గువాహటి: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి భారత్‌లోనూ విస్తరిస్తోంది. అస్సాంలో 25 కరోనా కేసులు నమోదవగా అందులో 24.. ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో తగ్లిబీ జమాత్ సభ్యులవే కావడం గమనార్హం. అయితే మిగిలిన ఒక్కరికి మాత్రం స్థానికంగా కరోనా సోకినట్లు తెలుస్తోంది. దీంతో అతనికి ఎవరి ద్వారా కరోనా సోకిందన్న విషయంపై అధికారులు దృష్టి సారించారు. గువాహటికి చెందిన ఓ వ్యాపారవేత్త ఫిబ్రవరి 29న ఢిల్లీ నుంచి రాష్ట్రానికి తిరిగి వచ్చాడు. దగ్గు, జలుబుతో బాధపడుతున్న ఆయన ఆసుపత్రికి వెళ్లగా అక్కడ అతనికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో అధికారులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. అతను నివసించే స్వానిష్ గార్డెన్ ప్రాంతాన్నిశుభ్రం చేయడమే కాక ఆ ప్రాంతంలోని కుటుంబాలు హోమ్ క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.
ఈ విషయం గురించి అస్సాం ఆరోగ్య మంత్రి హింతమ బిశ్వశర్మ మాట్లాడుతూ.. "అతను ఢిల్లీకి వెళ్లి వచ్చినప్పటికీ అక్కడ కరోనా సోకలేదని భావిస్తున్నాం. సుమారు నెల పూర్తయిన తర్వాత కరోనా పాజిటివ్ అని తేలింది. కాబట్టి గువాహటిలోనే అతను వైరస్ బారిన పడే అవకాశం ఉంది. అయితే సైలెంట్ క్యారియర్(కరోనా సోకిందని తెలియక అందరినీ కలిసి వైరస్ అంటిస్తారు) ద్వారా అతనికి వైరస్ సోకింది" అని అభిప్రాయపడ్డారు. ఇక ఆ వ్యాపారవేత్తను కలిసిన 111 మంది నుంచి సాంపుల్స్‌ను సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్‌లకు పంపినట్లు పేర్కొన్నారు. కాగా అతను ఢిల్లీ నుంచి తిరిగి వచ్చాక స్వస్థలమైన షిల్లాంగ్, నాగౌన్‌కు కూడా వెళ్లినట్లు సమాచారం. (వైరస్ అనుమానితుల వివరాలు ఇవ్వండి)
Comments
Please login to add a commentAdd a comment