
'చికిత్స నిరాకరించిన ఆస్పత్రులపై కేసు పెట్టండి'
డెంగీతో చిన్నారి మృతి, కుటుంబం ఆత్మ హత్య కేసు పై ఢిల్లీ ప్రభుత్వం స్పందించింది.
న్యూఢిల్లీ: డెంగీతో చిన్నారి మృతి, కుటుంబం ఆత్మ హత్య కేసు పై ఢిల్లీ ప్రభుత్వం స్పందించింది. పలు ఆస్పత్రుల్లో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. చికిత్స నిరాకరించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆస్పత్రులపై కేసులు పెట్టాలని కేజ్రీవాల్ సూచించారు.
వివరాలు..ఒక్కగానొక్క కొడుకు డెంగీతో చనిపోవడం తట్టుకోలేక తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఢిల్లీలోని లాడోసరాయ్‌లో జరిగింది. బిడ్డ అంత్యక్రియలు నిర్వహించిన 24గంటల్లోపే వారు ఆత్మహత్య చేసుకున్నారు. ఒడిశాకు చెందిన లక్ష్మీచంద్, బబితలు కొన్నేళ్లుగా లాడోసరాయ్ ఉంటున్నారు. ఇటీవల వారి కొడుకు అవినాశ్(7)కు డెంగీ సోకింది. దగ్గర్లోని ఆస్పత్రిలో చికిత్సచేసినా తగ్గలేదు. రెండు ఆస్పత్రులు పడకల్లేవని చేర్చుకోలేదు. మరో ఆస్పత్రిలో చేర్పించారు. వ్యాధి తీవ్రం కావడంతో అవినాశ్ సెప్టెంబర్ 8న చనిపోయాడు. అదే రోజు అంత్యక్రియలు నిర్వహించిన తల్లిదండ్రులు.. ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇంటి దగ్గర్లోని పాఠశాలలో మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇద్దరూ చేతులు కట్టేసుకుని భవంతి పై నుంచి దూకారు.