రోవాన్ వణికిస్తోంది..!
చెన్నై: తమిళనాడు తీరాన్ని 'రోవాన్' తుఫానుగా మారిన తీవ్ర వాయుగుండం వణికిస్తోంది. బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కారణంగా ఆ రాష్ట్రంలోని ప్రముఖ పట్టణాలైన చెన్నై, పుదుచ్ఛేరి, నాగపట్టణం,నామక్కళ్ తోపాటు కంచీపురం, తిరువళ్లూరు జిల్లాలను ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షం ముంచెత్తుతోంది. దీంతో లోతట్టు ప్రాంతాలన్ని జలమయ్యాయి. ముందుస్తు భద్రతా చర్యల్లో భాగంగా ఈ ప్రాంతాల్లో విద్యాసంస్థలు మూసి వేశారు. వీటికి తోడు వ్యాపార సముదాయాలు కూడా మూసి వేసి ఉంచారు.
జనజీవనం ఆయా ప్రాంతాల్లో స్తంబించిపోయింది. రహదారులపై రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో రవాణా వ్యవస్థతోపాటు కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సమస్య కూడా తలెత్తింది. తీర ప్రాంతాలు, సందర్శనీయ ప్రాంతాల్లోకి పర్యాటకులను రానివ్వకుండా ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. పుదుచ్ఛేరి తీరంలో ఇప్పటి వరకు మూడుసార్లు ప్రమాద హెచ్చరికలు విడుదల చేశారు. అంతకు ముందు అందిన సమాచారం ప్రకారం ఈ రోజు సాయంత్రానికి తుఫాను కారైకల్ తీరం దాటనుందని చెప్పినా రేపటి సాయంత్రానికి దాటుతుందని తాజాగా తెలిసింది. మరోపక్క, అధికారులు మాత్రం తుఫాను ప్రమాదం తప్పి పోయినట్లేనని చెప్తున్నారు. అయినా, పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా కన్పిస్తుంది. గంటకు 60 నుంచి 70 మైళ్ల వేగంతో బలమైన గాలులు వీస్తుండటంతోపాటు అవి శీతలగాలులు కావడంతో ప్రజలు బాగా ఇబ్బందులకు గురవుతున్నారు.
మరో 24గంటలపాటు తమిళనాడులో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. మరోపక్క, పుదుచ్ఛేరి ప్రాంతంలోనే కాస్తంతా ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అందుకు తగిన సురక్షిత ప్రాంతాలను కూడా ఇప్పటికే అధికారులు గుర్తించినట్లు తెలిసింది. ప్రమాదానికి అనువైన ప్రతి చోట పోలీసు క్యాంపులను, హెచ్చరిక సూచనలను ఏర్పాటుచేయడంతోపాటు షెల్టర్లు కూడా గుర్తించినట్లు తమిళనాడు అధికారులు తెలిపారు. 'పుదుచ్ఛేరి కుడ్డాలోర్ మధ్య కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని మేం భావిస్తున్నాం. వాటి నుంచి ప్రజలకు ఇబ్బందికలగకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తలు తీసుకున్నాం. ఆహారపొట్లాలు, కావాల్సినన్ని మందులు సిద్దం చేసి ఉంచాం. ఎనిమిది టీములు టాస్క్ ఫోర్స్ బృందాలు ఎప్పటికప్పుడు రక్షణ చర్యలను పర్యవేక్షిస్తున్నాయి' అని అక్కడి కలెక్టర్ డీ మనికందమ్ తెలిపారు.
మొత్తం మీద తమిళనాడులో 11 జిల్లాల్లో రోవాన్ తుఫాను ప్రభావం ఉంది. అన్ని తీరప్రాంత జాలర్లకు హెచ్చరికలు జారీ చేశారు. మరోపక్క, ఆంధ్రప్రదేశ్ తోపాటు తెలంగాణ దక్షిణ ప్రాంతాల్లో కూడా అక్కడక్కడా వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చిత్తూరు, నెల్లూరు, అనంతపురంలోని కొన్ని ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కృష్ణపట్నంలో ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మరో 24 నుంచి 48 గంటల్లో కేరళ, కర్ణాటకలో కూడా రోవాన్ తుఫాన్ ప్రభావం ఉండనున్నట్లు వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.