హరియాణా : గణిత శాస్త్రం.. ఈ పేరు వింటేనే కొంతమంది స్టూడెంట్స్ బెంబేలెత్తిపోతారు. లెక్కల మాస్టారు తరగతి గదిలోకి ప్రవేశిస్తేనే బోర్‌గా ఫీలవుతారు. ఎప్పుడెప్పుడు మ్యాథ్స్ క్లాస్ అయిపోతుందా అని ఎదురుచూస్తూ ఉంటారు. కానీ మన లెక్కల మాస్టారు చెప్పే క్లాసులు విద్యార్థులు మాత్రం అస్సలు మిస్సవ్వరు. ఇంకా కాసేపు చెబితే బాగుండు అనేలా క్లాసులు వింటారు. అయితే ఈ మాస్టారు చెప్పే లెక్కలు కొంచెం తేడా. గణితానికి ప్రేమను జోడించి ప్రేమ లెక్కలు చెబుతూ వివాదస్పందంగా నిలిచారు హరియాణా ప్రభుత్వ మహిళా కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ చరణ్ సింగ్. స్నేహం, ఆకర్షణ, క్రష్‌ల మధ్య తేడాను గణిత రూపంలో వివరిస్తున్న వీడియో సోషల్ మీడియా ద్వారా వైరల్ అయింది. ఆయన చెప్పిన ప్రేమ లెక్కలు..
ఫ్రెండ్‌షిప్ : సాన్నిహిత్యం నుంచి ఆకర్షణను తీసివేస్తే వచ్చేదే స్నేహం (క్లోజ్‌నెస్- అట్రాక్షన్ = ఫ్రెండ్‌షిప్). భార్యభర్తలు వృద్ధాప్యంలో స్నేహితులుగా ఉంటారు. వృద్ధాప్యంలో శారీరక ఆకర్షణ తగ్గిపోయి స్నేహితులుగా మారుతారు.
లవ్ : సాన్నిహిత్యం, ఆకర్షణల కలయికనే ప్రేమ. (క్లోజ్‌నెస్ + అట్రాక్షన్) .
రొమాంటిక్ లవ్ : స్నేహం, సాన్నిహిత్యం, ఆకర్షణల కలయికనే రొమాంటిక్ లవ్ ( రోమాంటిక్ లవ్ = ఫ్రెండ్‌షిప్ + క్లోజ్‌నెస్ + అట్రాక్షన్). ఏ సంబంధం అయినా ఆకర్షణ, స్నేహం, సాన్నిహిత్యంపైనే ఆధారపడి ఉంటుంది.
‘ఒకరిపై ప్రేమ అనేది ఆకర్షణతో మొదలవుతుంది. వారిమధ్య సాన్నిహిత్యం కొరవడితే వైరం ఏర్పడుతుంది. దీంతో విడిపోతారు. ఇలాంటి ప్రేమ ఎక్కువగా విదేశాలలో ఉంటుంది. కొన్ని దేశాల్లో వాహనాలు, ఇళ్లను మార్చినట్లుగా ఈజీగా జీవిత భాగస్వామిని మారుస్తారు. దానికి గల కారణం సాన్నిహిత్యం లేకపోవడం. కానీ భారతదేశంలో అలాకాదు. వారిలో ఆకర్షణ, సాన్నిహిత్యం తగ్గిపోయినా వారి పిల్లల కోసం కలిసి ఉంటారు’ అని చరణ్ సింగ్ వివరించారు.
ఇక క్రష్ గురించి చెబుతూ.. ఆకర్షణ నుంచి సాన్నిహిత్యాన్ని తీసివేస్తే వచ్చేదే క్రష్ అని చెప్పారు. ప్రతి ఒక్కరి జీవితంలో క్రష్ అనేది ఎప్పడో ఒకసారి పుడుతుందని స్టూడెంట్స్‌కు వివరించారు. ఇక ప్రొఫెసర్ చెప్పే ప్రేమ లెక్కలను విద్యార్థులు నవ్వుతూ శ్రద్దగా విన్నారు. వారికి ఉన్న సందేహాలను కూడా తీర్చుకున్నారు. ఏ ఒక్క విద్యార్థి కూడా అతనిపై ఫిర్యాదు చేయలేదు. సామాజిక కార్యకర్త ఒకరు చరణ్ సింగ్‌పై స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అయితే చరణ్ సింగ్‌పై పోలీసులు చర్యలు తీసుకున్నారో లేదో తెలియరాలేదు.
Comments
Please login to add a commentAdd a comment