీ పటేల్ సామాజిక వర్గానికి అధ్యక్షుడిగానూ ఉన్నారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి సౌరాష్ట్రలో కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆ నష్టాన్ని భర్తీ చేసుకోవడమే కాక రానున్న 2019 సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 26 లోక్‌సభ స్థానాల్లో విజయం సాధించాలన్న వ్యూహంతో బవాలియాకు మంత్రి పదవి ఇచ్చి మరీ పార్టీలోకి ఆహ్వానం పలికినట్లు సమాచారం.
ఈ విషయం గురించి గుజరాత్ పీసీసీ ప్రెసిడెంట్ అమిత్ చవ్దా మాట్లాడుతూ.. ‘బవాలియా లాంటి నాయకుడు కాంగ్రెస్ పార్టీని వదిలి వెళ్లడం దురదృష్టకరం. ఆయన గెలిచింది కాంగ్రెస్ పార్టీ తరపున. ఆయనను కాంగ్రెస్ పార్టీ చాలా గౌరవిస్తుంది. కానీ కేవలం మంత్రి పదవి కోసమే బీజేపీలో చేరారు. ఇందుకు కాంగ్రెస్ పార్టీకే కాక సౌరాష్ట్ర ప్రజలకు కూడా బవాలియా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రి విజయ్ రూపాని మంగళవారం ఇజ్రాయేల్ పర్యటన ముగించుకుని వచ్చే సమయానికే బవాలియా బీజేపీలో చేరడం కాకతాళీయం కాదు. ఇదంతా ముందునుంచి అనుకునే అమలు చేశారు. మంత్రి పదవులను ఎరగా చూపి కాంగ్రెస్ నాయకులను బీజేపీ తనవైపు ఆకర్షిస్తుంది. కానీ ఇది ఆ పార్టీకే మంచిది కాద’ని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment