సాక్షి, న్యూఢిల్లీ : ఎప్పుడూ బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను బలంగా సమర్థిస్తూ వచ్చే సీపీఐ, సీపీఎం పార్టీలు ఎందుకు హఠాత్తుగా అగ్రవర్ణాల వారిలో కూడా ఆర్థికంగా వెనకబడిన వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తున్నాయి? రాజస్థాన్‌లో జాట్‌లు, గుజరాత్‌లో పాటిదార్లు రిజర్వేషన్ల కోసం పెద్ద ఎత్తున ఉద్యమాలు లేవదీయడం, వారికి సంఘ్ పరివార్ అండగా నిలబడడం, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి కోసం పాటిదార్లకు రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన నేపథ్యంలో కేంద్రంలోని పాలకపక్ష బీజేపీని ఇరుకున పెట్టేందుకు వామపక్షాలు కొత్తగా ఈ నినాదం అందుకున్నాయి.
అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పిస్తూ రాజ్యాంగ సవరణ తీసుకరావాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఇటీవల భారీ ర్యాలీ కూడా నిర్వహించింది. వాస్తవానికి అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనక బడిన వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించడానికి సీపీఐ, సీపీఎం పార్టీలు మొదటి నుంచి వ్యతిరేకం ఏమీ కావు. 1930 నుంచి ఈ డిమాండ్‌కు సీపీఐ అనుకూలమే. బహిరంగంగా ఎప్పుడూ ఈ డిమాండ్ గురించి గట్టిగా మాట్లాడలేదు. సీపీఎం మాత్రం 1990లో తన పాత పద్ధతిని మార్చుకొని అగ్రవర్గాల్లో ఆర్థిక రిజర్వేషన్లకు మద్దతు ప్రకటించింది.
అయితే ఈ రెండు పార్టీలు కూడా తాము అధికారంలో ఉన్నప్పుడు పశ్చిమ బెంగాల్, త్రిపుర, కేరళ రాష్ట్రాల్లో అగ్రవర్ణాల వారికి రిజర్వేషన్లు కల్పించలేం. కేరళలో మాత్రం ప్రభుత్వ ఉద్యోగాల్లో ఆర్థికంగా వెనకబడిన అగ్రవర్ణాల వారికి పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ నవంబర్ 15వ తేదీన ఎల్‌డీఎఫ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. స్వయం ప్రతిపత్తి కలిగిన దేవసం బోర్డులైన ట్రావన్‌కోర్, కోచి, గురువాయూర్, మలబార్, కూడల్ మానిక్యంలో ఆర్థికంగా వెనకబడిన అగ్రవర్ణాల వారికి రిజర్వేషన్లు కల్పించింది.
ఈ బోర్డుల్లో కేవలం హిందువులకే ప్రవేశం కనుక ప్రభుత్వ ఉద్యోగాల్లో ముస్లింలకు ఉండే కోటాను వీటిల్లో అగ్రవర్ణాలకు కల్పించారు. ట్రావన్‌కోర్ దేవసం బోర్డుల్లో 6,120 పోస్టులకు గాను 96 శాతం మంది అంటే 5,870 మంది అగ్రవర్ణాలైన నాయర్లు, నంబూద్రీలే ఉన్నారు. వెనకబడిన ఎజవాలు 270 మంది ఉండగా, దళితులు 20 మంది ఉన్నారు. అలాగే దేవసం బోర్డుల ఆధ్వర్యంలో ప్రభుత్వ సహకారంతో నడిచే విద్యా సంస్థల్లో 79 శాతం మంది అగ్రవర్ణాల టీచర్లే ఉన్నారు. అంటే 180 మంది టీచర్లకుగాను 135 మంది నాయర్లు, ఆరుగురు నంబూద్రీలే ఉన్నారు.
సామాజిక ఆర్థిక పురోగతి, ముఖ్యంగా పెట్టుబడిదారి వ్యవస్థ పురోభివద్ధి కారణంగా అగ్రకులాల్లో కూడా ధనవంతులు, పేదలు అంటూ రెండు వర్గాలు ఏర్పడ్డాయని, ఈ కారణంగా వారిలో కూడా పేదలకు రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం ఉందని 1990 దశకంలో సీపీఎం తన పంథా మార్చుకుంది. అయితే ఈ వాదన తప్పని, బలహీన వర్గాల ఆర్థికాభివద్ధి కోసం బీసీ, ఎస్టీ, ఎస్సీ రిజర్వేషన్ల విధానం రాలేదని, సామాజిక అంతరాలను తెంచడం కోసమే ఈ రిజర్వేషన్లు వచ్చాయని, ఇప్పటికీ కులాల మధ్య సామాజిక అంతరాలు అలాగే ఉన్నందున రిజర్వేషన్లను అదే ప్రాతిపదికన కొనసాగించాలని ఎంతో మంది సామాజిక శాస్త్రవేత్తలు నేటికి వాదిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment