సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులో వరద పరిస్థితిలో ఎలాంటి పురోగతి లేదు. మూడు జిల్లాల్లో ఎటు చూసినా నిండా మునిగిన నివాస ప్రాంతాలు, చెరువుల్లా మారిన రోడ్లే కనిపిస్తున్నాయి. గత ఆరు రోజులుగా చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం జిల్లాల్లో కురుస్తున్న వర్షాల వల్ల శనివారం సాయంత్రం వరకు పది లక్షల ఇళ్లు నీటమునిగాయి. తమిళనాడు, పుదుచ్చేరిలోని తీర ప్రాంతాల్లో పరిస్థితి దయనీయంగా మారింది. గడిచిన 24 గంటల్లో నాగపట్నంలోని తలైనయిరులో 27 సె.మీ.లు, థిరుత్తరపోండిలో 24 సె.మీల చొప్పున వర్షపాతం నమోదైంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో సుమారు రెండు లక్షల ఎకరాల్లో పంట నీట మునిగిందని అధికారులు వెల్లడించారు. ముంపు ప్రాంతాలను ఎన్‌డీఆర్‌ఎఫ్ దళాలు హెలికాప్టర్‌లో తిరుగుతూ పర్యవేక్షిస్తున్నాయి. చెన్నై సహా ఆరు జిల్లాల్లో 208 వైద్య శిబిరాలను ఏర్పాటు చేసినట్లు ఆరోగ్య మంత్రి భాస్కర్ తెలిపారు. పట్టాలపై రెండు అడుగుల వరదనీరు చేరిపోవడంతో చెన్నై నుంచి రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. ప్రభుత్వంపై విమర్శలు చేయడం మాని వరద సహాయక చర్యల్లో పాల్గొనాల్సిందిగా నటుడు కమల్‌హాసన్ తన అభిమానులకు పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment