
హర్షవర్ధన్: భలే డాక్టర్
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఇంకో నెల రోజుల్లో ఉన్నాయనగా బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా తెరపైకి వచ్చిన హర్షవర్ధన్‌కు నిజాయితీపరుడని పేరుంది. ఈఎన్‌టీ వైద్యునిగా బాగా పేరున్న ఆయన సాదాసీదాగా వ్యవహార శైలితో అన్ని గ్రూపులనూ కలుపుకునిపోవడం ద్వారా పార్టీని విజయపథంలో ముందుకు నడిపించారు. ఒకవిధంగా ఆయన్ను సీఎం అభ్యర్థి చేయడం వల్లే ఇటు ఆమ్ ఆద్మీ పార్టీకి, అటు కాంగ్రెస్‌కు బీజేపీ గట్టి పోటీ ఇవ్వగలిగిందన్నది విశ్లేషకుల అభిప్రాయం. అనూహ్యంగా పెరిగిపోయిన కరెంటు చార్జీలను 30 శాతం మేరకు తగ్గిస్తానన్న ఆయన హామీ ఈ ఎన్నికల్లో ఢిల్లీవాసులను బాగా ఆకట్టుకుంది.
ఆరెస్సెస్ కార్యకర్త అయిన 59 ఏళ్ల హర్షవర్ధన్ అందరికీ డాక్టర్ సాబ్‌గా సుపరిచితుడు. 1993లో కృష్ణనగర్ అసెంబ్లీ స్థానం నుంచి నెగ్గడం ద్వారా రాజకీయ అరంగేట్రం చేశారు. 1998, 2003, 2008ల్లో అక్కడి నుంచి వరుసగా గెలిచారు. వైద్య మంత్రిగా ఢిల్లీని పోలియో విముక్త రాష్ట్రంగా చేయడంతో ఆయన పేరు మారుమోగిపోయింది. దాన్ని ఆదర్శంగా తీసుకుని పోలియో నిర్మూలన పథకాన్ని కేంద్రం దేశవ్యాప్తంగా అమలు చేసింది. ఢిల్లీలో ఆయన అమలు చేసిన ధూమపాన నిషేధ చట్టం కూడా ఇదేవిధంగా 2002లో దేశవ్యాప్తమైంది. మంత్రిగా ప్రతి ఒక్కరికీ నిత్యం అందుబాటులో ఉంటూ అన్ని వర్గాల్లోనూ హర్షవర్ధన్ ఎంతగానో ఆదరణను పెంచుకున్నారు.