ముస్లింలు పూజ.. హిందువులు ఉపవాసం!
జైసల్మీర్: గణపతి ఉత్సవాల సంబరాల్లో పాల్గొంటూ ముస్లింలు.. రంజాన్ మాసంలో హిందువులు ఉపవాసం ఉంటూ రాజస్థాన్ లోని ఓ ప్రాంతం మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది. రాష్ట్రంలోని బర్మర్, జైసల్మీర్ జిల్లాల్లో ముస్లింలు దీపావళి జరుపుకొంటూ పాటలు ఆలపిస్తారు. మరికొందరు గణేశ్ ను పూజిస్తారు. తమ తోటి హిందువులతో ఆచారాలను పాటిస్తారు. అలాగే ముస్లింలు అతి పవిత్రంగా భావించే రంజాన్ నెలలో హిందువులు వారితో పాటే ఉపవాసం చేస్తారు. మరికొందరు రోజుకు అయిదు సార్లు నమాజు చేస్తున్నారు. కాగా, ఈ ఆచార సంప్రదాయం ఎలా వచ్చిందో ఎవరికీ తెలియదు. భారత్ నుంచి పాకిస్తాన్ విడిపోయాక సింధ్ నుంచి చాలా హిందూ కుటుంబాలు రాజస్థాన్ కు వచ్చి స్థిరపడ్డాయి. అక్కడి గ్రామాల్లో ప్రజలు ధరించే వేషధారణ సైతం ఇంచుమించు అందరిదీ ఒకేలాగ ఉండటంతో హిందువులెవరో.. ముస్లింలు ఎవరో? చెప్పలేని పరిస్థితి కనిపిస్తోంది.
దీనిపై గోహడ్ కా తల అనే గ్రామంలో నివసించే డా. మేఘారామ్ గద్ వీర్ మాట్లాడుతూ.. గ్రామంలోని ప్రతి ఒక్కరి ఆనందాలు, బాధలను అందరూ పంచుకుంటారని, కుల, మత, వర్గ తారతమ్యాలకు ఇక్కడ చోటు లేదని తెలిపారు. పాకిస్తాన్ భారత్ నుంచి విడిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చినట్లు చెప్పారు. పాక్ తో యుద్ధ సమయంలో కూడా ఇలానే జీవించాం అని వివరించారు. బర్మార్ జిల్లాలోని గోహడ్ కా తల, రబసర్, సట, సిన్హానియా, బఖాసర్, కెల్నోర్ గ్రామాల్లోని ఎక్కువమంది ప్రజలు దీనిని పాటిస్తున్నారు. వివాహాల సమయంలో హిందూ దేవుళ్ల పాటలను పాడుతూ… గణేశుడి పూజతో ప్రారంభిస్తున్నారు.