జాట్‌ల జ్వాలలతో దిగొచ్చిన సర్కార్ | Haryana Government Promises Reservations for Jats | Sakshi
Sakshi News home page

జాట్‌ల జ్వాలలతో దిగొచ్చిన సర్కార్

Published Mon, Feb 22 2016 1:55 AM | Last Updated on Sun, Sep 3 2017 6:07 PM

గుర్గావ్‌లో రహదారిని దిగ్బంధించి నిరసనలు తెలుపుతున్న జాట్లు

గుర్గావ్‌లో రహదారిని దిగ్బంధించి నిరసనలు తెలుపుతున్న జాట్లు

కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటుకు కేంద్రం నిర్ణయం
జాట్‌లను ఓబీసీల్లో చేర్చడంపై అధ్యయనం
కేంద్రానికి, బీజేపీ చీఫ్‌కు నివేదిక అందజేయనున్న కమిటీ
హరియాణా అసెంబ్లీలో వచ్చే సమావేశాల్లో బిల్లు!
కేంద్రం ప్రకటనతో హరియాణాలో నిరసనలు తగ్గుముఖం
రోడ్ల దిగ్బంధం నుంచి వెనక్కు తగ్గుతున్న ఆందోళనకారులు
8 రోజుల పాటు ఉధృతంగా సాగిన ఉద్యమం
హింసాత్మక ఘటనల్లో మొత్తం 12 మంది మృతి, 150 మందికి గాయాలు


న్యూఢిల్లీ/చండీగఢ్: ఓబీసీల్లో చేర్చాలంటూ హరియాణాలో జాట్ వర్గీయులు చేపట్టిన ఆందోళనలు తీవ్రరూపం దాల్చడంతో.. వారి రిజర్వేషన్ల డిమాండ్‌పై కేంద్రప్రభుత్వం స్పందించింది. సీనియర్ మంత్రి వెంకయ్యనాయుడు ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆదివారం రాత్రి ప్రకటించారు. ఈ కమిటీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యావకాశాల్లో రిజర్వేషన్లు కోరుతున్న జాట్‌ల డిమాండ్‌ను పరిశీలించి, ఒక సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తుంది. ‘ఈ సమస్యకు పరిష్కారాలను సూచిస్తూ సాధ్యమైనంత త్వరగా నివేదికను అందించాలని కమిటీని కోరాం’ అని రాజ్‌నాథ్ వెల్లడించారు.  సంయమనం పాటించాలని హరియాణా ప్రజలకు రాజ్‌నాథ్ విజ్ఞప్తి చేశారు. అంతకుముందు, మంత్రివర్గ సహచరులు సుష్మా స్వరాజ్, మనోహర్ పారికర్‌లతో రాజ్‌నాథ్ భేటీ అయి, హరియాణాలో పరిస్థితిని సమీక్షించారు. ఈ భేటీకి ముందు జాట్ వర్గ ప్రతినిధులు రాజ్‌నాథ్‌తో సమావేశమయ్యారు. హరియాణాలో జాట్ వర్గీయులను ఓబీసీల్లో చేర్చడానికి ఉద్దేశించిన బిల్లును వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో సభలో ప్రవేశపెడ్తామని రాజ్‌నాథ్ వారికి హామీ ఇచ్చారు. వెంకయ్యనాయుడు నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీలో కేంద్రమంత్రులు మహేశ్ శర్మ, సంజీవ్ బల్యాన్, బీజేపీ ఉపాధ్యక్షులు సత్పాల్ మాలిక్, అవినాశ్ రాయ్ ఖన్నా సభ్యులుగా ఉంటారని బీజేపీ ఒక ప్రకటనలో తెలిపింది. కమిటీ ఈ నివేదికను ప్రభుత్వానికి, అలాగే బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాకు అందజేస్తుందని వెల్లడించింది.

కాగా, ఓబీసీల్లో చేర్చాలంటూ హరియాణాలో జాట్ వర్గీయులు చేపట్టిన ఆందోళనల్లో విధ్వంసం, హింసాత్మక ఘటనలు, దహనకాండలు ఆదివారం కూడా కొనసాగాయి. అయితే, రాజ్‌నాథ్ ప్రకటన అనంతరం రాష్ట్రవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు తగ్గుముఖం పట్టాయి. సహరణ్‌పూర్- అంబాలా, పవంత సాహిబ్- యమునానగర్, అంబాలా- ఖైతాల్, సహరణ్‌పూర్-పిప్లీ- కురుక్షేత్ర, జిరాక్పూర్- పర్వానూ, లాద్వా- షాబాద్ తదితర రోడ్డు మార్గాలు సహా రాష్ట్రవ్యాప్తంగా రోడ్డు, రైలు మార్గాలను దిగ్బంధించిన నిరసనకారులు క్రమంగా వెనక్కు తగ్గుతున్నారు.ఒకట్రెండు రోజుల్లో రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొనవచ్చని భావిస్తున్నారు. ఓబీసీ రిజర్వేషన్ డిమాండ్‌తో గత ఎనిమిది రోజులుగా ఉధృతంగా సాగిన జాట్‌ల ఆందోళనల్లో ఆదివారం వరకు 12 మంది ప్రాణాలు కోల్పోయారని, 150 మంది వరకు గాయపడ్డారని డీజీపీ యశ్పాల్ సింఘాల్ తెలిపారు. ఉద్రిక్తత కొనసాగుతుండటంతో రాష్ట్రంలోని 8 పట్టణాల్లో కర్ఫ్యూని పొడిగించారు. ఆదివారం ఉదయం ఖైతాల్‌లోనూ కర్ఫ్యూ విధించి, సాధారణ పరిస్థితులు నెలకొనడంతో సాయంత్రానికి తొలగించారు. ఆందోళనలకు కేంద్రంగా నిలిచిన రోహ్‌తక్‌లో ముఖ్యమంత్రి ఎంఎల్ ఖట్టర్ నేడు పర్యటించనున్నారు. తాజాగా, ఆదివారం జరిగిన హింసాత్మక ఘటనల్లో సోనిపెట్ జిల్లాలో ఒక వ్యక్తి చనిపోగా, హిస్సార్ జిల్లాలో జాట్-జాటేతరుల మధ్య ఘర్షణల్లో మరొక వ్యక్తి చనిపోయాడని హరియాణా హోంశాఖ కార్యదర్శి పీకే దాస్ తెలిపారు. పానిపట్ జిల్లాలోని గునార్ రైల్వే స్టేషన్‌ను ఆందోళనకారులు ధ్వంసం చేశారన్నారు. ఖైతాల్‌లో జాటేతర వర్గీయులు చేసిన ధర్నా సందర్భంగా విధ్వంసం చోటు చేసుకుందన్నారు. ఆదివారం నాటి విధ్వంసంలో.. భివానీ, సోనిపేట్ జిల్లాల్లో రెండు పోలీస్ స్టేషన్లను, కొన్ని షాపులను, ఏటీఎం కేంద్రాలను జాట్ ఆందోళనకారులు తగలబెట్టారు. రహదారులపై ఉన్న హోటళ్లను ధ్వంసం చేశారు.

ఢిల్లీ టు చండీగఢ్.. రూ. 55 వేలు!

జాట్‌ల ఆందోళనలు దేశ రాజధాని ఢిల్లీకి చేరాయి. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో నిరసనకారులు ప్రదర్శనలు నిర్వహించారు. పలు చోట్ల కొంత విధ్వంసం కూడా చోటు చేసుకుంది. హరియాణాలో ఉద్రిక్తత నేపథ్యంలో 736 రైళ్లను రద్దు చేశారు. 105 రైళ్లను వేరే మార్గం మీదుగా మళ్లించారు. ఢిల్లీ-అంబాలా, ఢిల్లీ-రోహ్‌తక్ మార్గాల్లో రైళ్ల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. జాట్‌ల విధ్వంసంలో రూ. 200 కోట్ల మేర ఆస్తులకు నష్టం కలిగిందని రైల్వే శాఖ ప్రకటించింది. హరియాణా మీదుగా వెళ్లే బస్సులను సైతం రద్దు చేశారు. లాహోర్- ఢిల్లీ బస్సు సర్వీసును పాక్ ప్రభుత్వం నిలిపేసింది. జాట్‌ల ఆందోళనల నేపథ్యంలో భారత్ విజ్ఞప్తి మేరకు పాక్ ఈ నిర్ణయం తీసుకుంది. రైలు, రోడ్డు రవాణా నిలిచిపోవడంతో ఆయా ప్రాంతాలకు విమాన సర్వీసులకు డిమాండ్ పెరిగింది. దాంతో విమానయాన సంస్థలు టికెట్ల ధరలను భారీగా పెంచాయి. ముఖ్యంగా ఢిల్లీ-చంఢీగఢ్, ఢిల్లీ- అమృతసర్, ఢిల్లీ- జైపూర్‌ల మధ్య రద్దీ విపరీతంగా పెరిగింది. సాధారణ పరిస్థితుల్లో ఢిల్లీ-చండీగఢ్‌ల మధ్య గరిష్టంగా రూ. 8 వేలు ఉండే టికెట్ ధరను జెట్ ఎయిర్‌వేస్ సాధారణ తరగతికి రూ. 46 వేలు, బిజినెస్ క్లాస్‌కు రూ. 55 వేలకు పెంచి, సొమ్ము చేసుకుంది. హరియాణా ఉద్రిక్తతల నేపథ్యంలో పెద్ద సంఖ్యలో భక్తులు, ముఖ్యంగా వైష్ణోదేవి ఆలయానికి వెళ్లి వస్తున్న ప్రయాణీకులు జమ్మూ, శ్రీనగర్‌లలో చిక్కుకుపోయారు.

ఢిల్లీలో జల సంక్షోభం

జాట్‌ల ఆందోళన ఢిల్లీకి మునుపెన్నడూ ఎరగని నీళ్ల కష్టం తీసుకువచ్చింది. హరియాణా నుంచి దేశ రాజధానికి వచ్చే నీటి సరఫరా నిలిచిపోవచడంతో.. నగరంలో నీటి సంక్షోభం నెలకొంది. దాంతో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అత్యవసర సమీక్ష జరిపి, నీటి సరఫరాపై ఆంక్షలు విధించారు. నీళ్లను పొదుపుగా వాడుకోవాలని పౌరులకు సూచించారు. అన్ని పాఠశాలలకు సోమవారం సెలవు ప్రకటించాలని ఆదేశించారు. జాట్‌ల నిర్భంధంలో ఉన్న హరియాణాలోని మునాక్ కాలువ నుంచి ఢిల్లీకి నీళ్ల సరఫరాను పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ఢిల్లీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై నేడు సుప్రీంలో విచారణ జరగనుంది. హరియాణా నుంచి వచ్చే కూరగాయలు, పాలు తదితర నిత్యావసరాల సరఫరా నిలిచిపోవడంతో, ఢిల్లీలో వాటికి కూడా కొరత ఏర్పడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement