మహిళలకోసం 'బైక్సీ పింక్' సర్వీసులు
మహిళల సురక్షిత ప్రయాణం కోసం ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలు పింక్ ట్యాక్సీ, పింక్ ఆటో సర్వీసులు అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు వినూత్నంగా గుర్గావ్ లో మహిళల కోసం మహిళా డ్రైవర్లతో పింక్ బైక్ సర్వీసులు ప్రారంభమయ్యాయి. వారం క్రితం ఐదు పింక్ స్కూటీ సర్వీసులను 'బైక్సీ పింక్' పేరుతో ప్రారంభించారు. ఓలా, ఉబర్ వంటి ట్యాక్సీలను బుక్ చేసుకున్నట్లే ఈ బైక్సీలను కూడా యాప్ ద్వారా మొబైల్ నుంచి బుక్ చేసుకునే సౌకర్యం కల్పించారు.
ద్విచక్రవాహనాలపై అద్దెకు ప్రయాణించే అవకాశం ఇప్పుడు గుర్గావ్ మహిళలకు అందుబాటులోకి వచ్చింది. ఈ కొత్త బైక్ టాక్సీ సర్వీసులను జనవరి 20న ప్రారంభించారు. ఇప్పటివరకూ ఇటువంటి సర్వీసు దేశంలో మొట్టమొదటిసారి ప్రవేశ పెట్టినట్లు రిపోర్టుల ద్వారా తెలుస్తోంది.
దివ్యా కాలియా... ఆమె భర్త మోహిత్ శర్మ లు ఈ బైక్సీ సర్వీసులను ప్రారంభించారు. పదిరోజుల క్రితం మహిళలకోసం బైక్సీ పింక్ లను ప్రారంభించిన ఆ దంపతులు... రోజువారీ ప్రయాణీకులకోసం బైక్సీ బ్లూ సర్వీసులను కూడా ప్రవేశపెట్టారు. మొదటి రెండు కిలోమీటర్లకు పది రూపాయలు, ఆపైన ప్రతి కిలోమీటర్ కు ఐదు రూపాయలచొప్పున బైక్సీ పింక్ ప్రయాణీకుల నుంచి వసూలు చేస్తారు. ఈ సర్వీసుల్లో ప్రయాణికుల భద్రత, శుభ్రత కోసం చోదకులు తమతో పెప్పర్ స్ప్రే ను ఉంచుకోవడంతోపాటు, హెల్మెట్ లోపల డిస్పోజబుల్ షవర్ క్యాప్ లను కూడా వాడేట్లు ఏర్పాటు చేశారు. అంతేకాక ప్రయాణీకుల భద్రతకోసం బైక్సీ యాప్ లో SOS బటన్ సదుపాయాన్ని కూడా కల్పించారు. ఈ బైక్సీ పింక్ సర్వీసులు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అందుబాటులో ఉంటాయి.
అయితే మోటార్ వెహికిల్ యాక్ట్ లో ఇంతకు ముందు బైక్ లను ట్యాక్సీలుగా నడిపే సదుపాయం లేదు. కాగా హర్యానాలో ప్రస్తుతం వాణిజ్య ప్రయోజనాల కోసం ద్విచక్రవాహనాల నిబంధనల్లోనూ రవాణా చట్టాలకు సవరణ చేసి, బైక్ లను కూడా ట్యాక్సీలుగా నడిపేందుకు అనుమతినిచ్చారు. దీంతో అనేక ద్విచక్ర వాహనాలు కూడా ఈ ప్రాంతంలో ట్యాక్సీ సర్వీసులను ప్రారంభిచాయి. ముఖ్యంగా దివ్యా కాలియా ఈ బైక్సీ పింక్ సర్వీసులను తరచుగా రైల్వే స్టేషన్లు, బస్టాండ్ లు, మెట్రో స్టేషన్లలో ప్రయాణీకులకు అందుబాటులో ఉండేట్టు ప్రవేశ పెట్టారు. ప్రతిరోజూ ఎదురయ్యే సమస్యే ఈ బైక్సీలు ప్రవేశపెట్టేందుకు దివ్యాను ప్రోత్సహించింది. ప్రతిరోజూ గుర్గావ్ స్టేషన్ కు ప్రయాణించేందుకు తాను ఎంతో ఇబ్బంది పడాల్సి వచ్చేదని, ఆటోల కొరత, ఎక్కువ డబ్బు వసూలు చేస్తుండటంతో విసిగిపోయి, సమస్యను పరిష్కరించేందుకు స్వయంగా ఈ బైక్సీ పింక్ లను ప్రారంభించానని దివ్యా చెప్తోంది.