హఫీజ్ సయీద్ అంకుల్ ఏం చెప్పారంటే..
ముంబై: హఫీజ్ సయీద్ అంకుల్ అట, జాకీర్ రహ్మాన్ లఖ్వీ ఆయన స్నేహితులట. డేవిడ్ హెడ్లీ తన సహచర తీవ్రవాదితో సంభాషణ కోసం వాడిన కోడ్ లాంగ్వేజి ఇది. 26/11 ముంబై దాడుల్లో కీలక పాత్ర పోషించి ఇటీవలే అప్రూవర్‌గా మారిన ఉగ్రవాది డేవిడ్ కోల్మన్ హెడ్లీ అమెరికా నుంచి వీడియో లింక్ ద్వారా ముంబైలోని ప్రత్యేక కోర్టుకు ఇస్తున్న వాంగ్మూలాల్లో శనివారం మరిన్ని సంచలన అంశాలు వెల్లడయ్యాయి.
తన ఈ మెయిల్ gulati22@hotmail.com, తన సహచర తీవ్రవాది సాజిద్ మిర్ ఈ మెయిల్ rare.lemon@gmail.com గా హెడ్లీ అంగీకరించాడు. జూలై 8న సాజిద్ మిర్‌కు హెడ్లీ ఈమెయిల్ చేశాడు. హఫీజ్ సయిద్ తన 'అంకుల్'గా, జాకీర్ రహ్మాన్ లఖ్వీ 'అతడి స్నేహితులు'గా కోడ్ లాంగ్వేజిలో పేర్కొన్నాడు. ముంబై దాడుల తర్వాత పాకిస్తాన్ ప్రభుత్వం విచారణ చేపట్టడంతో మెయిల్ ద్వారా సంప్రదింపులు జరిపానని చెప్పాడు. 2009 జూలై8న 'అంకుల్ ఎలా ఉన్నారు' అని సాజిద్‌కు మెయిల్ చేశాడు. దానికి అతను' అంకుల్ బాగున్నారు. చాలా ఎత్తుకు చేరనున్నారు' అని బదులిచ్చాడు.
అగస్టు28న' ఓల్డ్ అంకుల్(హఫీజ్)కు హెచ్1 వైరస్ కూడా వచ్చిందా? ఆసుపత్రిలో ఉన్న డాక్టర్ చెకప్ చేయాలనుకుంటున్నాడు' అనే సారంశంతో హెడ్లీ మెయిల్..
అయితే హెడ్లీ కోర్టుకు తెలిపిన అసలు అర్థం... వారిపై విచారణ జరిగితే హఫీజ్ సయీద్‌కు అనుకూలంగా ఉంటాము.
అగస్టు30: సాజిద్ మిర్ బదులిస్తూ..మా అంకుల్ టోర్నడోలా కదులుతున్నాడు.
హెడ్లీ తెలిపిన అర్థం: హఫీజ్ సయీద్ కు ఏమీ అవ్వదు..
సెప్టెంబర్3: 'ప్రతి అంకుల్ బాగానే ఉన్నాడు' అని సాజిద్ నుంచి మెయిల్
దానికి హెడ్లీ తెలిపిన అసలు అర్థం: ప్రతి అంకుల్ అంటే హఫీజ్ సయీద్, జాకీర్ రెహ్మాన్ లఖ్వీ అని అర్థం
హెడ్లీ తెలిపిన మరిన్ని వివరాలు...
- పుణేలోని ఆర్మీ కేంద్రంలో ఉన్న జవాన్లను రిక్రూట్ చేసుకొని వారి నుంచి మరింత సమాచారం రాబట్టాలని మజ్ ఇక్బాల్ నాతో చెప్పారు.
- పూణేలోని ఆర్మీ కేంద్రానికి కూడా వెళ్లాను
- 2009లో చాలా ప్రాంతాలు తిరుగుతూ వీడియో తీశాను.
- మార్చి3న తహవూర్ రాణాకి 'హెడ్లీ పర్సనల్ విల్' సబ్జెక్ట్తో .. ఈ మెయిల్ చేశాను.
- దక్షిణ కమాండ్ హెడ్ క్వార్టర్ భవనాన్ని మార్చి16-19 వరకు రెక్కీ నిర్వహించి వీడియో తీశాను. మార్చి 15న గోవాలోని చాబాద్ హౌస్, అంతకుముందు11-13 వరకు రాజస్థాన్‌లోని పుష్కరాలకు వెళ్లి రెక్కి నిర్వహించా. అనంతరం ఈ వీడియోలను మజ్ ఇక్బాల్ అప్పగించాను.