సాక్షి, చెన్నై: తమిళనాడును వర్షాలు ముంచెత్తుతున్నాయి. చెన్నై శివారు ప్రాంతాలు ఇప్పటికీ జలదిగ్భంధంలోనే ఉన్నాయి. వేలాది కుటుంబాలు సాయం కోసం ఎదురుచూస్తున్నాయి. కాంచిపురం, తిరువళ్లూరు జిల్లాలోని అనేక కాలనీల ప్రజలు వరదనీటిలో చిక్కుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. దాదాపు 10వేలమంది ప్రభుత్వ సహాయక శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. చెన్నై మహానగరంలో ఇళ్లలోకి చేరుకున్న వర్షపునీటిని కార్పోరేషన్ సిబ్బంది ఎప్పటికప్పుడు బయటకు తోడేస్తున్నారు. ప్రస్తుతానికి వర్షం తెరపివ్వటంతో ప్రజలు ఇళ్లు చక్కబెట్టుకునే పనిలో పడ్డారు. అయితే రానున్న 24 గంటలు ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశాలు జారీచేశారు.
జలదిగ్బంధంలోనే మనవాలనగర్
తిరువళ్లూరు: వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మనవాలనగర్‌లోని పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. తిరువళ్లూరు జిల్లా మనవాలనగర్‌లోని కపిలన్‌నగర్, ఎంజీఆర్ నగర్, రామర్‌వీధి ప్రాంతాల్లో దాదాపు 600 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ఈ ప్రాంతాలు లోతట్టుగా ఉండడంతో తరచూ ముంపునకు గురువుతున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన వర్షపు నీటితో దాదాపు వారి నివాసాలన్నీ మునిగిపోయాయి. ఎంజీఆర్‌నగర్‌లో చేరిన వర్షపు నీటితో తాము ఇక్కట్లు పడుతున్నామని అక్కడివారు తెలిపారు. వర్షపు నీటితో కలిసి మురికి నీరు చేరడంతో పారిశుద్ధ్యం లోపించి రోగాలు ప్రబలే అవకాశం ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంతవరకు అధికారులు స్పందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వర్షపు నీటిని తొలగించాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment