నన్ను ఉరితీసినా.. అందుకు అంగీకరించను
పట్నా: రిజర్వేషన్లను సమీక్షించాలన్న ఆర్ఎస్ఎస్ నేత వ్యాఖ్యలపై ఆర్జేడీ నేత, బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ విరుచుకుపడ్డారు. తనను ఉరి తీసినా రిజర్వేషన్లను ఎత్తివేయడానికి చేస్తున్న కుట్రలకు వ్యతిరేకంగా పోరాడతానని ఆయన స్పష్టం చేశారు. పేదలు, వెనకబడిన వర్గాల వారికి రాజ్యాంగం కల్పిస్తున్న రిజర్వేషన్లను రద్దు చేసే ప్రయత్నాలను తాను గానీ, తన పార్టీగాని ఒప్పుకునేది లేదని లాలూ తెగేసి చెప్పారు. బీసీ వర్గాలకు, పేదలకు రాజ్యాంగం కల్పించిన హక్కులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. లౌకికవాదానికి తూట్లు పొడిచే ప్రయత్నాలను తాను ఎట్టి పరిస్థితిల్లోనూ ఉపేక్షించబోనని లాలూ అన్నారు.
ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఆర్ఎస్ఎస్ నేత మోహన్ భగవత్పై లాలూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ విషయంలో మోదీ ...యునైటెడ్ నేషన్స్ కు తన మీద పిటిషన్ ఇచ్చినా ఇస్తారంటూ ఎద్దేవా చేశారు. దీంతో పాటు రిజర్వేషన్లకు ఎత్తివేతకు ప్రయత్నిస్తున్న భగవత్కు భారతరత్న ఇచ్చి గౌరవించండంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
ఇటీవల ఎస్టీ, ఎస్టీ, బిసి వర్గాలకు అమలు చేస్తున్న రిజర్వేషన్లను సమీక్షించాలని ఆర్‌ఎస్‌ఎస్ చీప్ మోహన్ భగవత్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీంతో ఆ ప్రకటనపై దుమారం చెలరేగింది. ఆర్‌ఎస్‌ఎస్, బిజెపి కుట్రలో భాగంగానే అగ్రకులాల పెత్తనాన్ని మరింత పెంచేందుకు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని, ఇలాంటి వాటిని తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని పలు సంఘాలు మండిపడుతున్నాయి.