సాక్షి, గాంధీనగర్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పాలక బీజేపీకి గట్టి పోటీ ఇచ్చిన కాంగ్రెస్ సౌరాష్ట్ర కచ్ ప్రాంతంలో మెరుగైన ఫలితాలు రాబట్టింది. పటేళ్ల ఉద్యమం, రైతుల అసంతృప్తితో సౌరాష్ట్ర, కచ్ ప్రాంతంలో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇక్కడ కాంగ్రెస్ 31 సీట్లతో సత్తా చాటగా, బీజేపీ 22 సీట్లతో సరిపెట్టుకునే పరిస్థితి నెలకొంది. అయితే పట్టణ ప్రాంతాల్లో సత్తా చాటడం ద్వారా ఆ నష్టాన్ని బీజేపీ పూడ్చుకోగలిగింది.
ఉత్తర గుజరాత్‌లో బీజేపీ 31 సీట్లలో, కాంగ్రెస్ 21 సీట్లలో ఆధిక్యం కనబరిచాయి. మధ్య గుజరాత్‌లోనూ బీజేపీ తన ప్రాభవాన్ని నిలుపుకుంది. ఇక్కడ బీజేపీ 25 స్ధానాల్లో ఆధిక్యంలో ఉంటే కాంగ్రెస్ 14 స్ధానాల్లో ఆధిక్యం కనబరిచింది.
దక్షిణ గుజరాత్‌లో బీజేపీ 27 సీట్లలో స్పష్టమైన ఆధిక్యంతో దూసుకుపోతుంటే కాంగ్రెస్ కేవలం 8 స్ధానాల్లోనే మెజారిటీలో ఉంది. బీజేపీ విజయదుందుభి మోగిస్తున్న గుజరాత్‌లో అహ్మదాబాద్‌లో ఎలిస్‌బ్రిడ్జ్ స్ధానంలో బోణీ కొట్టింది. ఆ పార్టీ అభ్యర్థి రాకేష్ షా కాంగ్రెస్ అభ్యర్థిపై గెలుపుతో తన సీటును నిలబెట్టుకున్నారు.మరోవైపు గుజరాత్ ఎన్నికల ఫలితాల్లో పటేల్ ఉద్యమ ప్రభావం లేదని డిప్యూటీ సీఎం నితిన్ పటేల్ చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment