పుణేలో వరదల్లో కోట్టుకుపోతున్న వాహనాలు
సాక్షి ముంబై/ పింప్రి: పుణేకి వరుణుడే కాలయముడయ్యాడు. బుధవారం రాత్రి పుణేలోని పలు ప్రాంతాల వాసులకు కాలరాత్రిగా మారింది. ఆకాశానికి చిల్లులు పడ్డట్టుగా ఒక్కసారిగా కుండపోత వర్షం కురిసింది. మరోవైపు ఉరుములు మెరుపులతో ఈదురు గాలులు భయానక వాతావరణం సృష్టించాయి. నగర పరిసరాల్లో చూస్తుండగానే జలాశయాలు ఉప్పొంగాయి. రోడ్లు నదుల రూపందాల్చాయి. ఒళ్లు జలధరించేలా ఉగ్రరూపంగా ప్రవహించిన నీటి ప్రవాహంతో బుధవారం అర్దరాత్రి నుంచి గురువారం తెల్లవారుజాము వరకు కొన్ని గంటల వ్యవధిలోనే పుణేలోని పలు ప్రాంతాల్లో వరద నీరు చొరబడింది. దీంతో నీటి ప్రవహానికి రక్షణ గోడ కూలడంతో 12 మంది దుర్మరణం చెందారు. మరో నలుగురు ప్రవాహంలో కొట్టుకుపోయినట్టు తెలిసింది.
ఇదిలా ఉండగా రోడ్లపై పెద్ద ఎత్తున నీరు చేరింది. కాలువ ప్రవాహ ప్రాంతాల్లోని ఇళ్లల్లో సుమారు మొదటి అంతస్తు మునిగేంత నీరు చేరాయి. ఇలా దాదాపు అనేక పరిసరాల్లో సుమారు ఎనిమిది నుంచి 10 అడుగులకుపైగా నీరు చేరి ప్రజలను తీవ్ర భయబ్రాంతులకు గురిచేశాయి. మరోవైపు కాగితపు పడవల మాదిరిగా రోడ్లౖపై ఉన్న వందలాది కార్లు, బైకులు, ఆటోలు ఇతర వాహనాలు ప్రవాహంలో కొట్టుకుపోయాయి. సుమారు వేయికి పైగా పశువులు మృత్యువాత పడ్డాయి. పలు ఇళ్లకు నష్టం వాటిల్లగా, అనేక చెట్లు నేలకూలాయి. అనేక కుటుంబాలు కట్టుబట్టలతో వీధిన పడ్డాయి. ఇలా పుణేలోని అనేక మందికి బుధవారం రాత్రి కాలరాత్రిగా మారింది.
అరుణేశ్వర్ టాంగూవాల్‌కాలనీలో....
పుణేలోని అరణ్యేశ్వర్ ప్రాంతంలో టాంగేవాలే కాలనీలో ముందుగా ఐదు మృతదేహాలు లభించాయి. అనంతరం మిగతా మృతదేహాలు కనుగొన్నారు. గల్లంతైన వారికోసం ఎన్‌డీఆర్‌ఎఫ్‌కు చెందిన మూడు బలగాలు గాలిస్తున్నాయి. ఈ కాలనీ కాలువకు ఆనుకుని ఉండటంవల్ల ప్రజలు వరదల్లో చిక్కుకుపోయారు. ఇళ్ల గోడలు కూలి పలువురు మృత్యువాత పడగా మరికొందరు నీటి ప్రవహానికి కొట్టుకుపోయారు. వెలికి తీసిన మృతదేహాలను ససూన్ ఆస్పత్రిలో భద్రపరిచారు. కాత్రజ్ నుంచి దాండేకర్ వంతెన పరిసరాల వరకు ఇళ్లలో వర్షపు నీరు చేరింది. వందలాది కుటుంబాలు నిరాశ్రయులయ్యారు. ప్రహరి గోడలు కూలడంతో అనేక ఆపార్ట్‌మెంట్లలోకి నీరు చొచ్చుకుపోయింది. అందులో చిక్కుకున్న ప్రజలను అగ్నిమాపక సిబ్బంది, ఎన్‌డీఆర్‌ఎఫ్ బలగాలు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
గత మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. కాని బుధవారం రాత్రి నుంచి ఈ వర్షం మరింత జోరందుకుంది. గురువారం తెల్లవారు జాము వరకు కురిసిన వర్షం కారణంగా విద్యుత్ సరఫరా నిలిపివేశారు. దీంతో అంధకారంలోనే బిక్కుబిక్కు మంటూ గడుపుతున్నారు. చార్జీంగ్ చేయలేక మొబైల్ ఫోన్లు పనిచేయడం లేదు. దీంతో ఇతర ప్రాంతాల్లో ఉంటున్న తమ బంధువులతో సంప్రదించలేకపోతున్నారు. దీనికి తోడు విద్యుత్ లేక పార్వతి నీటి సరాఫరా కేంద్రంలో అంతరాయం ఏర్పడింది. దీంతో నీటి సరఫరా కాలేక ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. నవీపేట్, ప్రభాత్ మార్గం, లాల్‌బహాదూర్ మార్గం, లోకమాన్య కాలనీ, డెక్కన్, పులాచీ వాడి, పునా హాస్పిటల్, పాఠక్ బాగ్, రాజేంద్ర నగర్, కొండ్వా, మార్కెట్ యార్డు, ధనక్‌వాడి, బాలాజీనగర్, సహకార్ నగర్, సాతారా రోడ్డు పరిసరాల్లో గురువారం నీటి సరఫరా జరగకపోవడంతో తాగు నీటి కోసం అల్లాడుతున్నారు.
నిలిచిపోయిన రాకపోకలు...
భారీ వర్షాల కారణంగా సాస్‌వడ్–జేజూరి రహదారిపై ఉన్న వంతెన కూలడంతో బారామతికి రాకపోకలు నిలిచిపోయాయి. ఈ మార్గం మీదుగా నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తాయి. కాని వంతెన కూలడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. వాహనాల్లో చిక్కుకున్న ప్రయాణికుల వెతలు వర్ణనాతీతంగా మారాయి. కాగా బారామతి, పురందర్ తాలూకాలో కురిసిన భారీ వర్షాలకు పలు నదులలో వరద పరిస్థితి ఏర్పడింది. అనేక గ్రామాలకు బయట ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి.
నదీ తీరానికి సమీపంలో ఉన్న గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇదివరకు ఈ తాలూకాలోని 15 వేల మందిని, బారామతిలోని 8 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అంబీ, అంబీకుర్డ్, మోరేగావ్, తర్డోలి, మాలవాడి, బాబుర్డి, జల్గావ్‌పటూర్, జల్గావ్ ఘాపే గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ గ్రామాలను ప్రాంతాధికారి దాదాసాహెబ్ కాంబ్లే, తహసిల్దార్ విజయ్ పాటిల్ సందర్శించారు. భారీ వర్షం కురిసే అవకాశముండడంతో హై అలర్ట్ ప్రకటించారు. ఇక కరాడ్‌లోనూ కురిసిన భారీ వర్షాలకు పంట పొలాలు నీట మునిగాయి.
ఇలాంటి వర్షం చూడనేలేదు..
70 సంవత్సరాల్లో ఇలాంటి వర్షాన్ని, వరదని జీవితంలో ఎన్నడు చూడలేని అనేక మంది స్థానికులు మీడియాకు తెలిపారు. ఒక్కసారిగా కేవలం ఆరు ఏడు గంటల్లోనే భారీ వర్షం కురవడంతో జలాశయాలు ఉప్పొంగాయని దీంతో ఆ నీరు రక్షణ గోడను కూల్చేసి కాలువలను దాటుకుని రోడ్లపైకి, జనావాసాల్లోకి చొరబడ్డాయని తెలిపారు. ఇలా వరదనీరు ఒక్కసారిగా భారీ మొత్తంలో నగరంతోపాటు తీర ప్రాంతాలన్ని ముంపునకు గురయ్యాయి.
మూడు రోజులపాటు భారీ వర్షాలు...
పుణేతోపాటు మధ్య మహారాష్ట్రలో మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో గురువారం పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. మరోవైపు నదులలో, జలాశయాలలో నీరు ప్రమాదకర స్థాయిలో ఉండటంతో అందరు అప్రమత్తంగా ఉండాలని గ్రామ ప్రజలను హెచ్చరించారు. ఏ క్షణంలోనైనా డ్యాంల్లోంచి నీరు వదిలే ప్రమాదముంది. దీంతో నదులలో ప్రవాహం మరింత అధికమవుతుందని హెచ్చరించారు. అయితే వదంతులను నమ్మవద్దని పిలుపునిచ్చారు.
చిన్నారిని కాపాడిన అగ్నిమాపక సిబ్బంది..
పుణే మిత్రమండలి చౌక్‌లో 10 నెలల బాలున్ని మారుతి దేవకులే అనే అగ్నిమాపక సిబ్బంది సురక్షితంగా కాపాడి బయటికి తీసుకవచ్చారు. ఆ చిన్నారిని కాపాడే సమయంలో తీసిన వీడియోతో ఈ విషయం బయటపడింది. ఒక్కసారిగా కురసిన భారీ వర్షాల కారణంగా మిత్రమండలి చైక్‌లో బాలునితోపాటు అతని తల్లిదండ్రులు, తాత, అమ్మలు వరద నీటిలో చిక్కుకుపోయారు. అయితే మారుతి దేవకులే ఎంతో ధైర్యంతో చిన్నారితోపాటు అందరిని సురక్షితంగా కాపాడాడు. పుణేలో మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిసి అనేక మంది పుణేవాసులు భయందోళనలు చెందుతున్నారు. గురువారం రాత్రి మళ్లీ ఏం జరుగుతుందోనని భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదు..
‘‘పుణే నగరంతోపాటు చట్టుపక్క ప్రాంతాల్లో వరదల కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. గూడు కోల్పొయి వేలాది మం ది నిరాశ్రయులయ్యా రు. పదుల సంఖ్యలో మతి చెందారు. రూ. కోట్లలో ఆస్తి నష్టం వాటిళ్లింది. అయినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదు’’ ప్రతిపక్ష నేత విజయ్ వడెట్టివార్ ఆరోపించారు. ఇలాంటి విపత్కర సమయంలో బాధితులను అన్ని విధాలుగా ఆదుకోవాలని, కాని వారిని ఇలా గాలికి వదిలేసి మీ పాట్లు మీరు పడండంటూ జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఢిల్లీకి వెళ్లడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment